తూర్పు బాంద్రా శివసేనకు దక్కేనా?

Shiv Sena Prestige Battle for Bandra East - Sakshi

సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు ఇవ్వకుండా మేయర్‌ విశ్వనాథ్‌కు శివసేన టికెట్‌

టికెట్‌ రాకపోవడంతో రెబల్‌గా నామినేషన్‌ వేసిన తృప్తి సావంత్‌

సాక్షి, ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు తిరుగుబాటు అభ్యర్థులు సవాల్‌గా మారారు. తూర్పు బాంద్రా అసెంబ్లీ నియోజక వర్గంలో శివసేన ఇబ్బందుల్లో పడిపోయింది. ఈ నియోజకవర్గంలో ఒకరు శివసేన అభ్యర్థి కాగా మరొకరు శివసేన తిరుగుబాటు అభ్యర్థి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. దీంతో ఇక్కడ ఇద్దరు బలమైన అభ్యర్తులే కావడంతో పోరు రసవత్తరంగా మారింది. దీంతో ఫలితాలు ఎలా వస్తాయనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.  

ప్రకాశ్‌ సావంత్‌దే ఆధిపత్యం..
2004లో జరిగిన ఎన్నికల్లో తూర్పు బాంద్రా అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్‌ ఆధీనంలోకి వచ్చింది. ఆ తరువాత 2009లో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజక వర్గాన్ని శివసేన చేజిక్కించుకుంది. శివసేన టికెట్‌పై పోటీచేసిన ప్రకాశ్‌ సావంత్‌కు 45,651 ఓట్లు రాగా ప్రత్యర్థిగా కాంగ్రెస్‌ టికెట్‌పై బరిలోకి దిగిన జనార్ధన్‌ చాందుర్కర్‌కు 38,239 ఓట్లు, ఎమ్మెన్నెస్‌ అభ్యర్థి శిల్పా పోద్దార్‌కు 19,109 ఓట్లు వచ్చాయి. ఆ తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా ప్రకాశ్‌ సావంత్‌ భారీ మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు. అయితే 2015లో ప్రకాశ్‌ సావంత్‌ ఆకస్మిక మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఉప ఎన్నికలో శివసేన తరఫున ప్రకాశ్‌ భార్య తృప్తి సావంత్‌ పోటీ చేయగా 52,711 ఓట్లు, కాంగ్రెస్‌ తరఫున నారాయణ్‌ రాణే పోటీ చేయగా 33,703 ఓట్లు, ఎంఐఎం తరఫున రహెబర్‌ సిరాజ్‌ ఖాన్‌ పోటీ చేయగా 15,050 ఓట్లు వచ్చాయి.

కాగా ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో విజయ ఢంకా మోగించినప్పటికీ ఈ నెల 21వ తేదీన జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తృప్తి సావంత్‌కు అభ్యర్థిత్వం ఇవ్వకుండా సిట్టింగ్‌ మేయర్‌ విశ్వనాథ్‌ మహాడేశ్వర్‌కు అభ్యర్థిం కట్టబెట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన తృప్తి సావంత్‌ తిరుగుబాటు చేసి ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ వేశారు. ఆమె బరిలోకి దిగడంవల్ల విశ్వనాథ్‌కు విజయవకాశాలు కొంత సన్నగిల్లినట్లు వాతావరణం కనిపించింది. దీంతో నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఇక్కడ శివసేన తరఫున విశ్వనాథ్‌ మహాడేశ్వర్, ఇండిపెండెంట్‌గా తృప్తి సావంత్, కాంగ్రెస్‌ తరఫున జిషాన్‌ సిద్ధికీ, ఎమ్మెన్నెస్‌ తరఫున అఖిల్‌ చిత్రే బరిలో నిలిచ్చారు. ఇక్కడ నలుగురు అభ్యర్ధులు బరిలో ఉన్నట్లు తేలిపోయింది. అసలు పోటీ శివసేన అభ్యర్థి మహాడేశ్వర్, ఇండిపెండెంట్‌ అభ్యర్థి సావంత్‌ మధ్య జరగడం ఖాయంగా కనబడుతోంది.

ఒకపక్క సిట్టింగ్‌ ఎమ్మెల్యే మరోపక్క ముంబై మేయర్‌ బరిలో ఉండడంవల్ల పోటీ హోరాహోరీగా జరగనుంది. అంతేగాకుండా ఈ నియోజక వర్గం ఇటు శివసేనకు అటు ఇండిపెండెంట్‌ అభ్యర్థి తృప్తి సావంత్‌కు సవాలుగా మారింది. ఎలాగైన ఈ నియోజకవర్గంలో పట్టుసాధించాలని శివసేన దృడసంకల్పంతో ఉంది. మరోపక్క తన ఆదీనంలో ఉన్న ఈ నియోజక వర్గాన్ని ఎట్టి పరిస్ధితుల్లో చేజారిపోకుండా తృప్తి సావంత్‌ కూడా తన ప్రతిష్టను ఫణంగా పెట్టారు. దీంతో ఈ నియోజక వర్గంపై ఓటర్లతోపాటు సామాన్య ప్రజలకు కూడా మరింత ఆసక్తి నెలకొంది. ఇరువురు బలమైన అభ్యర్ధులు కావడంతో ఓటర్లు ఎవరికి పట్టం కట్టబెడతారనేది ఎన్నికల ఫలితాల్లో తేటతెల్లం కానుంది. (చదవండి: మహారాష్ట్రలో ఫడ్నవీయం)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top