హోదాపై బాబు పచ్చి మోసం

YS Jagan Fires On Chandrababu At Ananthapur Public Meeting - Sakshi

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

నాలుగేళ్లపాటు బీజేపీతో కలిసి కాపురం చేశాడు  

ప్రత్యేక హోదా కోసం ఏనాడూ నోరు విప్పలేదు  

హోదా సంజీవనా అని ఎదురు ప్రశ్నించాడు 

హోదా కావాలని అడిగితే కేసులు పెట్టించాడు  

ఎన్నికల ముందు నల్ల చొక్కాలు వేసుకుని కొత్త డ్రామాలు  

‘పార్లమెంట్‌’ ముగిశాక ఢిల్లీకి వెళ్లి దీక్ష చేశాడు

ఎన్నికలు వస్తుండడంతో బాబు డబ్బు మూటలు పంపుతున్నాడు

మనం రాక్షసులు, మోసగాళ్లతో పోరాటం చేస్తున్నాం...  

వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తేవాల్సిన బాధ్యత మీపై ఉంది

అనంతపురంలో పార్టీ శ్రేణులకు వైఎస్‌ జగన్‌ పిలుపు

అనంతపురం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి:  ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి మోసం చేస్తున్నాడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. నాలుగేళ్లపాటు బీజేపీతో కలిసి కాపురం చేసి ఏనాడూ హోదా గురించి నోరువిప్పని బాబు ఇప్పుడు ఎన్నికల ముందు కొత్త డ్రామాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. అనంతపురంలో సోమవారం ఎన్నికల సమర శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. ‘‘నాలుగేళ్లపాటు చంద్రబాబు, బీజేపీ చిలకా గోరింకల్లా కలిసి కాపురం చేశారు. టీడీపీ ఎంపీలు కేంద్రంలో మంత్రులుగా పనిచేశారు. బీజేపీ వాళ్లు చంద్రబాబును పొగిడారు. చంద్రబాబు బీజేపీని కీర్తిస్తూ ఏకంగా అసెంబ్లీలోనే తీర్మానం చేశారు. నాలుగేళ్లు ఒకరినొకరు పొగుడుకున్నారు. వీరి కాపురాన్ని చూసి చిలకా గోరింకలే అసూయ పడే పరిస్థితి.

నాలుగేళ్లలో చంద్రబాబు ఒక్కసారైనా పత్యేక హోదా గురించి అడిగిన పాపాన పోలేదు. హోదా ఆకాంక్షకు తూట్లు పొడిచారు. అసెంబ్లీనే సాక్షిగా చేస్తూ హోదాను వెటకారం చేశారు. దానివల్ల ఏం మేలు జరిగిందని అన్నాడు. హోదా సంజీవనా అని ఎదురు ప్రశ్న వేశాడు. హోదా కావాలని అడిగితే దగ్గరుండి మరీ కేసులు పెట్టించాడు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని పొగిడాడు. మోదీ మన రాష్ట్రానికి చేసినంత ఇంకే రాష్ట్రానికి చేశాడో చెప్పాలంటూ 2017 జనవరి 27న ప్రతిపక్షాలకు సవాల్‌ విసిరాడు. నాలుగేళ్లపాటు ఇన్ని చేసి, ఎన్నికల ముందు బీజేపీతో విడాకులు తీసుకున్నాడు, నల్లచొక్కా వేసుకున్నాడు. పార్లమెంట్‌ సమావేశాలు ముగిశాక ఢిల్లీకి వెళ్లి దీక్ష చేశాడు’’ అని జగన్‌ దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తీసుకు రావాల్సిన బాధ్యత కార్యకర్తల భుజస్కందాలపైనే ఉందని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సమర శంఖారావం సభలో జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే...  

