'అతి పెద్ద రౌడీ, గూండా చంద్రబాబే'
రాష్ట్రంలో అతిపెద్ద రౌడీ, గూండా చంద్రబాబు నాయుడేనని వైఎస్ఆర్‌సీపీ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి అన్నారు.
జర్మనీలో గోబెల్స్ పార్లమెంటును కాల్చేసి, ప్రతిపక్షాలను ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం ఎలా చేశారో.. చంద్రబాబు కూడా అలాగే ఇనుప సంకెళ్లతో ప్రజలను బంధించి, వాళ్లను హంతకులు, రౌడీలుగా చిత్రీకరిస్తున్నారని.. నిజానికి రాష్ట్రంలో అతిపెద్ద రౌడీ, గూండా చంద్రబాబు నాయుడేనని వైఎస్ఆర్‌సీపీ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ఒక వినోద క్రీడ కోసం తమిళులంతా కలిసొచ్చారన్న స్ఫూర్తితో వైఎస్ జగన్ పిలుపు మేరకు శాంతియుత ప్రదర్శన చేస్తామన్న ప్రకటనకే వణికి చచ్చిన చంద్రబాబు.. రక్తాలు వచ్చేలా మహిళలను కొట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో శుక్రవారం కూడా మహిళలపై పోలీసులు విరుచుకుపడి వాళ్లను కొట్టిన నేపథ్యంలో ఆయన తిరుపతి ఎంపీ వరప్రసాద్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం శాంతియుతమైన నిరసన.. అది కూడా కొవ్వొత్తుల ప్రదర్శన మాత్రమే చేస్తామని చెప్పారని, దానికే ఇంత హింసకు పాల్పడటం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఓటుకు నోట్ల కేసులో కోట్లాది రూపాయలు వెనకేశా, అమరావతి భూముల్లో లక్షల కోట్లు కొట్టేశా, విచారణ జరపకండి, మాకు ప్రత్యేక హోదా అక్కర్లేదని కేంద్రం కాళ్ల వద్ద సాగిలబడ్డారని మండిపడ్డారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామన్నవాళ్లు, ఇస్తామన్నవాళ్లు గత రెండున్నరేళ్లుగా ఏమీ చేయకపోవడం వల్లే ప్రతిపక్షంగా వైఎస్ఆర్‌సీపీ ముందుకొచ్చి ఆందోళన చేసిందని తిరుపతి ఎంపీ వరప్రసాద్ చెప్పారు. అలా చేసినందుకు ప్రతిపక్షంగా వైఎస్ఆర్‌సీపీ ముందుకొచ్చి ఆందోళన చేసిందని అన్నారు. కానీ గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన చేస్తున్నవాళ్లను పోలీసు స్టేషన్‌కు తీసుకురావడం దారుణమన్నారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తామంటే అడ్డుకోవడాన్ని ఎక్కడా చూడలేదని, మహిళలని కూడా చూడకుండా రక్తాలు వచ్చేలా కొట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.