'అశోక'చక్రం.. 'దివాకర' అస్త్రం!

SP Ashok Case File Against Gorantla Madhav in Anantapur - Sakshi

గోరంట్ల మాధవ్‌పై కేసు

జేసీ దివాకర్‌రెడ్డిని భయభ్రాంతులకు గురిచేశారనే అభియోగం

విధుల్లో ఉన్నంత కాలం మాధవ్‌ తప్పు చేయలేదని ఎస్పీ మద్దతు

హైకోర్టులో కూడా జేసీ పిటీషన్‌పై కౌంటర్‌ దాఖలు

ఉద్యోగానికి వీఆర్‌ఎస్‌ ఇచ్చిన రోజే మాధవ్‌కు చార్జ్‌మెమో

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నెల రోజుల్లోపు     కేసు నమోదు

పోలీసులను కొజ్జాలుగా, చేతికాని నా కొడుకులు అన్న జేసీపై కేసు లేదు

‘జేసీ దివాకర్‌రెడ్డిపై సీఐ గోరంట్ల మాధవ్‌ ఎలాంటి వ్యక్తిగత దూషణలు చేయలేదు. డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ కూడా తప్పు చేయలేదని నిర్ధారించింది’– హైకోర్టు కౌంటర్‌ పిటీషన్‌లో జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌

‘ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని గోరంట్ల మాధవ్‌ భయభ్రాంతులకు గురిచేసేలా మాట్లాడారు.’– మాధవ్‌పై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశం. 506 సెక్షన్‌కింద కేసు నమోదు

‘పోలీసులా? కొజ్జా నా కొడుకులా? ఏ జాతికి సంబంధించిన వాళ్లు వీళ్లు.’– గత ఏడాది సెప్టెంబర్‌ 16న ఎంపీ జేసీ వ్యాఖ్యలు

పోలీసు శాఖ టీడీపీ చెప్పుచేతల్లో పని చేస్తుందనేందుకు ఇది తాజా ఉదాహరణ

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఒక కాకి గాయపడితే.. వంద కాకులు అక్కడికి వచ్చి చేరడం చూశాం. అలాంటిది.. పోలీసు శాఖ పరువును, పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ ఓ నేత చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఓ పోలీసుకు సొంత శాఖ నుంచే మద్దతు లభించని పరిస్థితి. టీడీపీ నేతలు ఏమి చేసినా, ఏమి మాట్లాడినా.. చివరకు పోలీసు శాఖ పరువును బజారున పడేస్తున్నా.. ఆ శాఖ ఉన్నతాధికారిగా ఎస్పీ కూడా చేష్టలుడిగి చూస్తుండటం సామాన్య ప్రజలను సైతం ఆలోచనలో పడేస్తోంది. జిల్లాలో అసలేం జరుగుతుందో పరిశీలిస్తే.. తానుఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని భావించిన జేసీ దివాకర్‌రెడ్డి గత ఏడాది సెప్టెంబర్‌ 16న ప్రభోదానంద ఆశ్రమం ఘటనలో భాగంగా దళిత సామాజిక వర్గానికి చెందిన డీఎస్పీ విజయ్‌కుమార్‌ను ‘నీయబ్బ చేతగాని నా కొడుకులు.. మీరు కనపడితే...(రాయలేని భాష)’ అని దారుణంగా మాట్లాడారు.

ఈ విషయంలో ఎస్పీ అశోక్‌కుమార్‌ కూడా మౌనం వహించారు. ఇకపోతే తాడిపత్రిలో 2017 డిసెంబర్‌ 21న ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఏకంగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి విధుల్లో ఉన్న సీఐని ‘మీకు..(రాయలేని భాష) దమ్ములేదా? చేతకాకపోతే సెలవులో వెళ్లిపోండి? అన్నారు. జేసీ అనుచరుడు మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ జిలాన్‌ ఏకంగా సీఐతో ‘మీ వద్ద లాఠీలు ఉంటే మా వద్ద కట్టెలు ఉన్నాయి. పది నిమిషాల సమయం ఇస్తున్నాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో మాకే తెలీదు’ అని ఏకంగా బెదిరించి అల్టిమేటం జారీ చేశారు. అయినప్పటికీ సీఐ నుంచి ఎస్పీ దాకా ఎవ్వరూ స్పందించలేదు. ఎందుకంటే వీరంతా తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు. ఏమైనా ముందడుగు వేస్తే ‘బదిలీ అవుతుందేమోననే భయం’తో నిమ్మకుండిపోయారు. పోలీసుశాఖ పరువును కాపాడలేకపోయారు. కానీ సీఐ గోరంట్ల మాధవ్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పోలీసులపై దుర్భాషలాడే వారికి హెచ్చరిక చేశారు. పోలీసుల్లో ఆత్మస్థైర్యం నింపారు. పోలీసులతో పాటు సాధారణ ప్రజలు కూడా ఆయనకు మద్దతు పలికి సమర్థించారు.

