
గరిడేపల్లి: హుజూర్‌నగర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అరాచకం సృష్టిస్తోందని, కాంగ్రెస్‌ను రక్షించుకోవడానికి చావడానికైనా సిద్ధమని, ఆత్మరక్షణ కోసం చంపడానికైనా సిద్ధమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల మనో ధైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదని, కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. సోమవారం ఆయన సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ, హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో చావో రేవో తేల్చుకునేందుకు కాంగ్రెస్ సైనికులంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల షెడ్యూల్ రాగానే అధికారదుర్వినియోగం మొదలైందన్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఆదివారం నుంచి రైతుబంధు డబ్బులు బ్యాంకుల్లో జమ అవుతున్నాయన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.