
సాక్షి, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ మంగళవారం వేదాయపాళెం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అయ్యన్నపై పిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..
‘‘అయ్యన్నపాత్రుడు అనకాపల్లి, దొండపూడి గ్రామంలో ఓ సిఐ, ఎసైను నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ఎస్స్కార్ట్ ఆలస్యంపై పరుషపదజాలం ఉపయోగించడం సిగ్గుచేటు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నత స్థానంలో వున్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కావవి. అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలపై పోలీస్ అసోసియేషన్ స్పందించకపోవడం బాధాకరం..
.. మా పార్టీకి, నాయకులకు పోలీసులపై గౌరవ మర్యాదలు వున్నాయి. సభ్యసమాజం తల దించుకునేలా వుంది అయ్యన్నపాత్రుని తీరు. పోలీసుల పరిస్థితే ఇలా వుంటే సామాన్య ప్రజల సంగతి ఏంటి అని ఆలోచించాలి’’ అని అన్నారు.
అయ్యన్న సొంత జిల్లా అనకాపల్లి జిల్లా దొండపూడిలో గ్రామ దేవత సంబరాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలను.. స్పీకర్ అయ్యన్న ప్రారంభించేందుకు వచ్చారు. అయితే.. ఆయనను చూడగానే పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారు. ఈ సందులో తనపై దాడి జరిగితే ఏంటి? అనేది అయ్యన్న ఆవేదన. దీంతో పోలీసులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
తమాషాలు చేస్తున్నారా?. మేం వస్తుంటే సీఐ,ఎస్సై ఏం చేస్తున్నారు? కనీసం ప్రొటోకాల్ కూడా తెలియకపోతే మీకు ఉద్యోగాలు ఎందుకు? ఈ సంగతి అసెంబ్లీలోనే తేలుస్తా అంటూ పోలీసులను బండబూతులు తిట్టారాయన. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో రచ్చకు దారితీసింది. పోలీసులను తిట్టారంటూ.. అయ్యన్నపై పలువురు మండిపడుతున్నారు. దీంతో సీఎంవో, డీజీపీ కార్యాలయం అసలు ఏం జరిగిందో వివరణ ఇవ్వాలని డీఎస్పీని ఆదేశించారు.