
రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న జంగాలపల్లె శ్రీనివాసులు
చిత్తూరు కార్పొరేషన్ : ప్రత్యేక హోదా కోసం అఖిలపక్ష పార్టీలు గురువారం చేపట్టనున్న జాతీయ రహదారుల దిగ్బంధనం కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు తెలిపారు. స్థానిక ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో సీపీఐ నాయకులు నాగరాజన్ అధ్యక్షతన మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. జంగాలపల్లె మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
సీపీఎం నాయకులు చల్లా వెంకటయ్య, చైతన్య మాట్లాడుతూ ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలను మోసం చేసి దగా చేసిన మోదీని తెలుగు ప్రజలు క్షమించరని తెలిపారు. తెలుగు రాష్ట్ర ప్రజల కోరిక మేరకు కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సాధించేంతవరకు పార్టీలకతీతంగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమించడానికి నాయకులు సిద్ధమవుతున్నారని హెచ్చరించారు. ఈ పోరాటంలో భాగంగానే 22న జాతీయ రహదారుల దిగ్బంధనం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు గజేంద్రబాబు, లోకేష్, అక్బర్, శరవణ, మునస్వామి, విజయగౌరి తదితరులు పాల్గొన్నారు.