ఖాకీ వదలగానే తప్పయిందా?: మాధవ్‌ వ్యాఖ్యలపై జేసీ దివాకర్‌రెడ్డి తాడిపత్రి స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. పోలీసులపై జేసీ హైకోర్టులో రిట్‌ దాఖలు చేశారు. ఈ విషయంలో జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌.. మాధవ్‌కు అండగా నిలిచారు. జేసీపై మాధవ్‌ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, కేసు నమోదు చేయలేమని చెప్పారు. కానీ మాధవ్‌ తన ఉద్యోగానికి డిసెంబర్‌ 29న వీఆర్‌ఎస్‌ ఇచ్చారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరే యోచనతో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. వీఆర్‌ఎస్‌ ఇవ్వగానే అదే రోజు రాత్రి గతంలో జేసీపై మాధవ్‌ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎస్పీ చార్జ్‌ మెమో దాఖలు చేశారు. అయితే అందులో ఒకరోజు ముందు తేదీ అంటే డిసెంబర్‌ 28తో జారీ చేశారు. సెప్టెంబర్‌ 28న మాధవ్‌ వ్యాఖ్యలు చేశారు, అతనిపై కేసు నమోదు చేయాలని 29న జేసీ దివాకర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.

కానీ మాధవ్‌ వీఆర్‌ఎస్‌ ఇచ్చిన రోజు చార్జ్‌ మెమో ఇచ్చారంటే ఎస్పీ స్థాయి అధికారే రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయారనేది తెలుస్తోంది. ఆ తర్వాత మాధవ్‌ను ఎలా ఇబ్బంది పెట్టాలనే చర్చే టీడీపీ నేతలతో పాటు పోలీసుశాఖ ఉన్నతాధికారుల్లోనూ కొనసాగింది. అందుకే నిబంధనల మేరకు వీఆర్‌ఎస్‌ ఇచ్చినా, ఇప్పటి వరకూ దాన్ని పోలీసుశాఖ ఆమోదించ లేదని తెలుస్తోంది. మాధవ్‌పై ఎలాగైనా కేసు నమోదు చేయాలని.. లేదంటే ఎస్పీ ఆఫీసు ఎదుట ధర్నా చేస్తామని జేసీ దివాకర్‌రెడ్డి పోలీసులను బెదిరించారు. దీంతో ఇప్పటి వరకూ అండగా ఉండి, ఇప్పుడు కేసు నమోదు చేస్తే తప్పుడు సమాచారం ప్రజల్లోకి వెళుతుందని, తాడిపత్రి కోర్టులో ఓ పిటిషన్‌ వేస్తే కేసు నమోదు చేస్తామని ఓ పోలీసు ఉన్నతాధికారి సలహా ఇచ్చినట్లు సమాచారం. దీంతో నాలుగు రోజుల కిందట జేసీ కోర్టులో పిటిషన్‌ వేశారు. కోర్టు ఉత్తర్వులకు లోబడి వెంటనే పోలీసులు సెక్షన్‌ 506 కింద కేసు నమోదు చేశారు. హైకోర్టులో పిటిషన్‌ వేస్తే కౌంటర్‌ దాఖలు చేసిన ఎస్పీ, తాడిపత్రి కోర్టులో ఎందుకు కౌంటర్‌ దాఖలు చేయలేదనేది వేయి డాలర్న ప్రశ్న. కేవలం మాధవ్‌ వైఎస్సార్‌సీపీ హిందూపురం పార్లమెంట్‌ సమన్వయకర్తగా ఉండటం, జనాకర్షన కలిగిన నేతగా ఎదుగుతుండటంతో రాజకీయంగా ఎలాగైనా దెబ్బతీయాలనే లక్ష్యంతోనే అధికార పార్టీ పోలీసులను అడ్డుపెట్టుకుని ఈ తరహా కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

పోలీసుశాఖలో తీవ్ర చర్చ
విధి నిర్వహణలో ఉన్న గెజిటెడ్‌ ర్యాంకు అధికారులను సైతం ఇష్టానుసారం జేసీ బ్రదర్స్‌ దూషించినా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి. ఈ క్రమంలో పోలీసుశాఖ పరువును కాపాడేందుకు మాధవ్‌ చేసిన వ్యాఖ్యలపై పోలీసులే కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జేసీ బ్రదర్స్‌పై ఎందుకు కేసు నమోదు చేయలేదని పోలీసులతో పాటు సాధారణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారుల తీరు ఇలా ఉంటే, పోలీసులు ధైర్యంగా ఎలా పనిచేయగలరని సొంత శాఖలేనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జేసీపై కేసు నమోదు చేస్తే మహా అయితే రాజకీయ ఒత్తిళ్లతో బదిలీ బహుమానంగా వస్తుందని, కానీ పోలీసు పరువు నిలబడుతుందని చర్చ జరుగుతోంది. అలా కాకుండా పోలీసులపై దూషణలకు దిగిన వారిని వదిలిస్తే.. రేపు ఎంపీ, ఎమ్మెల్యే నుంచి ఎంపీటీసీ దాకా.. ఆపై రోడ్డున వెళ్లే రౌడీషీటర్‌ కూడా ఇదే వైఖరి అవలంబిస్తారని ఆందోళన వ్యక్తమవుతోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top