మహారాష్ట్రలో ఫడ్నవీయం

Devendra Fadnavis Successful CM For Maharashtra - Sakshi

సందర్భం

మహారాష్ట్రలో అయిదేళ్ల పదవీకాలాన్ని అవిచ్ఛిన్నంగా పూర్తి చేసుకున్న రెండో ముఖ్యమంత్రిగా ఫడ్నవిస్‌ చరిత్ర సృష్టించారు. గత అయిదేళ్ల పాలనలో ఆయన సాధించిన గొప్ప విజయాలు రెండు. మరాఠా రాజకీయాల్లో తిరుగులేని శివసేన స్థాయిని కూటమిలో జూనియర్‌ భాగస్వామిగా కుదించివేయడం, సొంత పార్టీలో బలమైన ప్రత్యర్థులను మట్టికరిపించి పోటీ లేకుండా చూసుకోవడం. ఆరెస్సెస్‌ అగ్రనాయకత్వంతో సాన్నిహిత్యం, మోదీ, అమిత్‌షాల విశ్వాసాన్ని కీలక సమయంలో సాధించడం, వివాదరహితంగా రాజకీయాల్లో నిలబడటం.. ఒకప్పటి అర్భక నేతను మరాఠా వీరుడిగా మార్చివేశాయి. పార్టీలో బలమైన నేతలను పైకి ఎదగనివ్వని నరేంద్రమోదీ, అమిత్‌ షా హయాంలో ఫడ్నవీస్‌ ఇంత శక్తివంతుడిగా రూపొందడం అరుదైన విషయమే మరి.

నాగ్‌పూర్‌లో ఆరెస్సెస్‌ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ అధినేత మోహన్‌ భాగవత్‌ ప్రతి ఏటా విజయ దశమినాడు చేసే ప్రసంగానికి సంఘ్‌ పరివార్‌ రాజ కీయ లక్ష్య ప్రకటనగా భావిస్తుంటారు. ఈ సంవత్సరం భాగవత్‌తో కలిసి ఆ వేదికను పంచుకునే మహదవకాశం 49 సంవత్సరాల వయసున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు దక్కింది. మహారాష్ట్రలో అయిదేళ్ల పదవీకాలాన్ని అవిచ్ఛిన్నంగా పూర్తి చేసుకున్న రెండో ముఖ్యమంత్రిగా ఫడ్నవిస్‌ చరిత్ర సృష్టించారు. శివసేన అధినేత ఉద్దవ్‌ థాకరేతో సీట్ల పంపకంపై  చేసిన సంయుక్త ప్రకటన నాగ్‌పూర్‌ నుంచి మూడుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన ఫడ్నవిస్‌ ప్రతిష్టకు, బీజేపీ ప్రాంతీయ నేతగా సాధించిన వైభవానికి పరీక్షగా నిలిచింది. సరిగ్గా ఎనిమిది నెలలకు ముందు, థాకరే నివాసమైన మాతోశ్రీ గది వెలుపల ఫడ్నవిస్‌ వేచి ఉంటుండగా ఆయన బాస్‌ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా 48 పార్లమెంటరీ స్థానాలకోసం శివసేనతో ఆ గదిలో చర్చలు జరిపారు. బీజేపీ, శివసేన కూటమి మహారాష్ట్రలో 8 స్థానాలు మినహా 40  లోక్‌సభ సీట్లను గెల్చుకుంది. అయితే ఈసారి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బీజేపీ నిర్దాక్షిణ్యంగా శివసేన స్థితిని ఒక జూనియర్‌ భాగస్వామి స్థాయికి కుదించివేసింది. అది శాసనసభ స్థానాల పంపిణీలో స్పష్టంగా ప్రతిఫలించింది. బీజేపీ ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో 150 స్థానాల్లో పోటీ చేయనుండగా సేన 124 స్థానాలతోనే సరిపుచ్చుకోవలసి వచ్చింది.

