
వైఎస్ఆర్ దయవల్ల చంద్రబాబు మంత్రయ్యారు
దివంగత మహానేత వైఎస్ఆర్ దయవల్లే కాంగ్రెస్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తొలిసారి మంత్రి అయ్యారని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.
తిరుపతి: దివంగత మహానేత వైఎస్ఆర్ దయవల్లే నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తొలిసారి మంత్రి అయ్యారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. 23 ఏళ్లకే శాసనమండలి సభ్యత్వం కోసం ప్రయత్నించానని చెబుతున్న చంద్రబాబు.. ఈ పదవికి 30 ఏళ్లు నిండితేనే అర్హుడనే విషయం మరిచిపోయారని భూమన ఎద్దేవా చేశారు.
ఎవరైతే ప్రత్యేక హోదా కోసం నాడు రాజ్యసభలో హామీ ఇచ్చారో, వాళ్లు అధికారంలోకి రాగానే ప్రత్యేకహోదా అందని ద్రాక్షలా అయిపోయిందని అన్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదా ఆశాదీపాన్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులను కేంద్రం ఇస్తుందని, నిర్మాణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చెప్పిన తర్వాత కాంట్రాక్టు పనుల కోసం, లంచాలు బాగా మేయొచ్చని చంద్రబాబు కేంద్రానికి తల ఊపి 5 కోట్ల ప్రజల ఆశలను చంపేశారని అన్నారు. చంద్రబాబు తేనెపూసిన కత్తి అని, ఆయన పాలనలో అవినీతి ఏరులై పారుతోందని భూమన ఆరోపించారు. ఈ రోజు బంద్ పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరు అమానవీయమని అన్నారు. ఉదయం 4 గంటలకే విపక్షనేతలను అరెస్ట్ చేయించారని, ప్రత్యేక హోదా నినాదం వినిపించకుండా చేయాలని చూశారని మండిపడ్డారు.