‘‘ప్రత్యేక హోదా విషయంలో 5, 10 ఏళ్లు కాదు ఏకంగా 15 ఏళ్లు ప్రత్యేక హోదా తెస్తానన్న చంద్రబాబు డైలాగ్‌ మన చెవుల్లో ఇంకా మార్మోగుతూనే ఉంది. ఎన్నికల్లో గెలవడానికి ఆయన ఏ కులాన్నీ వదల్లేదు. వాల్మీకులను ఎస్టీలుగా, కురుబలను ఎస్టీలుగా, రజకులను ఎస్సీలుగా, గాండ్లను ఎస్సీలుగా, మత్స్యకారులను ఎస్సీలుగా చేస్తానని డైలాగ్‌లు మీద డైలాగ్‌లు కొడుతూ ప్రతి కులాన్ని మోసం చేశాడు. మూడేళ్లలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చాడు. ఆపదలో ఉన్న మహిళకు ఐదు నిమిషాల్లో సాయం అందిస్తామన్నాడు. రాష్ట్రానికి బుల్లెట్‌ రైలు తీసుకొస్తానన్నాడు. 2014లో ముఖ్యమంత్రి అయ్యాడు, ఐదేళ్లు పాలించాడు. ఒక్క హామీనైనా అమలు చేశాడా అని అడుగుతున్నా. ఐదేళ్లలో చేసిందేమీ లేదు గానీ ఇప్పుడు స్టోరీ మార్చాడు. రాష్ట్రంలో ఐదేళ్లుగా విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. మట్టి, ఇసుక, మద్యం, పేదల భూములు, దేవాలయ భూముల, దళితుల భూములను సైతం వదల్లేదు. కింద జన్మభూమి కమిటీల మాఫియాను పెట్టాడు. ఆ మాఫియాతో గ్రామాలను దోచుకుంటున్నాడు. రాష్ట్రంలో అంగుళం అంగుళం దోచుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం.   

మీకు అండగా ఉంటా..  
అనంతపురం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన దాదాపు 55 వేల మంది బూత్‌ కమిటీ సభ్యులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. మీరంతా తొమ్మిదేళ్లుగా నాతోపాటు నడిచారు, నాకు అండగా నిలిచారు, ఇన్నేళ్లూ మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. అధికారంలో ఉన్నవారు మనల్ని కష్టాలు, బాధలు పెట్టారు. మీరు పడ్డ కష్టనష్టాలు నాకు తెలుసు. మీరే కాదు, 13 జిల్లాల్లో మన పార్టీలో ఉన్నవారు అనుభవిస్తున్న కష్టాలు నాకు తెలుసు. ఎన్ని నష్టాలు భరించారో కూడా తెలుసు. మీకు తగిలిన ప్రతి గాయం నా గుండెకు తగిలిందని గట్టిగా చెబుతున్నా. మీలో ప్రతి ఒక్కరినీ, మీ బాగోగులను కచ్చితంగా నేను చూసుకుంటా. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా మీ అందరినీ పైకి తెస్తానని హామీ ఇస్తున్నా. ఈ ఐదేళ్ల టీడీపీ పాలనలో 1,280 మందిపై అక్రమ కేసులు బనాయించారని మన పార్టీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌ చెబుతున్నాడు. మీ అందరిపై ఉన్న అన్ని దొంగ కేసులను మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపసంహరించే కార్యక్రమాన్ని చేపడతామని హామీ ఇస్తున్నా.  

సంక్షేమ పథకాలు అందరికీ అందాలి  
మన ప్రభుత్వ ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఒక్కరికీ అందాలి. కులం, మతం, ప్రాంతం, వర్గాలు, రాజకీయాలు, పార్టీలకతీతంగా అవినీతి లేని స్వచ్ఛమైన పాలన ప్రతి పేదవాడికి, ప్రజలకు అందాలి. ఇందుకు క్రీయాశీలక పాత్ర పోషించేది మీరే. ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఈ నెలాఖరులో షెడ్యూల్‌ వస్తుందని అంటున్నారు. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మీ అందరిపై ఉంది. మనం నీతి, న్యాయం గల వ్యక్తులతో పోరాటం చేయడం లేదు. రాక్షసులతో పోరాటం చేస్తున్నాం, అన్యాయానికి ప్రతిరూపంగా ఉన్న వ్యక్తులతో, మోసగాళ్లతో యుద్ధం చేస్తున్నాం. ఎన్నికలు వచ్చేసరికే ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు కార్యక్రమాలు జరుగుతున్నాయి. వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్న ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారు. ఈ విషయంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. మీరంతా ఓటర్ల జాబితాను సరిచేసుకోవాలి. ప్రతి గ్రామంలోనూ మనపై అభిమానం చూపించే ఓటర్ల పేరు ఓటర్ల జాబితాలో ఉన్నాయా లేదా అనేది సరి చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉంది. ఓటర్లుగా మన పేరు తొలగించి ఉంటే మరలా ఫారం–6, 7లను పూరించి, తిరిగి ఓటర్ల జాబితాలో పేర్లను నమోదు చేయించుకోవాలి. మన రాష్ట్రంలో ఒక్కొక్కరికి రెండు ఓట్లు నమోదైన పరిస్థితి చూస్తున్నాం. దొంగ ఓట్లను తొలగించాల్సిన భాద్యత అందరిపైనా ఉంది. దొంగ ఓట్లను తొలగించి, మన సానుభూతిపరుల ఓట్లను జాబితాలో పొందుపరిచే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.  

