సీమ ప్రాజెక్టులపై టీడీపీ హ్యాండ్సప్‌ | TDP On Rayalaseema Projects | Sakshi
Sakshi News home page

సీమ ప్రాజెక్టులపై టీడీపీ హ్యాండ్సప్‌

Dec 12 2019 4:19 AM | Updated on Dec 12 2019 10:30 AM

TDP On Rayalaseema Projects - Sakshi

సాక్షి, అమరావతి: అసెంబ్లీలో సెల్ఫ్‌ గోల్‌ చేసుకోవడంలో టీడీపీ కొత్త రికార్డులు తిరగరాస్తోంది. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో రాయలసీమ ప్రాజెక్టులపై టీడీపీ ప్రశ్నించింది. అయితే ఆ పార్టీకి చెందిన రాయలసీమ సభ్యులు మాట్లాడకపోవడంతో టీడీపీ ఇబ్బందికర పరిస్థితుల్లో పడిపోయింది. టీడీపీ ప్రశ్నకు స్పీకర్‌ అనుమతివ్వగా.. చంద్రబాబుతోసహా ఆ పార్టీ సభ్యులు కాసేపు స్పందించలేదు. దాంతో చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి లేచి రాయలసీమ ప్రాజెక్టులపై మాట్లాడసాగారు. దాంతో కోస్తా జిల్లాలకు చెందిన టీడీపీ సభ్యులు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు తేరుకుని.. అది తాము అడిగిన ప్రశ్నని.. తమకే అవకాశం ఇవ్వాలని కోరారు. దీనిపై శ్రీకాంత్‌ రెడ్డి స్పందిస్తూ ‘రాయలసీమపై టీడీపీకి ప్రేమ లేదు. అందుకే అవకాశం ఇచ్చినా సరే ఎవరూ స్పందించకపోవడంతో నేను లేచాను’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

రాయలసీమ నుంచి టీడీపీ తరపున చంద్రబాబు, బాలకృష్ణ, పయ్యావుల కేశవ్‌ మాత్రమే గెలిచారు. బుధవారం కేశవ్‌ సభకు రాలేదు. సభలో ఉన్న చంద్రబాబు, బాలకృష్ణ కాకుండా రామానాయుడు మాట్లాడారు. అనంతరం చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ‘రామానాయుడుకు రాయలసీమ ప్రాజెక్టుల పేర్లు కూడా సరిగా తెలీవు. వాటిపై మాట్లాడేందుకు టీడీపీలో ఎవరూ లేరు’అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో రాయలసీమ ప్రాజెక్టులకు చేసిన ద్రోహాన్ని ఆయన వివరించారు. హంద్రీ–నీవాకు 5 టీఎంసీలు కుదించి అన్యాయం చేశారని విమర్శించారు. వైఎస్సార్‌ అధికారంలోకి వచ్చాక ఆ ప్రాజెక్టును 40 టీఎంసీలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ సామర్థ్యాన్ని వైఎస్సార్‌ 10 వేల నుంచి 56 వేల క్యూసెక్కులకు పెంచితే.. చంద్రబాబు వ్యతిరేకించి ధర్నాలు చేశారన్నారు. 2014లో అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రాజెక్టుల అంచనాలు పెంచేసి సీఎం రమేష్‌కు కాంట్రాక్టులు కట్టబెట్టి వందల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. 

టీడీపీ పాలనలో సీమకు అన్యాయం  
రాయలసీమ ప్రాజెక్టులపై సభలో ఉన్న బాలకృష్ణ మాట్లాడాలని ఎమ్మెల్యే రోజా తదితరులు డిమాండ్‌ చేశారు. దీనిపై బాలకృష్ణ ఏమాత్రం స్పందించలేదు. చర్చ జరుగుతుండగానే బయటకు వెళ్లిపోయారు. వైఎస్సార్‌సీపీ సభ్యుడు రఘురామిరెడ్డి మాట్లాడుతూ అధికారంలో ఉండగా రాయలసీమ ప్రాజెక్టులను పట్టించుకోని టీడీపీ ప్రస్తుతం కూడా సభలో తమ ప్రాంతాన్ని అవమానిస్తోందని విమర్శించారు.  చంద్రబాబు మౌనంగా ఉండిపోవడంతో టీడీపీ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. అనంతరం సీఎం పూర్తి గణాంకాలతో టీడీపీ వైఖరిని ఎండగట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement