ఆరెస్సెస్‌ కార్యక్రమానికి వెళ్లొద్దు

Pranab Mukherjee to attend RSS programme in Nagpur - Sakshi

లౌకికత్వం, దేశం కోసం పునరాలోచించండి

ప్రణబ్‌కు కేంద్ర మాజీ మంత్రి లేఖ

ఆరెస్సెస్‌ ఐఎస్‌ఐ కాదు: గడ్కారీ

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరెస్సెస్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు అంగీకరించడం వివాదమైంది. వలంటీర్ల శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరుకావాలని ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ప్రణబ్‌ను ఆహ్వానించగా,  ప్రణబ్‌ ఓకే చెప్పారు. జూన్‌ 7న నాగ్‌పూర్‌లో ఈ కార్యక్రమం జరగనుంది.  ప్రణబ్‌ నిర్ణయంపై కాంగ్రెస్‌ అధికారికంగా స్పందించలేదుగానీ పలు లౌకిక పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఆ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు సీకే జాఫర్‌ షరీఫ్‌ ప్రణబ్‌కు లేఖ రాశారు. ‘రాజకీయాల్లో లౌకికవాదిగా కొనసాగి, రాష్ట్రపతిగా పనిచేసిన మీలాంటి వారు లోక్‌సభ ఎన్నికల ముందు సంఘ్‌ కార్యాలయాన్ని సందర్శించడం సరికాదు. మీరు ఆ నిర్ణయంపై పునరాలోచన చేస్తారని ఆశిస్తున్నా. దేశం, లౌకికత్వం ప్రయోజనాల దృష్ట్యా అక్కడికి వెళ్లొద్దని విజ్ఞప్తి చేస్తున్నా’ అని జాఫర్‌ లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ మాజీ ఎంపీ హెచ్‌ హనుమంతప్ప ఈ లేఖపై సంతకం చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మరో మాజీ ఎంపీ సందీప్‌ దీక్షిత్‌ స్పందిస్తూ..ఆరెస్సెస్‌ జాతి వ్యతిరేక, చెడ్డ సంస్థ అని ప్రణబ్‌ గతంలోనే ఆరోపించారని, అలాంటి వ్యక్తిని ఆహ్వానించిన సంస్థ ఆయన మాటలను అంగీకరించినట్లేనా? అని ప్రశ్నించారు.

స్వాగతించిన గడ్కారీ..
ఆరెస్సెస్‌ కార్యక్రమానికి ప్రణబ్‌ హాజరుకాబోతుండటంపై కేంద్ర మంత్రి గడ్కారీ హర్షం వ్యక్తం చేశారు. ఆరెస్సెస్‌ పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ కాదని, జాతీయవాదుల సంస్థ అని అన్నారు. బీజేపీని మత పార్టీ అంటే సంకుచితంగా ఆలోచిస్తున్నట్లేనని అన్నారు.

ఆరెస్సెస్‌ నేతలతో షా, మంత్రుల భేటీ
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, ఐదుగురు కేంద్ర మంత్రులు ఆరెస్సెస్‌ అగ్ర నాయకులతో సమావేశమై ప్రభుత్వ ఆర్థిక విధానాలపై చర్చలు జరిపారు. రైతులు, కార్మికులపై బీజేపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలే ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top