బాహుబలి సెట్టింగ్‌లే రాజధాని!  
రాజధానిలో ఒక్క శాశ్వత నిర్మాణం కూడా ప్రారంభించలేదు. రాజధాని భూములను మాత్రం లంచాలు తీసుకుని అడ్డగోలుగా అమ్మేసుకుంటాడు. రాజధాని ఎక్కడుందని అడిగితే బాహుబలి సినిమా సెట్టింగ్‌లు చూపిస్తున్నాడు. సెట్టింగ్‌లే రాజధాని అంటున్నాడు. ఐదేళ్లుగా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ధ్యాస బాబుకు లేకుండాపోయింది. రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. ఇన్నాళ్లూ పిల్లలను వంచించాడు. తీరా ఇప్పుడు ఎన్నికల ముందు ముష్టి వేసినట్లుగా కొందరికి మాత్రమే అరకొరగా భృతి ఇచ్చి సినిమా చూపిస్తున్నాడు. బాబుకు ఇప్పటిదాకా అవ్వా తాతలు గుర్తుకు రాలేదు. వారి బాధలు పట్టలేదు. జగన్‌ రూ.2 వేలు ఇస్తానన్నాడు కాబట్టి తాను కూడా రూ.2 వేల పెన్షన్‌ ఇస్తానంటున్నాడు. జగన్‌ చెప్పాడు కాబట్టే తాను ఇస్తానని చెబుతున్నాడు. ట్రాక్టర్లకు రోడ్డు పన్ను తీసేస్తానని జగన్‌ చెప్పాడా... ఆటో, ట్యాక్సీకి రూ 10 వేలు ఇస్తానని జగన్‌ చెప్పాడా... ఎన్నికలకు మూడు నెలల ముందు జగన్‌ చెప్పాడు కనుక తానూ ఇస్తానని చంద్రబాబు అన్నాడు. ఆటో డ్రైవర్ల నుంచి ఖాకీ చొక్కాలు గుంజుకుని తాను వేసుకుంటున్నాడు.  

