హోలీకి విడుదల

TRS MP Candidate List Release On Holi - Sakshi

ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో కొత్తవారికి అవకాశం

పెద్దపల్లిలో వివేక్‌కు అవకాశంపై అస్పష్టత 

21వ తేదీలోపు టీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ లోక్‌సభ అభ్యర్థుల జాబితా సిద్ధమైంది. అయితే, అభ్యర్థులను ప్రక టించే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్‌ ఇప్పటికే 16 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ సైతం ఒక్క అభ్యర్థినీ ప్రకటించలేదు. లోక్‌సభ అభ్యర్థుల జాబితాను ఈ నెల 21న వెల్లడిస్తామని మంగళవారం నిజామాబాద్‌ బహిరంగసభలో కేసీఆర్‌ ప్రకటించారు. అన్ని స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల విషయంలో కేసీఆర్‌ ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చారు. సిట్టింగ్‌ ఎంపీలు నలుగురికి ఈసారి పోటీ చేసే అవకాశం ఉండదని తెలిసింది. ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో కొత్తవారికి అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 

ఖమ్మం సిట్టింగ్‌ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చే పరిస్థితి కనిపించడంలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారనే ఫిర్యాదుల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరుతున్న మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావుకు ఇక్కడ అవకాశం ఇవ్వాలని పార్టీ దాదాపుగా నిర్ణయించింది. మరోనేత వంకాయలపాటి రాజేంద్రప్రసాద్‌ చాన్స్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. 

పెద్దపల్లి అభ్యర్థి ఖరారుపై టీఆర్‌ఎస్‌ ఇంకా స్పష్టత ఇవ్వడంలేదు. టికెట్‌ ఆశిస్తున్న జి.వివేకానందపై పార్టీ అధిష్టానం అసంతృప్తిగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో వివేకానంద టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారని, సొంత పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా సోదరుడు బరిలో ఉన్నా పట్టించుకోలేదని భావిస్తోంది. చివరి నిమిషంలోనైనా తనకు టీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్కుతుందని వివేకానంద భావిస్తున్నారు. లోక్‌సభ సెగ్మెంట్‌లోని ఎమ్మెల్యేల సూచన మేరకు ఇతర పార్టీల నుంచి వచ్చే ఒక నేతగాని వర్గం నాయకుడికి ఇక్కడ టికెట్‌ ఇచ్చే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ ముఖ్యలు చెబుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌కు టికెట్‌ ఖరారైందని ఆయన అనుచరులు చెబుతున్నారు. నల్లగొండ సిట్టింగ్‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి టికెట్‌పై ఇంకా స్పష్టత రావడంలేదు. ఈ సెగ్మెంట్‌లోనూ కొత్తవారికి అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఆ పార్టీ తేరా చిన్నపరెడ్డి, వ్యాపారవేత్త వేముగంటి నర్సింహారెడ్డి పేర్లను పరిశీలిస్తోంది. 

భారీగా చేరికలు...
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీల ముఖ్యనేతలను భారీగా చేర్చుకునేందుకు టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్‌కు దూరమవుతున్నట్లు ప్రకటించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అధికారికంగా టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. మరో నలుగురు ఎమ్మెల్యేలు సైతం టీఆర్‌ఎస్‌లో చేరుతారని తెలుస్తోంది. చేవేళ్ల కాంగ్రెస్‌ నేత పటోళ్ల కార్తీక్‌రెడ్డి మంగళవారం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఖమ్మం, వరంగల్‌ జిల్లాలకు చెందిన టీడీపీ, కరీంనగర్, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన కాంగ్రెస్‌ నేతలు పలువురు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్‌ నేతలు వెంకటేశ్‌ నేత, గోమాస శ్రీనివాస్, భూపాలపల్లి జిల్లాకు చెందిన గండ్ర సత్యనారాయణరావు తదితరులు త్వరలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. లోక్‌సభ అభ్యర్థుల ప్రకటనకు ముందే ఈ చేరికలు ఉంటాయని తెలుస్తోంది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top