4 లక్షల ఉద్యోగాలిస్తే విమర్శలా!

Ummareddy Venkateswarlu Fires on Chandrababu - Sakshi

ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజం 

కళ్లు మూసుకున్న వారికే నియామకాలు కనిపించవు

సాక్షి, అమరావతి: నాలుగు నెలల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 4 లక్షల మందికి ఉద్యోగాలిస్తే, ఉద్యోగాలు తీసేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాయడం దారుణమని శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. కళ్లు మూసుకున్న వారికే ప్రస్తుతం జరిగిన నియామకాలు కనిపించవని ఎద్దేవా చేశారు. గ్రామ స్వరాజ్యం రావాలన్న జాతిపిత మహాత్మాగాంధీ కలలను సాకారం చేస్తూ గ్రామ సచివాలయ వ్యవస్థను అమల్లోకి తీసుకొస్తే అభినందించాల్సింది పోయి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

రాజ్యాంగ స్ఫూర్తిని తెలుసుకున్న వారెవరూ గ్రామ సచివాలయ వ్యవస్థను విమర్శించరని అన్నారు. టీడీపీ పాలనలో గ్రామ పంచాయతీలను పూర్తిగా పక్కనపెట్టి, వాటి స్థానంలో జన్మభూమి కమిటీలను తెచ్చి అరాచకాలు సృష్టించారని దుయ్యబట్టారు. గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు వచ్చిన వారు ఆనందోత్సాహాలతో ఉంటే, ఉద్యోగాలు తీసేస్తున్నారని చంద్రబాబు అర్థం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.  

ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇంతటితో ఆగదని, ప్రతిఏటా జనవరి 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు ఎన్ని ఉన్నాయో ప్రకటించి, నియామకాలు చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించడం నిరుద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపిందన్నారు. మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు ప్రధాన కారణం స్వపక్షం వారి వెన్నుపోటేనని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారని, నిర్బంధిస్తున్నారని చంద్రబాబు విమర్శిస్తున్నారని, అసలు ఈ వ్యవహారానికి కారణం ఆయనేనని దుయ్యబట్టారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top