
బెంగాల్‌లో లెఫ్ట్ ఫ్రంట్– కాంగ్రెస్ మధ్య పొసగని పొత్తు తృణమూల్ కాంగ్రెస్‌కు, బీజేపీకి అనుకూలిస్తోందా? లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్ చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో ఈ రెండూ వేర్వేరుగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడం రెండు అధికార పార్టీలకు కాలం కలిసివచ్చేట్టు కనిపిస్తోంది. గత ఏడాదిగా పశ్చిమబెంగాల్ రాజకీయాలు తృణమూల్, బీజేపీలకు అనుకూలంగా మారాయి. పశ్చిమబెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కి పట్టులభిస్తే, ఉప ఎన్నికల్లో బీజేపీ రెండో స్థానంలో నిలవగలిగింది. 2016 నుంచి మొదలుకొని ప్రతి ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్ రెండూ విడివిడిగా పోటీచేసి, ఓటమి చవిచూసిన నేపథ్యంలో ఈ రెండు పార్టీలూ ఈ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకొని ఉమ్మడిగా పోటీ చేయాలని చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. ఇది తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ ఓట్ల శాతం పెరగడానికి దోహదపడబోతోంది.
1998 నుంచి 2004 ఎన్నిక వరకూ తృణమూల్‌తో పొత్తుతో బలపడిన బీజేపీ, ఇప్పుడు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విధానాల కారణంగా మళ్లీ పుంజుకుంటోంది. బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తోన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రతి స్థానంలోనూ బలమైన, సరికొత్త ముఖాలను పరిచయం చేయాలని భావించి, జాబితా తయారుచేసింది. లెఫ్ట్ ఫ్రంట్ – కాంగ్రెస్ మధ్య పొత్తులు పొసగలేదు. ఒకవేళ ఈ రెండు పక్షాల మధ్య పొత్తు కుదిరి ఉంటే పోటీ మరోలా ఉండేది. ఇవి విడివిడిగా పోటీ చేయనుండటం తృణమూల్, బీజేపీకే లాభించనుంది.
కమ్యూనిస్టుల కోటలో ‘కాషాయం’ పాగా
అధికారం కోల్పోయినప్పటి నుంచీ కమ్యూనిస్టులు ఊపిరాడని పరిస్థితుల్లో పడ్డారు. ప్రదర్శనలు, బహిరంగ సమావేశాల నిర్వహణకు అవకాశం లేకుండా తృణమూల్ సర్కారు వ్యవహరించింది. దీనికి తోడు ముస్లింలు పెద్దసంఖ్యలో నివసించే బంగ్లాదేశ్ సరిహద్దున ఉన్న జిల్లాలు, ఇతర ప్రాంతాల్లో మైనారిటీలను ఆకట్టుకోవడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రజలు హిందువులు, ముస్లింలుగా విడివడి ఆలోచించేలా చేశాయి. ఈ క్రమంలో నెమ్మదిగా కమ్యూనిస్టుల స్థానంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగే క్రమంలో ముందుకు సాగుతోంది. కిందటేడాది మేలో జరిగిన బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో సీపీఎం కంటే నాలుగు రెట్లు ఎక్కువ సీట్లు బీజేపీ కైవసం చేసుకుంది. తృణమూల్ ఒత్తిడికి తట్టుకోలేక గతిలేని స్థితిలో సీపీఎం కొన్నిచోట్ల బీజేపీకి ఈ స్థానిక ఎన్నికల్లో సహకరించింది. ఇటీవల మాల్దాలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా బహిరంగ సభకు ప్రభుత్వ స్థలాలు అద్దెకివ్వకపోవడంతో ఓ సీపీఎం నేత తన ప్రైవేటు స్థలాన్ని బీజేపీకి ఇచ్చారంటే కమ్యూనిస్టుల దుస్థితి అర్థమవుతోంది.
బీజేపీకి మూడోవంతు జనం మద్దతు ఉందా?
మార్క్సిస్టులు బలహీనం కావడంతో ప్రస్తుతం బీజేపీయే తృణమూల్‌కు ప్రత్యామ్నాయంగా అవతరించే దిశగా సాగుతోందని రాజకీయ పండితుల అంచనా. ఇటీవల ఓ న్యూస్ చానల్ చేసిన సర్వేలో కూడా ఈ విషయమే స్పష్టమైంది. లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ 31, బీజేపీ 11 సీట్లు సాధిస్తాయని ఈ సర్వే జోస్యం చెప్పింది. కాషాయపక్షం 32 శాతం ఓట్లు సాధిస్తుందని కూడా వెల్లడించింది. ఈ లెక్కన బీజేపీ ఈ ఎనిమిదేళ్లలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగినట్టే భావించాలి. బెంగాల్‌లో 80 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కమ్యూనిస్టులు కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బెంగాల్‌కు చెందిన శ్యామాప్రసాద్ ముఖర్జీ బీజేపీ పూర్వ రూపమైన భారతీయ జనసంఘ్ (బీజేఎస్)ను స్థాపించారు.
ఆచితూచి అభ్యర్థుల ఎంపిక
ఇటు పాలన వ్యవహారాల్లోనూ, అటు పార్టీలోనూ పట్టున్న కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ మాలా రాయ్ కోసం ప్రతిష్టాత్మక కోల్‌కతా దక్షిణ సీటు నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సుబ్రతా భక్షిని తప్పించింది. పార్టీ సీనియర్ నాయకులు, పంచాయతీరాజ్ మాజీ మంత్రి అయిన సుబ్రతా భక్షీని బీజేపీకి గట్టిపోటీ ఇచ్చేందుకు బంకురా లోక్‌సభ స్థానానికి మార్చారు. 2018 పంచాయతీ ఎన్నికల్లో కాషాయ పార్టీకి మొగ్గు ఉందని భావించిన బంకురా, ఝర్‌గ్రామ్, బోల్‌పూర్, మేదినీపూర్ స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు అర్థమవుతోంది. అత్యధిక జనాభా కలిగిన మథువా కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, ఇటీవల హత్యకు గురైన ఎంఎల్‌ఏ సత్యజిత్ బిస్వాస్ భార్యను రాణాఘాట్ నుంచి టీఎంసీ పోటీకి దింపింది. కృష్ణానగర్ సిట్టింగ్ ఎంపీ తపస్‌పాల్ స్థానంలో తరచూ టీవీల్లో కనిపించే కరీంపూర్ ఎమ్మెల్యే మహువా మోయిత్రాని తృణమూల్ అభ్యర్థిగా ప్రకటించారు. ఫార్వర్డ్ బ్లాక్‌కు చెందిన మాజీ మంత్రి పరేష్ అధికారిని కూచ్ బెహార్ నుంచి పోటీకి దింపారు. గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) నేత, డార్జిలింగ్ ఎమ్మెల్యే అమర్‌సింగ్ రాయ్‌ని డార్జిలింగ్ లోక్‌సభ స్థానానికి పార్టీ అభ్యర్థిగా నిలబెట్టారు.
ఫలించిన మమత పోరాటం
బెంగాల్ ‘అగ్ని కన్య’గా పేరొందిన మమతా బెనర్జీ కాంగ్రెస్‌లో, తృణమూల్ కాంగ్రెస్‌లో దాదాపు 35 ఏళ్లకు పైగా మార్క్సిస్టులపై చేసిన పోరాటం ఫలించింది. భూసేకరణ విషయంలో జనం తరఫున ఆమె ఆమరణ దీక్షలు సహా వివిధ రకాల ఉద్యమాలు నడిపారు. పాలకపక్షంపై జనంలో వ్యతిరేకత బుద్ధదేవ్ పాలన చివరి ఐదేళ్లలో పెరిగి పాకాన పడింది. అయితే, పాలనలో, ప్రతిపక్షాలతో వ్యవహరించే తీరులో కమ్యూనిస్టులనే మమత అనుసరించారు. తృణమూల్ సర్కారు అనుసరించిన జనాకర్షక పథకాలు, జనాభాలో 30 శాతమున్న ముస్లింలను ఆకట్టుకోవడానికి అడ్డగోలుగా అనుసరిస్తున్న పద్ధతులు మమతను బలోపేతం చేశాయి. ఫలితంగా బెంగాల్‌లో కమ్యూనిస్టుల స్థానాన్ని తృణమూల్ ఆక్రమించింది.
2014 లోక్‌సభ ఎన్నికల తరువాత మోదీ ప్రభంజనంతో బీజేపీ పశ్చిమబెంగాల్‌లో బలమైన శక్తిగా అవతరించింది. ఇది గత అసెంబ్లీ ఎన్నికల్లోనే రుజువైంది. 1991 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో బీజేపీ 11.66 శాతం ఓట్లను సాధించింది. 2014కి వచ్చేసరికి బీజేపీ ఓట్ల శాతం ఏకంగా 16.8 శాతానికి పెరిగింది. 2014లో తృణమూల్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా విడివిడిగా పోటీ చేసిన కాంగ్రెస్ నాలుగు సీట్లూ, సీపీఎం రెండు సీట్లు మాత్రమే గెలుచుకోగలిగాయి. ఈ రెండు పార్టీల పరిస్థితిలో నాలుగేళ్లుగా పెద్ద మార్పేమీ లేదు. ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీచేసిన 2014 లోక్‌సభ, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తృణమూల్, బీజేపీలకు కలిసివచ్చాయి. గత ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని 294 అసెంబ్లీ స్థానాల్లో 211 తృణమూల్ కైవసం చేసుకొని విజయ సోపానానికి ఎగబాకింది. తృణమూల్ సర్కారు జనరంజకంగా పాలించే బాధ్యతతో పాటు, ప్రతి ఎన్నికల్లో పార్టీని గెలిపించే పని కూడా మమతా బెనర్జీదే. 64 ఏళ్ల మమత ఎనిమిదేళ్లుగా పదవిలో కొనసాగుతూ పాలనపై పట్టు సంపాదించారు.