కాపీ కొట్టడం కూడా బాబుకు రాదు  
ప్రతి కులానికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ప్రతి అక్కకు సంవత్సరానికి రూ.75 వేలు ఇస్తామని నేను ప్రకటించిన తరువాత ప్రతి కులానికి కార్పొరేషన్‌ తాను కూడా ఏర్పాటు చేస్తానని చంద్రబాబు ప్రకటించాడు. ఐదేళ్లపాటు ఆయనకు కార్పొరేషన్ల సంగతి గుర్తుకురాలేదు. ప్రతి కులానికి కార్పొరేషన్‌ కింద ఆరో బడ్జెట్‌లో నిధులిచ్చారు. అంటే ఆ బడ్జెట్‌ ఆయన హాయంలో రాదు. మూడు నెలల తరువాత ఎవరిని దేవుడు దీవిస్తారో...ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారో వారు ముఖ్యమంత్రి అవుతారు. కానీ, తన హాయంలో రాని బడ్జెట్‌లో కార్పొరేషన్లకు చంద్రబాబు నిధులు కేటాయించారు. 2013లో ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన బీసీ డిక్లరేషన్‌ను ఆయన పట్టించుకోలేదు. బీసీల కోసం అప్పట్లో ఆయన ఇచ్చిన 119 హామీలకు దిక్కు లేకుండా పోయింది. ఇప్పుడు ఎన్నికలకు ముందు రాజమండ్రికి వెళ్లి మరో బీసీ డిక్లరేషన్‌ ప్రకటించాడు. జగన్‌ చెప్పాడని అంగన్‌వాడీలకు, వీఆర్‌ఏలకు, ఆశా వర్కర్లకు, హోం గార్డులకు జీతాలు పెంచాడు. కేవలం ఇవన్నీ ఆరునెలల కోసం పెంచాడు. 57 నెలలపాటు ప్రజల కడుపు కాల్చి, చివరిలో ఎవరైనా అన్నం పెడతానంటే ఆ వ్యక్తిని అన్న అంటారా...దున్నా అంటారా? చంద్రబాబు ఇస్తున్న హామీలు కేవలం కొత్త సినిమా వాల్‌పోస్టర్లలా వున్నాయి. పథకాలను సక్రమంగా కాపీ కొట్టడం కూడా చంద్రబాబుకు చేతకావడం లేదు. జగన్‌ దగ్గర నుండి పథకాలను ఎలా కాపీ కొట్టాలో కూడా ఆయనకు తెలియడం లేదు. ఇలాంటి కాపీరాయుళ్లకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. జగన్‌ చెప్పాడు గనుక అనేక పథకాలను మోసపూరితంగా చంద్రబాబు ప్రకటించినప్పటికీ జనం మాత్రం నిన్ను నమ్మం బాబు అని తేల్చిచెబుతున్నారు. ఓ రాక్షసుడు పంచభక్ష్య పరమాన్నాలు వండి ప్రజలను భోజనాలకు పిలిచాడండే అది మనకు భోజనం పెట్టడానికి కాదు. భోజనానికి Ðవెళ్లిన మనల్ని భోంచేయడానికేనని గుర్తుంచుకోవాలి. చంద్రబాబు కూడా అచ్చం రాక్షసుడిలాగే, అచ్చం నారాసురుడిలాగే ఉన్నాడని ప్రజలే చెబుతున్నారు.  

ఆరో బడ్జెట్‌ సినిమా  
చంద్రబాబు తన పాలన చివరిలో ఆరో బడ్జెట్‌ అనే పేరుతో సినిమా తీశాడు. సాధారణంగా ఎన్నికల ఏడాదిలో సిబ్బంది జీతభత్యాలతో కూడిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌నే పెడతారు. కానీ, చంద్రబాబు రూ.2.26 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పథకాలకు కేటాయింపులు చేయడం మోసపూరితం. ఇది ప్రజలను మరోసారి మోసం చేయడమే. జగన్‌ పథకాలను కాపీ కొట్టడం చేతకాక సగం సగం కాపీ కొట్టడమే ఈ ఆరో బడ్జెట్‌. ఈ ఆరో బడ్జెట్‌ సినిమా గురించి గ్రామగ్రామాన చెప్పండి. ఇక మూడు నెలల్లో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, మనందరి సంక్షేమం కోసం జగనన్న పథకాలు ప్రవేశపెడతారని ప్రజలకు చెప్పండి. ఈ మోసపూరిత పాలనను నమ్మొద్దంటూ గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ చెప్పండి’’ అని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
  