స్వపక్షంలో పోటీదారుల ఆటకట్టు
ఒకవైవు ఉద్ధవ్‌ థాకరే పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి వెళ్లిపోవాలనుకుంటున్న 26 మంది కార్పొరేటర్లు, 300 మంది సేన కార్యకర్తలతో తలపడటంలో నిత్యం తలమునకలవుతూ ఉండగా మరోవైపున దేవేంద్ర ఫడ్నవిస్‌ మాత్రం బీజేపీలోని తన ప్రత్యర్థి, విద్యా మంత్రి వినోద్‌ త్వాడేకి ఈ అసెంబ్లీ ఎన్నికలకు గాను సీటు దక్కకుండా చేయడంలో బ్రహ్మాండంగా విజయం సాధించారు. బీజేపీకి అత్యంత సురక్షితమైనదిగా భావించే బోరివిల్లి శాసనసభ స్థానం వినోద్‌ త్వాడేకి ఇవ్వడానికి అధిష్టానం నిరాకరించింది. అలాగే మహారాష్ట్ర పార్టీ విభాగంపై తన పట్టును మరింత బలపర్చుకున్న ఫడ్నవిస్‌ తన చిరకాల ప్రత్యర్థి, బలమైన నేత అయిన ఏక్‌నాథ్‌ ఖడ్సేకి జల్‌గావ్‌ నుంచి టికెట్టు దక్కకుండా చేయడంలో కూడా విజయవంతమయ్యారు. ఖడ్సేని తనవద్దకు పిలిపించుకున్న అమిత్‌ షా ఆయనకు సీటు ఇవ్వడానికి నిరాకరించి ఆయన కుమార్తె రోహిణ్‌ ఖడ్సే కేవాల్కర్‌కి సీటు ప్రసాదించారు. నాగ్‌పూర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా రాజకీయ జీవితంలో అడుగుపెట్టిన దేవేంద్ర పడ్నవిస్‌ ప్రాభవం అచిరకాలం లోనే మహారాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి చేరుకుంది. 49 ఏళ్ల ఫడ్నవిస్‌ త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై ప్రభావం చూపుతున్నారు. దేశ పశ్చిమ ప్రాంతంలోని ప్రాధాన్య కులాల్లో్ల దేనికీ చెందనప్పటికీ ఇంత తక్కువ కాలంలో దేవేంద్ర ఫడ్నవిస్‌ బలమైన మరాఠా నాయకుడిగా నిలబడటానికి కారణాలేవి?

ప్రధానంగా ఫడ్నవిస్‌ నాగ్‌పూర్‌ నుంచి వచ్చారు. ఇది బీజేపీ సైద్ధాంతిక ప్రబోధకురాలైన రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ అగ్రనాయకత్వం కొలువుండే నగరం. ఆరెస్సెస్‌ అగ్రనాయకత్వంతో ఫడ్నవిస్‌ సన్నిహిత సంబంధాలే ఆయనను సునాయాసంగా ముఖ్యమంత్రి స్థానం వరకు సులభంగా తీసుకొచ్చాయి. పైగా ప్రధాని నరేంద్రమోదీ అపార మద్దతు కూడా ఫడ్నవిస్‌కు కొండంత అండగా నిలిచింది.
వయసులోనూ, రాజకీయాల్లోనూ, బీజేపీలోనూ చాలామంది ఇతర నాయకులు తనకంటే సీనియర్లుగా ఉన్నప్పటికీ, ఫడ్నవిస్‌ వారి స్థాయిని తన రాజకీయ ఎత్తుగడల ద్వారా బాగా కుదించివేయ గలిగారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై కాంక్ష వ్యక్తం చేస్తూ తనకు ప్రమాదకరంగా మారగలిగే వారికి మంత్రివర్గంలో చోటు కల్పించకుండా అడ్డుకున్నారు లేదా బీజేపీలో వారు ప్రాధాన్యత కోల్పోయేలా చేశారు.

వివాదాలకు తావీయని వ్యక్తిత్వం
ప్రధానమంత్రి జనరంజకత్వాన్ని తనకు అనుకూలంగా మల్చుకోవడంలో, మునిసిపల్, పంచాయతి ఎన్నికల్లో బీజేపీకి వరుస విజయాలను అందించడంలో ఫడ్నవిస్‌ ప్రదర్శించిన సామర్థ్యం తనకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడమే కాకుండా పార్టీలో పోటీ అన్నదే ఎరుగని నేతగా తీర్చిదిద్దింది. కుంభకోణాలు, ఆర్థిక అవతవకలపై ఆరోపణలు వంటి వాటి కారణంగా బడా రాజకీయ నేతలు సైతం పదవులను పోగొట్టుకునే చరిత్ర కలిగిన రాష్ట్రంలో చెక్కుచెదరని ఫడ్నవిస్‌ ప్రతిష్ట తనకు ఎంతో ప్రయోజనం చేకూర్చింది. శివసేన ఆకాంక్షలు, పేరాశలకు చెక్‌ పెట్టడంలో వారితో ఒప్పందం కుదుర్చుకోవడంలో ఫడ్నవిస్‌ సామర్థ్యం వల్లే ప్రతి ఎన్నికల సమయంలోనూ రెండు పార్టీలు కలిసి పోటీచేస్తూ వచ్చాయి. ఇది బీజేపీకి ప్రయోజనం కలిగించడమే కాకుండా తాను వ్యక్తిగతంగా ఎదగడానికి కూడా కారణమైంది. కొన్ని ఎత్తులూ, జిత్తులూ ప్రదర్శించినప్పటికీ కూటమిలో తాను జూనియర్‌ భాగస్వామే అని శివసేనను అంగీకరింపజేయడంలో ఫడ్నవిస్‌ ప్రదర్శించిన నైపుణ్యం ఆయన నాయకత్వానికి ఎదురు లేదన్న హామీని ఇచ్చింది. ఫడ్నవీస్‌ 2014లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పుడు, ఆయనకు ఎలాంటి పాలనానుభవం లేదు. పైగా మహారాష్ట్ర వెలుపల ఆయన గురించి తెలిసినవారే లేరు. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌లాగా ఆయన నరేంద్రమోదీ, అమిత్‌ షాల అనూహ్య ఎంపిక నుంచి నేతగా ఆవిర్భవించారు. ఫడ్నవిస్‌కి సంఘ్‌ అనుకూలుడు అనే పేరు ఉండేది. పైగా మహారాష్ట్ర బ్రాహ్మణుడు కావడంతో సంఘ్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ ప్రాపకం సులువుగానే సంపాదించారు.  అయితే దేవేంద్ర ఫడ్నవిస్‌ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కాక,  ఆయన అంతర్గత ప్రత్యర్థులు ఆయన్ని చాలా తేలిగ్గా అంచనా వేశారు. అయిదేళ్ల తన హయాంని ఫడ్నవిస్‌ పూర్తి చేయలేడని బలంగా విశ్వసించారు. వారి అభిప్రాయం పూర్తిగా తప్పని ఫడ్నవిస్‌ నిరూపించారు. 

బీజేపీ మరాఠా నేత మాటల్లో చెప్పాలంటే, ఫడ్నవిస్‌ కూడా నరేంద్రమోదీ గుజరాత్‌ నమూనాను ఉపయోగించి తన ప్రత్యర్థులను ధ్వంసం చేశాడు. ఢిల్లీ, నాగ్‌పూర్‌ కేంద్రాలు రెండూ తన పట్ల సంతోషంతో ఉండేలా ఫడ్నవిస్‌ జాగ్రత్తపడ్డారు. మరోవైపున చాలామంది మహారాష్ట్ర ముఖ్యమంత్రుల్లా కాకుండా ఫడ్నవిస్‌ వివాదాలకు చాలా దూరంగా ఉంటూవచ్చారు. అత్యున్నత స్థాయి బ్యాంకర్‌ అయిన తన సతీమణి అమృత వివాదంలో చిక్కుకున్నప్పుడు కూడా అమిత ప్రేమ కలిగిన భర్త పాత్రనే పోషించారు. దాంతో ఈ వివాదంలో అందరూ వారిని క్షమించేశారు. ఇంకా చెప్పాలంటే పాలనా నైపుణ్యాలు లేక పోవడం కూడా ఆయనకు అవరోధాలను పెద్దగా సృష్టించలేదు.

మోదీ, షాలే కొండంత అండ
ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లా కాకుండా ఫడ్నవిస్‌ తన పనిగురించి త్వరలో నేర్చుకున్నారు. ఎలాంటి వివాదాలు తనను చుట్టుముట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పైగా మహారాష్ట్ర నుంచి అధికంగా లోక్‌సభ స్థానాలను గెలిపించి ఇస్తానంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు  తానిచ్చిన మాటను నిలబెట్టుకోవడంతో ఆయన విశ్వసనీయత రెట్టింపైంది.  అప్పటినుంచి ఫడ్నవిస్‌ని అమిత్‌ షా అపారంగా ఇష్టపడుతూ వచ్చారు. ఆయన్ని పూర్తిగా బలపర్చడమే కాకుండా, ప్రత్యర్థులు ఆయనను దెబ్బతీయడాన్ని ఏమాత్రం అనుమతించకుండా రక్షణఛత్రంలాగా షా అడ్డుపడ్డారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఫడ్నవిస్‌ బలమైన ప్రత్యర్థి అని అందరూ భావించేలా మోదీ, అమిత్‌ షాలు ఆయనకు అండదండగా నిలుస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే మహా రాష్ట్ర రాజకీయాల్లో గడ్కరీకి ఎంత పట్టుందో ఫడ్నవిస్‌ కూడా అదే స్థాయికి చేరుకున్నట్లు స్పష్టమవుతోంది. మరి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫడ్నవిస్‌ ముందు ఉన్నదేమిటి? మహారాష్ట్ర ముఖ్యమంత్రి నివాస భవనమైన వర్షాకు ఆయన తిరిగి రావడం ఖాయం. మహారాష్ట్ర రాజకీయాల్లో కనీవినీ ఎరుగనట్లుగా రెండో దఫా కూడా అధికారంలోకి  రానుండటమే కాదు. ఆ రాష్ట్ర బీజేపీ చరిత్రలో అత్యున్నత నేతగా ఫడ్నవీస్‌ దుర్నిరీక్షుడుగా వెలుగొందనున్నారు. ప్రత్యర్థుల పట్ల రాజీలేని వైఖరిని ప్రదర్శించే నరేం ద్రమోదీ, అమిత్‌ షాల హయాంలో ఒక ప్రాంతీయ బీజేపీ నేత ఇంత ప్రాభవాన్ని గడించడం అరుదైన విషయమే మరి.

స్వాతి చతుర్వేది 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు, రచయిత

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top