గూటిలోనే గులాబీ!

TRS Party In Trouble With RTC Strike In Telangana - Sakshi

అడుగు బయట పెట్టకుండా ఇరకాటం 

ఆర్టీసీ కార్మికులకు విపక్షాల మద్దతు 

సాక్షి, పరిగి: వెనక చూస్తే గొయ్యి.. ముందు చూస్తే నుయ్యి.. అనేలా మారింది టీఆర్‌ఎస్‌ ఎమ్మె ల్యేల పరిస్థితి. ఎన్నికై 10 నెలలు గడుస్తున్నా.. వీరికి ఇప్పటివరకు చిల్లిగవ్వ కూడా కేటాయించలేదు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక్కో శాసన సభ్యుడికి ఏటా రూ.3 కోట్లు కేటాయిస్తారు. కానీ ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో ఎమ్మెల్యేలు గుళ్లు, గోపురాలు తిరగడం, ప్రైవేటు కార్యక్రమాలకు వెళ్లి రిబ్బన్లు కట్‌ చేయడానికే పరిమితమయ్యారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన రోజు నుంచి ఇప్పటి వరకు నిధులు లేకుండా కాలం వెళ్లదీస్తున్నారు.

ఈ పరిస్థితిలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వీరికి మరింత సంకటంగా మారింది. ఎమ్మెల్యేలే కాకుండా అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులెవరూ బయట అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని నలుగురు ఎమ్మెల్యేల్లో.. ముగ్గురు టీఆర్‌ఎస్‌ నుంచి.. ఒకరు కాంగ్రెస్‌ తరఫున గెలుపొందారు. అయితే హస్తం పార్టీ నుంచి గెలిచిన ఒక్కగానొక్క ఎమ్మెల్యే సైతం గులాబీ గూటికే చేరడంతో.. జిల్లాలో కార్మికులకు మద్దతుగా తిరిగే ఎమ్మెల్యే లేకుండాపోయాడు.  

సోషల్‌ మీడియా వేదికగా..  
హోటళ్లు, టీ కొట్లు, పాన్‌షాపులు, టిఫిన్‌ సెంటర్లు.. ఇలా నలుగురు గుమిగూడే ప్రతి చోటా ఆర్టీసీ కార్మికుల సమ్మెపై జోరుగా చర్చ సాగుతోంది. ఇదే సయంలో వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాల్లోనూ సమ్మె సంగతులు ఊపందుకున్నాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలి.. అనే కోణంలో అధికార పార్టీ కార్యకర్తలు ఎవరైనా పోస్టు చేస్తే చాలు మిగతా పార్టీలు, సంఘాల నేతలు వారిపై విరుచుకుపడుతున్నారు. ఆర్టీసీ కార్మికులకు బాసటగా నిలుస్తూ వారికి అనుకూల పోస్టులు పెడుతున్నారు.

అన్నివైపులా ఒత్తిడి..
ప్రజాప్రతినిధులుగా తమను ఎన్నుకున్న ప్రజలు, ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలవాలో... అటు ప్రభుత్వమే తమది కావడంతో సర్కారు గొంతుక వినిపించాలో తెలియక ఎమ్మెల్యేలు కిమ్మనకుండా ఉండిపోతున్నారు. ఇదే సమయంలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు ఒక్కటై ప్రభుత్వంతో పాటు అధికార పార్టీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నాయి.  తమ డిమాండ్ల సాధనకోసం సమ్మె బాటపట్టిన ఆర్టీసీ కార్మికులకు బాసటగా నిలుస్తున్నాయి.  అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేందుకు  ప్రయత్నిస్తున్నాయి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top