హోదా కోసం రాజీలేని పోరాటం: వైఎస్‌ జగన్‌ | Uncompromising fight for AP special status | Sakshi
Sakshi News home page

హోదా కోసం రాజీలేని పోరాటం: వైఎస్‌ జగన్‌

Feb 13 2018 1:35 AM | Updated on Mar 23 2019 9:10 PM

Uncompromising fight for AP special status - Sakshi

పెదకొండూరు వద్ద పాదయాత్ర శిబిరంలో పార్టీ ముఖ్యనేతలు, ఎంపీలు, ప్రాంతీయ సమన్వయకర్తల సమావేశంలో మాట్లాడుతున్న జగన్‌

ప్రజాసంకల్పం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంజీవని అయిన ప్రత్యేక హోదా సాధన కోసం రాజీ లేని పోరు చేయాలని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నేతలకు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా ‘ప్రత్యేక హోదా మన హక్కు– ప్యాకేజీతో మోసపోవద్దు’ అనే నినాదంతో మార్చి 1వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని, అదే విధంగా పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే రోజైన మార్చి 5వ తేదీన ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ‘ప్రత్యేక హోదా మనహక్కు– ప్యాకేజీ మనకొద్దు’ అనే నినాదంతో ధర్నాను నిర్వహించాలని పార్టీ నేతల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రజాసంకల్పం 85వ రోజు పాదయాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన నెల్లూరుజిల్లా పెద్దకొండూరు రాత్రి బస శిబిరంలో సోమవారం పాదయాత్ర ముగిశాక పార్టీ ముఖ్య నేతల, ఎంపీల, ప్రాంతీయ సమన్వయకర్తల సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రత్యేక హోదా సాధన విషయం ప్రధానంగా చర్చకు వచ్చింది. నేతల అభిప్రాయాల మేరకు పై విధంగా ఆందోళన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

ప్రత్యేకహోదా మన హక్కు: జగన్‌
రాష్ట్రాన్ని విభజించేటపుడు పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రధాన హామీ అయిన ప్రత్యేక హోదా ముమ్మాటికీ ఆంధ్రప్రదేశ్‌ ప్రజల హక్కు అని వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆ హోదా సాధన కోసం వైఎస్సార్‌సీపీ శ్రేణులు అన్ని దశల్లోనూ రాజీ లేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే చట్ట సవరణ కూడా తీసుకురావాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని, ప్రధానమంత్రి నిర్ణయం తీసుకుంటే చాలని, అందుకే గట్టిగా పోరాడాలని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. హోదా కన్నా ప్యాకేజీయే మెరుగైందని చంద్రబాబు చెప్పడం పూర్తిగా తప్పని, హోదాకు ప్రత్యామ్నా యం మరేదీ లేదని తెలిపారు. హోదా వస్తే రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలుంటాయని, మన రాష్ట్రంలో పరిశ్రమలు రావాలన్నా, తద్వారా మన పిల్లలకు ఉద్యోగాలు రావాల న్నా అదొక్కటే మార్గమని చెప్పారు. ‘‘ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య విభేదాలు వచ్చాయని రగడ చేస్తున్నాయి. వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరంలేదు. మనం మొదట్నుంచీ హోదా కావాలని డిమాండ్‌ చేస్తున్నాం. మన వైఖరిలో మార్పేమీ లేదు.  పోరాటం మొదలు పెట్టింది మనమే, తుదికంటా పోరాడి సాధించేదీ మనమే’’ అని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. 

వైఎస్సార్‌సీపీ విశ్రమించబోదు: కరుణాకర్‌రెడ్డి 
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేంతవరకూ వైఎస్సార్‌సీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్రమించబోదని, తమ నాయకుడు జగన్, తాము ఇందుకోసం తుదికంటా పోరాడుతామని పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. సమావేశానంతరం ఆయన మీడియాకు వివరాలను వెల్లడించారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల వద్ద మార్చి 1న జరిగే ధర్నాలో జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇతర నేతలు పాల్గొంటారని తెలిపారు. ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద మార్చి ఐదున జరిగే ధర్నాలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పాల్గొంటారని చెప్పారు. అందుకోసం మార్చి 3వ తేదీన ఢిల్లీ వెళ్లే నేతలందరికీ ప్రజాసంకల్ప యాత్ర నుంచే జగన్‌ జెండా ఊపి అభినందనలు తెలియజేస్తారన్నారు.

ప్రత్యేక హోదా సాధన కోసం గత మూడున్నరేళ్లుగా తమ నేత, పార్టీ ఎన్నో పోరాటాలు చేసిందని చెప్పారు. జంతర్‌–మంతర్‌ దగ్గరే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలందరితో కలిసి ధర్నా చేసి అరెస్టయ్యారని గుర్తుచేశారు. అలాగే ప్యాకేజీ వద్దనే వద్దు, హోదాయే కావాలంటూ తమ పార్టీ సమరశీల పోరాటం చేస్తోందన్నారు. ప్రత్యేక హోదా ముద్దు అని ఒక రోజు, వద్దని మరో రోజు, సంజీవని అవునని, కాదని కల్లబొల్లి మాటలు  చెబుతూ ప్రజలను కొందరు మోసం చేస్తున్నారని విమర్శించారు. వెంకటేశ్వరస్వామి పాదాల సాక్షిగా ఇచ్చిన హామీకి తూట్లు పొడిచినపుడు తిరగబడటం ప్రజాస్వామ్యంలో సహజమని, తాము అదే విధంగా వ్యవహరిస్తున్నామని భూమన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రత్యేక హోదాపై ఫలితాలు రాని పరిస్థితుల్లో పదవులకు రాజీనామాలు చేస్తామనే మాటపై తమ నాయకుడుగాని, తమ ఎంపీలు గానీ మరో అభిప్రాయంతో లేరని మరో ప్రశ్నకు బదులిచ్చారు. 

పోరాడుతున్నది మేమే: వరప్రసాద్‌
వైఎస్సార్‌సీపీ ఎంపీలు కూడా లోక్‌సభలో లేకపోతే ఇక ప్రత్యేక హోదా కోసం అడిగే వారే ఉండరని ఎంపీ వరప్రసాద్‌ చెప్పారు. హోదా కావాలని పార్లమెంటులో  గట్టిగా పోరాడుతున్నది తామేనని తెలిపారు. చంద్రబాబు కేంద్రం వద్ద లొంగిపోయి తన హోదాను దిగజార్చుకోవడమే కాక ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. హోదా కోసం ధర్నాలు, బంద్‌లు నిర్వహించడమే కాక జగన్‌ ఆమరణ నిరాహారదీక్ష చేశారని, రాష్ట్రవ్యాప్తంగా యువభేరీలను నిర్వహించి హోదా వల్ల ప్రయోజనాలను తెలియజెప్పారని తెలిపారు. ప్రత్యేక హోదాకు సమాధులు కట్టాలని మళ్లీ ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో తాము ఇంకా పోరాటం గట్టిగా చేయాలని నిర్ణయించామన్నారు. సమావేశంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, వెలగపల్లి వరప్రసాద్, వి.విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  పీవీ మిథున్‌రెడ్డి, మోపిదేవి వెంకటరమణారావు, సజ్జల రామకృష్ణారెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement