
మీడియాతో మాట్లాడుతున్న భూమన కరుణాకర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్టని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... దేన్నైనా మేనేజ్ చేయగలనని నమ్మే వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. సోనియా గాంధీ అడుగులకు చంద్రబాబు మడుగులొత్తి అక్రమ కేసులతో వైఎస్ జగన్‌ను జైలుకు పంపించారని చెప్పారు.
‘జగన్‌పై కేసులు కొట్టేస్తారేమోనని చంద్రబాబు అంటున్నారు. మాకు కోర్టులు, చట్టంపై నమ్మకముంది. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొలేమనే భయంతో సీబీఐని ఉసిగొల్పి సోనియా, చంద్రబాబు కలిసి అక్రమ కేసులు పెట్టించారు. జగన్‌ను ఎదుర్కొనేందుకు చిదంబరం కాళ్లు పట్టుకుంది నిజం కాదా? అప్పటి న్యాయశాఖ మంత్రి భరద్వాజకు పాదపూజ చేయలేదా? ఓటుకు కోట్లు కేసులో కేసీఆర్‌కు భయపడి సాష్టాంగ నమస్కారం చేసి విజయవాడకు పారిపోయి రాలేదా? జగన్‌పై అక్కసుతో కిరణ్‌కుమార్‌రెడ్డితో కుమ్మక్కు కాలేదా? అలాంటి చంద్రబాబుకు మా గురించి మాట్లాడే అర్హత లేదు. సోనియాకు జేజేలు పలికివుంటే 8 ఏళ్ల క్రితమే జగన్ సీఎం అయ్యేవారని, చంద్రబాబులాగా పదవుల కోసం పాకులాడటం జగన్ తెలియదు. కడిగిన ముత్యంలా వైఎస్ జగన్ బయటపడతార’ని భూమన అన్నారు.
నారాసుర పాలనకు చరమగీతం
ఒక్క మంచిపని చేయని చంద్రబాబును పచ్చ పత్రికలు ఆకాశానికి ఎత్తుతున్నాయని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదాపై కేంద్రంపై వైఎస్సార్‌సీపీ అవిశ్వాసం ప్రవేశపెడితే అన్ని పార్టీలు టీడీపీ అవిశ్వాసానికి మద్దతుయిచ్చాయని పచ్చ పత్రికలు రాశాయని ఆక్షేపించారు. ప్రత్యేక హోదా అనే పదానికి చంద్రబాబు సమాధి కడితే.. దాన్ని ప్రజల్లో సజీవంగా ఉంచింది జగన్ అని గుర్తు చేశారు. చంద్రబాబు, పచ్చ పత్రికలు ఊహాల్లో విహరిస్తున్నాయని మండిపడ్డారు. నారాసుర పాలనను అంతమొందిచడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.