ప్రముఖుల తుది మజిలీ ‘స్మృతి స్థల్‌’ | Sakshi
Sakshi News home page

ప్రముఖుల తుది మజిలీ ‘స్మృతి స్థల్‌’

Published Sat, Aug 18 2018 5:11 AM

Smriti Sthal was chosen as memorial site for leaders - Sakshi

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియలు దేశ రాజధాని ఢిల్లీలోని స్మృతి స్థల్‌లో జరిగాయి. యమునా నది తీరంలో పచ్చిక బయలుతో అలరారే సువిశాల ప్రాంగణం స్మృతి స్థల్‌. గాంధీ సమాధి(రాజ్‌ఘాట్‌)కి సమీపంలో శాంతివన్‌ (నెహ్రూ సమాధి), విజయ్‌ ఘాట్‌ (లాల్‌ బహదూర్‌ శాస్త్రి సమాధి)ల మధ్య ఈ స్మృతి వనం ఉంది. రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధాన మంత్రుల వంటి అత్యంత ప్రముఖుల అంత్యక్రియల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ స్మృతి స్థల్‌ను ఏర్పాటు చేసింది.

గతంలో రాష్ట్రపతులు, ప్రధాన మంత్రులు మరణించినప్పుడు వారికోసం దేశ రాజధానిలో ప్రత్యేకంగా స్థలాల కేటాయింపులు జరిగాయి. రాజ్‌ఘాట్‌ సమీపంలో వారికి కూడా స్మారక స్థలాలను కేటాయించేవారు. శాంతివన్, శక్తి స్థల్, వీర్‌ భూమి, ఏక్తా స్థల్, సమతా స్థల్, కిసాన్‌ ఘాట్‌ వంటి పేర్లతో ఏర్పాటు చేసిన ఈ స్మారకాల కోసం రాజధానిలో అత్యంత విలువైన 245 ఎకరాలకు పైగా కేటాయించారు. ఇలా కేటాయిస్తూ పోతే రాజధానిలో భూమి కొరత వస్తుందన్న ఆందోళనతో 2000లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇకపై ప్రముఖులకు స్థలాలు కేటాయించకూడదని నిర్ణయించింది.

2013లో కేంద్ర మంత్రివర్గం స్మతి స్థల్‌ నిర్మాణానికి ఆమోదం తెలపగా, 2015లో రాజ్‌ఘాట్‌ సమీపంలో నిర్మాణం పూర్తయింది. స్మతి స్థల్‌లో మొదటి సమాధి మాజీ ప్రధాని పీవీ నరసింహారావుది. 2015లో ఎన్డీయే ప్రభుత్వం ఈ స్మృతి స్థల్‌లో ఆయన స్మారకాన్ని నిర్మించింది. అయితే ఇందుకు ఆయన కుటుంబీకులు పదేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. పీవీ నరసింహారావు ఢిల్లీలో మరణించారు. అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఆయన అంత్యక్రియలు రాజధానిలో జరిపేందుకు అంగీకరించలేదు. దాంతో కుటుంబీకులు పీవీ అంత్యక్రియలను హైదరాబాద్‌లో నిర్వహించి స్మారకం ఏర్పాటు చేశారు. తమ తండ్రికి దేశ రాజధానిలో స్మారకం ఏర్పాటు చేయాలని పీవీ కుటుంబీకులు కోరడంతో 2015లో ఎన్డీయే ప్రభుత్వం పీవీకి స్మృతి స్థల్‌లో స్మారకం ఏర్పాటు చేసింది. మరో మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌కు 2012 డిసెంబర్‌లో స్మృతి స్థల్‌లో అంత్య క్రియలు నిర్వహించారు.

కొందరు మాజీ ప్రధానుల స్మారక స్థలాలు– వాటి పేర్లు–కేటాయించిన స్థలం
మహాత్మా గాంధీ                                   రాజ్‌ఘాట్‌                                 44.35 ఎకరాలు
జవహర్‌లాల్‌ నెహ్రూ                             శాంతి వన్, న్యూఢిల్లీ                     52.6 ఎకరాలు
లాల్‌ బహదూర్‌ శాస్త్రి                               విజయ్‌ ఘాట్, న్యూఢిల్లీ               40 ఎకరాలు
ఇందిరా గాంధీ                                      శక్తి స్థల్,న్యూఢిల్లీ                        45 ఎకరాలు
రాజీవ్‌ గాంధీ                                        వీర్‌ భూమి, న్యూఢిల్లీ                  15 ఎకరాలు
చరణ్‌ సింగ్‌                                           కిసాన్‌ భూమి                          19 ఎకరాలు
జైల్‌ సింగ్‌                                              ఏక్తా స్థల్‌                                22.56 ఎకరాలు
చంద్ర శేఖర్‌                                           ఏక్తా స్థల్, న్యూఢిల్లీ                    ఈ స్థలం ఇప్పుడు స్మృతి స్థల్‌లో కలిసింది
ఐకే గుజ్రాల్‌                                           ఏక్తా స్థల్,న్యూఢిల్లీ                     ఈ స్థలం ఇప్పుడు స్మృతి స్థల్‌లో కలిసింది
వీపీ సింగ్‌                                             దియా గ్రామం, రామ్‌ఘడ్, అలహాబాద్‌
మొరార్జీ దేశాయ్‌                                      అభయ్‌ ఘాట్, గుజరాత్‌

Advertisement
Advertisement