‘సమర శంఖారావం’ విజయవంతం  
జననేతను చూడడానికి, ఆయన ప్రసంగం వినడానికి ప్రజలు మండుటెండలోనూ భారీగా తరలివచ్చారు. అనంతపురం వేదికగా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమర శంఖారావం సభ గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యింది. భారీ జన సందోహం మధ్య వైఎస్‌ జగన్‌ ఎన్నికల శంఖారావాన్ని పూరించడం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఆయన తొలుత తటస్థ ప్రభావితులతో సమావేశమయ్యారు. విద్య, వైద్యాన్ని ప్రైవేటుపరం చేస్తూ పేదలను చంద్రబాబు సర్కార్‌ వేధిస్తోందని తటస్థులు జననేతకు వివరించారు. గత పక్షం రోజులతో పోల్చితే సోమవారం అనంతపురంలో ఎండ తీవ్రత పెరిగింది. షెడ్యూల్‌ ప్రకారం మధ్యాహ్నం 1 గంటకు సమర శంఖారావం సభాస్థలికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేరుకోవాలి. అనంత వీధుల్లో జన సందోహం పోటెత్తడంతో మధ్యాహ్నం 2.50 గంటలకు సభాస్థలికి చేరుకున్నారు. మండటెండను కూడా లెక్క చేయకుండా ప్రజలు జననేత కోసం వేచిచూశారు. ఆయనను చూడగానే కేరింతలు కొట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను కడిగిపారేస్తూ జగన్‌ చేసిన విమర్శలకు ప్రజలను నుంచి భారీ స్పందన లభించింది.   

బాబు చేయని మోసం ఉంటుందా?  
ఎన్నికలు వచ్చే సరికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేయని మోసం ఉండదు, చెప్పని ఆబద్ధం ఉండదు, వేయని డ్రామా ఉండదు, చూపని సినిమా ఉండదు. కాబట్టి మీరంతా అప్రమత్తంగా ఉండాలి. మనం పోరాటం చేస్తున్నది ఒక్క చంద్రబాబుపైనే కాదు, చంద్రబాబుకు సంబంధించిన ఎల్లోమీడియాతో చేస్తున్నాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9తో పోరాటం చేస్తున్నాం. ఇంతమందితో యుద్ధం చేస్తున్నాం. వారంతా చంద్రబాబును భుజాన ఎత్తుకొని మోస్తున్నారు. చంద్రబాబు అబద్ధాలను, మోసాలను మోయడానికి వారు సిద్ధంగా ఉన్నారు.

సీ విజిల్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి
మనందరి కోసం ఎన్నికల సంఘం సీ విజిల్‌ అనే ఓ ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ఆ యాప్‌ను మన స్మార్ట్‌ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని, తెలుగుదేశం పార్టీ వారు చేస్తున్నా అన్యాయమైన కార్యక్రమాలను మీ సెల్‌ఫోన్‌లో రికార్డ్‌ చేసి నేరుగా ఎన్నికల సంఘానికి పంపించవచ్చు. అన్యాయానికి పాల్పడేవారి తాట తీస్తుంది ఎన్నికల సంఘం. చంద్రబాబు చేస్తున్న మోసాలు, తీస్తున్న సినిమాల గురించి ప్రతి గ్రామంలో ప్రచారం చేయాలి. చంద్రబాబు మూడు సినిమాల గురించి చెప్పండి. అందులో మొట్టమొదటి సినిమా 2014 ఎన్నికలు. అందులోని మొదటి డైలాగ్‌ వ్యవసాయ రుణాల మాఫీ. రైతుల ఖర్చుల మీద 50 శాతం లాభం వేసి కనీసం మద్దతు ధర పెంచుతామని మరో డైలాగ్‌. డ్వాక్రా రుణాలు, పొదుపు సంఘాల రుణాలు మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని ఇంకో డైలాగ్‌. సినిమా అంతటితో ఆగిపోలేదు. ప్రతి పేదవాడికి ఇల్లు, ఇంటికో ఉద్యోగం, జాబు రావాలంటే బాబు రావాలి అన్న మరో డైలాగు. జాబు ఇవ్వకపోతే ప్రతి నెలా నిరుద్యోగ భృతి కింద రూ.2 వేలు ఇస్తానన్నాడు. 

