వాజ్‌పేయి త్వరగా కోలుకోవాలి!

Political Leaders Prays For Atal Bihari Vajpayee Early Recovery - Sakshi

భారతరత్న అటల్‌ బిహారి వాజ్‌పేయి ఆరోగ్యం విషమించటంతో దేశమంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ తరుణంలో వాజ్‌పేయి త్వరగా కోలుకోవాలని పలువురు రాజకీయ నాయకులు కోరుకుంటున్నారు. ఇప్పటికే బీజేపీ ఆగ్రశ్రేణులు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఏయిమ్స్‌ చేరుకొని వాజ్‌పేయి ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. దేశ నలుమూలల నుంచి రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఢిల్లీ చేరుకుంటున్నారు.  వాజ్‌పేయి ఆరోగ్యం కుదుటపడాలని పలువురు నేతలు కోరుకున్నారు.

‘ఈ రోజటి కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంటున్నాను.. వాజ్‌పేయిని చూడటానికి తక్షణమే ఢిల్లీ వెళుతున్నాను. ఆ మహనాయకుడి కేబినెట్‌లో పనిచేసే అవకాశం లభించింనందుకు గర్వంగా ఉంది. వాజ్‌పేయి ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మా పార్టీ అండగా నిలిచింది. వాజ్‌పేయి లాంటి రాజనీతిజ్ఞుడిని మరలా ఇంత వరకు చూడలేదు. అయన త్వరగా కోలుకోవాలి’ అంటూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  కోరుకున్నారు.

ఎయిమ్స్‌లో వాజ్‌పేయిని పరామర్శించిన రాహుల్‌ గాంధీ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘మన దేశ మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి త్వరగా కోలుకోవాలి’ అని ఆకాంక్షించారు.

‘వాజ్‌పేయి కేబినెట్‌లో రెండు సంవత్సరాలు పనిచేశాను. అలాంటి మహానాయకుడి నాయకత్వంలో పనిచేసినందుకు గర్వంగా, సంతోషంగా ఉంది. వాజ్‌పేయి ఆరోగ్యం విషమించడం బాధాకరం. నేను వెంటనే ఢిల్లీకి వెళుతున్నాను’ అంటూ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పేర్కొన్నారు.

‘వాజ్‌పేయి ఆరోగ్యం విషమించడం చాలా బాధాకరం. దేశం గర్వించదగ్గ నాయకుల్లో వాజ్‌పేయి ఒకరు. ఆ మహనీయుడి ఆరోగ్యం కుదుటపడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ ట్వీట్‌ చేశారు.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top