ప్రియాంక నియామకంపై ఎవరేమన్నారు?

Priyanka Gandhi Appointment A Game-Changer, Say Partymen - Sakshi

న్యూఢిల్లీ: ప్రియాంక గాంధీని ఉత్తర్‌ప్రదేశ్‌ తూర్పు ప్రాంతం ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీగా నియమించడంపై కాంగ్రెస్‌ పార్టీలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్న ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రియాంక నియామకంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీకి పునర్‌వైభవం వస్తుందన్న ఆశాభావాన్ని సీనియర్‌ నాయకులు వ్యక్తం చేశారు. (ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ)

‘ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీగా ప్రియాంక గాంధీని నియమించడాన్ని స్వాగతిస్తున్నాం. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆమె ప్రవేశం పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపనుంది. భవిష్యత్‌లో కాంగ్రెస్‌ పార్టీ​ అభివృద్ధికి ఉత్ప్రేరకంగా పనిచేయనుంద’ని సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ నియామకం పార్టీకి కొత్త ఉత్సాహం తీసుకువస్తుందన్న నమ్మకాన్ని మరో సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ వ్యక్తం చేశారు. ప్రియాంక నియామకాన్ని కాంగ్రెస్‌ పార్టీకి రాహుల్‌ గాంధీ చేసిన పెద్ద శస్త్రచికిత్సగా అభివర్ణించారు.

‘ప్రియాంకకు బాధ్యతలు అప్పగించడం అత్యంత ముఖ్యమైన విషయం. ప్రియాంక ఎంట్రీ ప్రభావం ఉత్తరప్రదేశ్‌కే పరిమితం కాదని మిగతా ప్రాంతాల్లోనూ ఉంటుంద’ని మోతిలాల్‌ వోరా అభిప్రాయపడ్డారు. ప్రియాంక నియామకాన్ని ‘గేమ్‌ చేంజర్‌’గా యూపీ పీసీసీ అధ్యక్షుడు పియూష్‌ మిశ్రా వర్ణించారు. ‘ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ప్రియాంక గాంధీని ఎంతో కాలంగా కోరుతున్నాం. యూపీ ఈస్ట్‌ ఇన్‌చార్జిగా ఆమె నియామకం మాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. పార్టీ శ్రేణులు పండగ చేసుకుంటున్నాయ’ని తెలిపారు.

అమేథి, రాయబరేలి నియోజకవర్గాలను పర్యవేక్షిస్తున్న ప్రియాంక గాంధీకి పార్టీలోని కార్యకర్తలందరితో పరిచయాలు ఉన్నాయని రాజస్థాన్‌ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ తెలిపారు. విదేశాల నుంచి తిరిగి రాగానే ఫిబ్రవరి 1న ప్రియాంక బాధ్యతలు చేపడతారని రాజీవ్‌ శుక్లా వెల్లడించారు. కాగా, ప్రియాంక ప్రత్యక్ష రాజకీయ ప్రవేశంపై కాంగ్రెస్‌ కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. ‘ఇందిరా గాంధీ మళ్లీ వచ్చారంటూ’ పోస్టర్లు ప్రదర్శించారు.

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top