రైతుల చెవుల్లో పూలు పెట్టే యత్నం 
ఎన్నికలు దగ్గరకొస్తుండడంతో చంద్రబాబు రెండో సినిమా మొదలుపెట్టాడు. ఎన్నికల ముందు మూడు నెలలు ఆయన తీసిన రెండో సినిమా. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేదు. అయినా ఎన్నికల ముందు ఆ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తానంటున్నాడు. గత ఎన్నికల ముందు డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. గద్దెనెక్కాక మాట మార్చేశాడు. బాబు నిర్వాకం వల్ల డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలు రూ.14,000 కోట్ల నుంచి ఏకంగా రూ.25,000 కోట్లకు చేరాయి. ఇప్పుడు పసుపు–కుంకుమ అంటూ మరో డ్రామా ఆడుతున్నాడు. ఎన్నికలకు మూడు నెలల ముందు డ్వాక్రా మహిళలను మోసం చేస్తున్నాడు. పెట్టుబడి నిధి కింద ప్రతి రైతుకు రూ.50 వేలు ఇస్తామని మనం చెప్పాం. గత ఐదేళ్లుగా రైతులకు ఇవ్వాల్సింది చంద్రబాబు ఏదీ ఇవ్వలేదు. కానీ, ఎన్నికలు వస్తుండడంతో ఆరో బడ్జెట్‌ ప్రవేశపెట్టాడు. తనకు అధికారం లేని బడ్జెట్‌. రూ.5 వేల కోట్లతో రైతు సుఖీభవ అంటూ చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. రైతు రుణమాఫీ పూర్తి కాలేదు. నాలుగో విడత, ఐదో విడత కింద చంద్రబాబు ఇచ్చిన చెక్కులను బ్యాంకర్లు పక్కన పడేస్తున్నారు.  

జగనన్న ఇస్తాడని చెప్పండి  
ఎన్నికలు సమీస్తుండడంతో చంద్రబాబు డబ్బుల మూటలు పంపిస్తున్నాడు. రూ.3 వేలు చేతిలో పెట్టే కార్యక్రమం చేస్తాడు. మీరంతా గ్రామాలకు వెళ్లి, బాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోకండి, రేపు మన ప్రభుత్వం వస్తుంది, జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు, మన పిల్లల్ని బడికి పంపిస్తే చాలు అమ్మ ఒడి పథకం ద్వారా సంవత్సరానికి రూ.15 వేలు ఇస్తాడని చెప్పండి. జగన్‌ సీఎం అయిన తరువాత మన పిల్లలు పెద్దపెద్ద చదువులు చదువుతారు, డాక్టరు, ఇంజనీర్లు అవుతారు ఆ చదువులకు ఖర్చు అయ్యే మొత్తాన్ని జగన్‌ భరిస్తాడని చెప్పండి. అన్న చేయూత పథకం ద్వారా 45 ఏళ్లు నిండిన ప్రతి అక్క చేతిలో ఏడాదికి నాలుగు దఫాలుగా రూ.75 వేలు చేతిలో పెడతాడని చెప్పండి. పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు ఎన్నికల నాటి వరకు ఎంతైతే రుణాలు ఉంటాయో ఆ మొత్తాన్నంతటినీ నేరుగా వారి చేతుల్లోనే పెడతామని చెప్పండి. ప్రతి అవ్వకూ, అక్కకు పెన్షన్‌ను రూ.2 వేల నుండి రూ.3 వేల వరకు పెంచుకుంటూ పోతాడని చెప్పండి.

నవరత్నాల పథకాల ద్వారా వైద్య చికిత్సల కోసం ఖర్చు రూ.వెయ్యి దాటితే చాలు ఎన్ని లక్షల ఖర్చయినా భరిస్తాడని చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశాన్ని విపులంగా వివరించండి. రూ.3 వేలు ఇస్తే కుదరదు కనీసం రూ.5 వేలు కావాలని చంద్రబాబును అడగండి. డబ్బు తీసుకునే ముందు ఈ రాక్షసుడికి ఓట్లు వేయమని దేవుడిని కోరుకోండి. పోలీసు వ్యవస్థను చంద్రబాబు అతి దారుణంగా బ్రష్టు పట్టిస్తున్నాడు. పోలీసులు ఇంటెలిజెన్స్‌ అధికారుల రూపంలో గ్రామంలోకి వచ్చి 50 మంది ఓటర్లను ప్రభావితం చేసే వ్యక్తి ఎవరని ఆరా తీస్తూ వారిని కోనుగోలు చేసేందుకు పేర్ల జాబితాను చంద్రబాబు చేతుల్లో పెడుతున్నారు. ఓటర్లను ప్రభావితం చేసే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను కొనేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. అవినీతి సొమ్ముతో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top