సామాన్యులే... మాన్యులు | Sakshi
Sakshi News home page

సామాన్యులే... మాన్యులు

Published Tue, Mar 19 2019 9:11 AM

YSRCP Gives MP Tickets To Middle Class People - Sakshi

వారంతా సాధారణ కార్యకర్తలు. కానీ, ప్రజా సేవలో అసాధారణ అవకాశం అందుకున్నారు. వైఎస్సార్‌సీపీ అండతో లోక్‌సభ టికెట్‌లు దక్కించుకుని బలమైన ప్రత్యర్థులతో ఢీకి సిద్ధమంటున్నారు.  

రాజ వంశీకుడిపై.. సాధారణ గిరిజన మహిళ
గొడ్డేటి మాధవిని విశాఖ జిల్లా అరకు లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించగానే రాష్ట్రం యావత్తు ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆమె ఇక్కడ ఎదుర్కొనబోయేది టీడీపీ అభ్యర్ధి రాజ వంశీకుడు, కేంద్ర మాజీ మంత్రి కిశోర్‌చంద్రదేవ్‌. అలాంటి నాయకుడిపై పోటీకి నిలిపినందున అసలీ మాధవి ఎవరనేది చర్చకు వచ్చింది. ఆమె కొన్ని నెలల క్రితం వరకు విశాఖపట్నం ఏజెన్సీ కొయ్యూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్టు పీఈటీ. అరకు పరిధిలో అత్యధికంగా ఉన్న కొండ దొర తెగకు చెందిన సాధారణ గిరిజన మహిళ. పార్టీలోకి రావాల్సిందిగా ఇటీవల వైఎస్సార్‌సీపీ నుంచి మాధవికి ఆహ్వానం అందింది. వైఎస్‌ జగన్‌ పాదయాత్ర విశాఖపట్నం జిల్లా చేరినప్పుడు ఆమె పార్టీలో చేరారు. వెంటనే అరకు లోక్‌సభ నియోజకవర్గ  సమన్వయకర్తగా నియమించారు. అప్పటినుంచి చురుగ్గా వ్యవహరిస్తూ గిరిజనుల్లో గుర్తింపు సాధించారు. దీంతో ఇచ్చిన మాట నిలుపుకొంటూ, అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజనులకు గుర్తింపునిస్తూ వైఎస్‌ జగన్‌ ఆమెను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. 

అతి సామాన్యుడు  
నందిగం సురేష్‌... పార్టీలో సామాన్య కార్యకర్త. మాదిగ సామాజిక వర్గంలోని దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు. ఈయన్ని బాపట్ల లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో ఆశ్చర్యం, సంచలనం రెండూ రేపాయి. అయితే రాజధాని ప్రాంతంలో చంద్రబాబు ప్రభుత్వ భూ దందాలు, దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నిబద్ధుడైన పార్టీ కార్యకర్తగా ఉద్యమాలు చేసిన సురేష్‌ను అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తించి టికెట్‌ ఇచ్చారు. అంతేకాదు ఇడుపులపాయలో పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితాను సురేష్‌ ద్వారా విడుదల చేయించారు. ఎన్నికల్లో డబ్బు వెదజల్లి గెలిచే ఆలోచనలో ఉన్న టీడీపీ వర్గాలు ఈ పరిణామంతో అవాక్కయ్యాయి. దీనిని ఎలా తిప్పికొట్టాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డాయి.
 
దండెత్తిన సామాన్యుడు
దువ్వాడ శ్రీనివాస్‌... శ్రీకాకుళం జిల్లాలో విచ్చలవిడి అవినీతి,  అరాచకాలకు పాల్పడుతున్న కింజరాపు కుటుంబాన్ని సవాల్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ నిలిపిన అభ్యర్థి. సిట్టింగ్‌ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కుటుంబం జిల్లాలో ఇసుక, గ్రానైట్, కాంట్రాక్టు దందాలతో యథేచ్ఛగా దోపిడీకి పాల్పడింది. తమను ఎదిరించేవారిపై దాడులతో బెంబేలెత్తించింది. వారితో పోలిస్తే దువ్వాడ శ్రీనివాస్‌ సామాన్యుడు. జిల్లాలో అత్యధికంగా ఉన్న కాళింగ సామాజిక వర్గానికి చెందిన నేత. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో జెడ్పీటీసీ సభ్యునిగా ఎన్నికై ఉపాధ్యక్షుడయ్యారు. అనంతరం జిల్లాలో థర్మల్‌ ప్లాంట్ల వ్యతిరేక ఉద్యమాలు నిర్వహించి ప్రజల్లో మంచి గుర్తింపు సాధించారు. తన వ్యాపారాలను కింజరాపు కుటుంబం దెబ్బతీసినా శ్రీనివాస్‌ వెనకడుగు వేయలేదు. 2014 ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గంలో అచ్చెన్నాయుడుపై స్వల్ప తేడాతో ఓడిపోయారు. కానీ, చిత్తశుద్ధితో పనిచేస్తున్న శ్రీనివాస్‌కు వైఎస్‌ జగన్‌ మరో పెద్ద అవకాశం కల్పించారు.
 
మహారాజుపై పోటీకి రైతుబిడ్డ 
బెల్లాన చంద్రశేఖర్‌... విజయనగరం లోక్‌సభ  స్ధానం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి. రాజ కుటుంబానికి చెందిన అశోక్‌ గజపతి రాజుపై ఆయన పోటీ చేస్తున్నారు. సంపన్నుడైన అశోక్‌పై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సాధారణ రైతు బిడ్డ బెల్లాన చంద్రశేఖర్‌ను నిలపడం విశేషం. ఈయన విజయ నగరంతో పాటు ఉత్తరాంధ్రలో అత్యధికంగా ఉన్న తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. మధ్య తరగతి కుటుంబం. సర్పంచ్‌ నుంచి అంచలంచెలుగా ఎదిగారు. 2014 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా, పార్టీనే నమ్ముకుని ఉన్నారు. దీంతో వైఎస్‌ జగన్‌ ఆయనకు మరింత పెద్ద అవకాశం ఇచ్చారు. 

పోలీస్‌ పవర్‌ 
కొన్ని నెలల క్రితం వరకు సాధారణ సీఐగా ఉన్న గోరంట్ల మాధవ్‌ను హిందూపూర్‌ ఎంపీ అభ్యర్థ్ధిగా ప్రకటించడం రాజకీయాల్లో సంచలనం రేపింది. సిన్సియర్‌ పోలీస్‌ అధికారి. పోలీసు అధికారుల సంఘం ఉపాధ్యక్షుడిగా తమ గౌరవానికి భంగం కలిగిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేవారు కాదు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబ దౌర్జన్యాలు, అరాచకాలను అడ్డుకున్నారు. మీసం మెలేసి మరీ సవాల్‌ చేశారు. ఈ క్రమంలోనే ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాజీవితంలోకి రావాలని భావించారు. వైఎస్సార్‌సీపీ అవకాశం కల్పించింది. ఆర్థికంగా, సామాజికంగా బలమైన వర్గాల ప్రభావం ఉండే జిల్లాలో బీసీ వ్యక్తికి ఎంపీ టికెట్‌ ఇవ్వడం సంచలనమైంది.

Advertisement
Advertisement