ఉత్సాహంగా ఓటేస్తాం

Youngsters are eagerly waiting for the first time to vote - Sakshi

దూరం భారం కాదంటున్న ఓటర్లు

స్వస్థలాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ దేశమంతా సందడి నెలకొంది. తొలిదశ పోలింగ్‌కు మరికొన్ని రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా స్వస్థలాలకు వెళ్లేందుకు పలువురు సిద్ధమవుతుండగా, తొలిసారి ఓటుహక్కును వినియోగించుకునేందుకు యువతీయువకులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు లక్షలాది మంది ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఏదేమైనా ఓటేయాల్సిందే..
తలకు మించిన భారమే అయినా ఈసారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు స్వస్థలమైన పశ్చిమబెంగాల్‌కు వెళతానని దక్షిణ ఢిల్లీలో ఉంటున్న టీ వ్యాపారి నిఖిల్‌ పట్వారియా(47) తెలిపారు. ‘ఇటీవల నా తండ్రి అంత్యక్రియలు జరిగాయి. నదియా జిల్లాలోని స్వగ్రామం కృష్ణనగర్‌కు వెళ్లాలంటే రూ.15,000 ఖర్చవుతుంది. అయినా సరే ఊరికి వెళ్లి ఓటు వేస్తాను’ అని వెల్లడించారు. తాను గత 21 సంవత్సరాలుగా ఢిల్లీలోని చిత్తరంజన్‌ పార్క్‌ ప్రాంతంలో టీ–అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.  

యువతలో అసంతృప్తి
హైదరాబాద్‌లో రాజకీయ ప్రచార వ్యూహకర్తగా పనిచేస్తున్న అనుస్తుప్‌రాయ్‌ బర్మన్‌(25) ఎన్నికల నేపథ్యంలో స్వస్థలమైన బెంగాల్‌లోని బరసత్‌కు వెళుతున్నట్లు చెప్పారు. మే 19న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తాను ఓటు హక్కును వినియోగించుకుంటానని తెలిపారు. కాగా, సుస్థిరాభివృద్ధితో పాటు మైనారిటీలపై దాడులు, మూకహత్యలు, పెద్దనోట్ల రద్దుపై యువత ప్రధానంగా అసంతృప్తితో ఉన్నట్లు వెల్లడించారు.  

రఫేల్‌ ప్రభావం ఉంటుంది..
మతోన్మాదుల నియంత్రణలో గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని బిహార్‌కు చెందిన ప్రజాసంబంధాల అధికారి ప్రీతి సింగ్‌(27) అభిప్రాయపడ్డారు. ‘రఫేల్‌ ఒప్పందంపై చెలరేగిన వివాదం, అవినీతిమయమైన విద్యావ్యవస్థ ప్రధాన సమస్యగా మారాయి. మనకు మంచి నాయకుడు కావాలంటే ప్రతీఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. బిహార్‌లోని పట్నాసాహిబ్‌ లోక్‌సభ స్థానానికి మే 19న జరిగే ఎన్నికల్లో నా ఓటు హక్కును వినియోగించుకుంటాను’ అని ప్రీతి తెలిపారు.  

ఢిల్లీకి కేజ్రీవాల్‌ బెస్ట్‌.. ప్రధానిగా మోదీ..
ఢిల్లీకి చెందిన ఆటో డ్రైవర్లు రాజు, సకీల్‌ ఖాన్‌లు లోక్‌సభ ఎన్నికలపై మాట్లాడారు. ఆటో చార్జీలు పెంచాలని ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాజు, ఖాన్‌ స్పందిస్తూ..‘ఆటో చార్జీలు పెరిగితే ఎక్కే ప్రయాణికులు తగ్గిపోయే అవకాశముంది. ఈ నిర్ణయం ఆటో డ్రైవర్లకు నిజంగా> లబ్ధి చేకూరుస్తుందని నేను భావించడం లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తీసుకున్న నిర్ణయాలు, పనితీరుపై మేమంతా సంతృప్తిగా ఉన్నాం. కానీ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ప్రధాని మోదీకే ఓటు వేస్తాం. ఆప్‌ ప్రభుత్వం ఢిల్లీలో మంచి పనులు చేపట్టింది. కానీ మోదీ కాకుండా మరో వ్యక్తిని ప్రధానిగా ఊహించుకోలేం. మోదీ గొప్ప ప్రధాని అయితే, కేజ్రీవాల్‌ గొప్ప సీఎం’ అని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top