అధికారం మొత్తం పార్టీ నేత కూడా అయిన ఆమె చేతుల్లోనే కేంద్రీకృతమైంది. ఆమె ప్రతిపక్ష నేతగా లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాలపై ఉద్యమాలు నడిపిన రోజుల్లో మార్క్సిస్టుల ఎత్తుగడలను దగ్గర నుంచి చూశారు. దాదాపు అవే వ్యూహాలు, పద్ధతులతో తన పార్టీని బలోపేతం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం తన కనుసన్నల్లో నడిచేలా చేసుకున్నారు. ఇప్పటి వరకూ ఎన్నికల్లో విజయాలే సాధించిన తృణమూల్‌కు అదే స్థాయిలో లోక్‌సభ ఎన్నికల్లోనూ గెలుపు సాధ్యమా అనేది ప్రధాన సమస్యగా మారింది.
బిమాన్ బోస్: గెలుపు సవాలే!
సీపీఎం రాష్ట్ర శాఖ కార్యదర్శి బిమాన్ బోస్ ఇంత వరకూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కాని, 2006 నుంచీ రాష్ట్రంలో పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. బుద్ధదేవ్ భట్టాచార్య ముఖ్యమంత్రిగా ఉండగా పార్టీ కార్యదర్శిగా బోస్ ఎన్నికయ్యారు. అదే ఏడాది రెండు నెలల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలోని వామపక్షాలు ఇదివరకెన్నడూ లేనంత మెజారిటీ సాధించాయి. అయితే ఆయన హయాంలోనే గత రెండు అసెంబ్లీ, రెండు లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయాయి. రాష్ట్రంలో సీపీఎంను, లెఫ్ట్‌ఫ్రంట్‌ను తన వ్యూహాలు, ఎత్తుగడలతో అధికారంలోకి తెచ్చిన సీపీఎం అగ్రనేత ప్రమోద్ దాస్‌గుప్తా దగ్గర శిష్యరికంలో బోస్ నేతగా ఎదిగారు. అయితే, సీపీఎంను మళ్లీ ఆ స్థాయిలో బలోపేతం చేసే దిశగా బోస్ నడిపించలేకపోతున్నారు.
దిలీప్ ఘోష్: సంచలనాల గోస
బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడైన దిలీప్ ఘోష్ ఆరెస్సెస్ మూలాలున్న నాయకుడు. పశ్చిమ మేదినీపూర్ జిల్లాలో 54 ఏళ్ల క్రితం జన్మించారు. ఇదే జిల్లాలోని ఖరగ్‌పూర్ నుంచి 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1982 నుంచి వరుసగా ఏడుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన కాంగ్రెస్ నేత గ్యాన్‌సింగ్ సోహన్‌పాల్‌ను ఘోష్ ఓడించి చరిత్ర సృష్టించారు. కోల్‌కతాలోని టిప్పు సుల్తాన్ మసీదు ఇమాం మౌలానా బర్కాతీ వ్యాఖ్యలకు నిరసనగా 2016 డిసెంబర్‌లో జరిపిన ప్రదర్శనలో పోలీసుల చేతిలో ఘోష్ గాయపడ్డారు. సీఎం మమత ఢిల్లీలో ఉన్నప్పుడు ఆమెను జట్టు పట్టుకుని ఈడ్చుకు వచ్చే శక్తి బీజేపీకి ఉందని ఘోష్ చేసిన ప్రకటనపై మౌలానా చేసిన వ్యాఖ్యలు వివాదం సృష్టించాయి. ఘోష్‌ను రాళ్లతో కొట్టి బెంగాల్ నుంచి తరిమేయాలని మౌలానా అనడంతో ఈ గొడవ జరిగింది.
సోమేంద్రనాథ్ మిత్రా: కీలకపాత్ర
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సోమేన్ మిత్రా 2009లో లోక్‌సభ తృణమూల్ టికెట్‌పై ఎన్నికయ్యారు. 2014లో మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. మమతా బెనర్జీపై నిప్పులు చెరిగే బహరంపూర్ ఎంపీ, పీసీసీ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌధరీని తొలగించి కిందటేడాది సెప్టెంబర్‌లో సోమేన్‌కు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి అప్పగించారు. తృణమూల్‌కు దగ్గరవడానికి రాష్ట్ర కాంగ్రెస్‌కు సోమేన్ నాయకత్వం అవసరమని పార్టీ అధిష్టానం భావించింది. 1972లో మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాక యువజన కాంగ్రెస్‌లో క్రియాశీల పాత్ర పోషించారు.
2014 లోక్‌సభ: బలాబలాలు (42) తృణమూల్ (34), కాంగ్రెస్ (4), సీపీఎం, బీజేపీ (2),