ఎన్ని కోట్లు తీసుకుని పార్టీ మారారు?

Seetharam Naik Fires On Revanth Reddy - Sakshi

జానా, రేవంత్, రేణుకలను ప్రశ్నించిన మహబూబాబాద్‌ ఎంపీ సీతారాం నాయక్‌  

జానా, రేణుక, రేవంత్‌లను ప్రశ్నించిన ఎంపీ సీతారాం  

గిరిజన ఎమ్మెల్యేలను విమర్శిస్తే సహించబోమని హెచ్చరిక  

ఇల్లెందు:  కాంగ్రెస్‌ నేతలు జానారెడ్డి, రేణుకాచౌదరి, రేవంత్‌రెడ్డి ఎన్ని కోట్ల రూపాయలు తీసుకుని పార్టీ మారారో చెప్పాలని మహబూబాబాద్‌ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్‌ ప్రశ్నించారు. సోమవారం ఇల్లెందులో ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.  కాంగ్రెస్‌ నేతలు గిరిజన ఎమ్మెల్యేలను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కేసీఆర్‌ది కుటుంబపాలన అంటూ తరచూ విమర్శిస్తున్నారని, మరి మోతీలాల్‌ నుంచి రాహుల్‌ వరకు కుటుంబ పాలన కాదా అని ప్రశ్నించారు. కేటీఆర్, హరీష్‌రావు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విషయం అందరికీ తెలుసన్నారు. బస్సుయాత్ర పేరుతో ఇల్లెందులో సభ నిర్వహించి చోటా మోటా నేతలంగా ఎమ్మెల్యే కనకయ్యను టార్గెట్‌ చేసి మాట్లాడడం సరైంది కాదన్నారు.

ఇల్లెందు నియోజకవర్గం అనేక ఏళ్లుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, అందుకే కనకయ్య టీఆర్‌ఎస్‌లో చేరి ఈ ప్రాంత అభివృద్ధికి కారకుడయ్యాడని చెప్పారు. కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నట్టుగా ఎవరూ డబ్బుకు అమ్ముడు పోలేదన్నారు. గిరిజనులు ఆత్మగౌరవంతో జీవిస్తారని, కాంగ్రెస్‌లో టికెట్లు అమ్ముకున్న చరిత్ర ఉన్న వారు కూడా విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. వచ్చే డిశంబర్‌ నాటికి ఇంటింటికీ తాగునీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కేసీఆర్‌ను విమర్శించే అర్హత ఉత్తమ్‌కుమార్‌కు లేదన్నారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ తొలిసారి గెలిచిన తనపై కాంగ్రెస్‌ నాయకులు అవాకులు, చెవాకులు పేలారని, తనపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని అన్నారు.

ప్రస్తుత కాంగ్రెస్‌ నేతలు జానారెడ్డి, రేవంత్‌రెడ్డి, రేణుకాచౌదరి, వనమా వెంకటేశ్వరరావు వంటి వారంతా గతంలో పార్టీలు మారలేదా అని నిలదీశారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దిండిగల రాజేందర్, మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యులు మడత వెంకట్‌గౌడ్, టేకులపల్లి, కామేపల్లి జడ్పీటీసీ సభ్యులు లక్కినేని సురేందర్, మేకల మల్లిబాబుయాదవ్, మూల మధుకర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భూక్యా నాగేశ్వరరావు, నాయకులు సిలివేరు సత్యనారాయణ, గందె సదానందం, సయ్యద్‌ జానీపాషా, అక్కిరాజు గణేష్‌ పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top