
శాసనసభలో చంద్రబాబు ప్రవర్తన భయానకంగా ఉందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు.
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల పాలనలోనే ఎన్నికల హామీలన్నీ పూర్తిస్థాయిలో నెరవేర్చామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శనివారం వైఎస్సార్‌సీసీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జనవరి 9న ప్రవేశ పెట్టనున్న అమ్మ ఒడి పథకంతో అన్ని హామీలు పూర్తి అవుతాయని పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వ పాలనలో శాసనసభ సమావేశాల్లో ఎన్నికల హామీలు, ప్రజల సంక్షేమం పై చర్చించ లేదని.. వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత గత అసెంబ్లీ సమావేశాల్లోనే 19 బిల్లులు ఆమోదం పొందాయని తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బడుగు, బలహీన వర్గాలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు.
అభివృద్ధిని అడ్డుకుంటున్నారు..
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఐదు రోజల శాసనసభ సమావేశాలను స్తంభింపచేయాలని ప్రయత్నాలు చేశారని, సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్‌సీపీ కి ప్రజలు ఇచ్చిన 151 సీట్ల ప్రజాతీర్పును చంద్రబాబు ఓర్వలేకపోతున్నారన్నారు. ‘దిశ’ చట్టంపై చర్చ జరుపుతామంటే.. ఉల్లి ధరల గురించి రాద్ధాంతం చేయాలని చూశారని మండిపడ్డారు. ప్రజలకు ఉల్లి కొరత తీర్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు చేపట్టారని.. కేజీ ఉల్లి రూ.25లకే అందుబాటులో ఉంచారని తెలిపారు. ఇంగ్లీషు విద్య, అమ్మఒడి, నాడు-నేడు, రివర్స్ టెండరింగ్.. అన్నింటిలోను చంద్రబాబు అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై చర్చిస్తే.. చంద్రబాబు రాజకీయం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని.. ఆయన పాలనలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విధానాలను ఖూనీ చేశారన్నారు. ప్రజలు తిరస్కరించినా ఆయనలో మార్పు రాలేదన్నారు. శాసనసభలో చంద్రబాబు ప్రవర్తన భయానకంగా ఉందన్నారు.
రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు..
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చామని పేర్కొన్నారు. నాడు-నేడు కార్యక్రమంతో రాష్ట్రంలో పాఠశాలలకు రూ. 3,500 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించనున్నామన్నారు. ప్రజలు కోరుకునే పరిపాలన వైఎస్ జగన్ అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో దిశ చట్టం నిలిచిపోతోందన్నారు. శాసనసభలో దిశ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు చంద్రబాబు అండ్ కో బయటకు వెళ్లిపోయిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం పాలన అవినీతి కంపుగా మారిందన్నారు. ఏడు నెలల పాలనపై త్వరలో శ్వేత పత్రం విడుదల చేస్తామని విష్ణు పేర్కొన్నారు.