ఇదీ.. బాబు అండ్‌ కో బండారం!

This is the plan of chandrababu and pawan drama - Sakshi

     ఈ బంధం బలమైనది.. దృఢమైనది.. భాగస్వాములే రంగు బైటపెట్టుకున్నారు

     జగన్‌పై విమర్శలకే చంద్రబాబు ప్రాధాన్యం

     అవిశ్వాసం జగన్‌ ఆలోచనే అన్నట్లు విమర్శలు

     ఆ ప్రతిపాదన చేసింది తొలుత పవనే

     అయినా పవన్‌ను పల్లెత్తు మాట అనని బాబు

     సీఎంను రక్షించేందుకు జనసేన అధ్యక్షుడి తాపత్రయం

     అవిశ్వాసం మీ బాధ్యతే అన్నట్లు జగన్‌కు సలహాలు

     ‘అవిశ్వాసం’పై చంద్రబాబు విమర్శ జోలికెళ్లని పవన్‌

     నాలుగేళ్ల నుంచీ ఇద్దరిదీ ఇదే వరస

సాక్షి, అమరావతి: ఐదుకోట్ల మంది ఆంధ్రులకు సంజీవని వంటి ప్రత్యేకహోదాపై ఎంపీల రాజీనామాలకు సిద్ధమని ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ప్రకటించినపుడు గానీ, మీరు కూడా కలసిరండి కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దాం అని విజ్ఞప్తి చేసినపుడు గానీ ఎలాంటి ప్రతిస్పందనా లేకుండా లీకులతోనే కాలక్షేపం చేస్తూ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అనుక్షణం ఆయన రక్షణకు ఎంతగానో శ్రమపడుతున్న పార్టనర్‌ పవన్‌ కల్యాణ్‌ల బండారం విలేకరుల సాక్షిగా బైటపడిపోయింది. సోమవారంనాడు కొద్ది గంటల వ్యవధిలో వీరిద్దరి వ్యాఖ్యానాలు, విన్యాసాలు చూసి రాష్ట్రప్రజానీకం ఆశ్చర్యపోతోంది. ‘మేం అవిశ్వాస తీర్మానానికి సిద్ధమే.. తెలుగుదేశం పార్టీని కూడా సిద్ధం చేయండి’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ సూచించిన నేపథ్యంలో చంద్రబాబు నోరువిప్పారు.

పోలవరం పర్యటన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు..  చంద్రబాబు మాట్లాడిన కాసేపటి తర్వాత భాగస్వామి పవన్‌ కల్యాణ్‌ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టారు.. తాను ప్రిపేరయిన స్క్రిప్టును అప్పగించేసి.. ప్రశ్నలడుగుతున్న విలేకరులను పట్టించుకోకుండా వెళ్లిపోయారు.. ‘‘ఈ ఇద్దరూ విలేకరులతో మాట్లాడిన అంశాలను గమనించిన వారికి ఒక విషయం స్పష్టంగా అర్ధమయ్యింది.. బాబు – భాగస్వామి.. ఇద్దరి బంధం చాలా బలమైనదని అర్ధమౌతోంది’’ అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఇంతకూ వీరిద్దరూ ఏం మాట్లాడారు..? ఆ మాటల పరమార్ధమేమిటి ఓమారు పరికిద్దామా..

అవిశ్వాసం ఆలోచన ఎవరిది బాబూ?
సోమవారం మద్యాహ్నం 3.30 గం.లకు ముఖ్యమంత్రి పోలవరం వద్ద మాట్లాడుతూ ‘‘అవిశ్వాస తీర్మానం ఆలోచన తలాతోకా లేనిది. దాని వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు. రాజీనామాలు చేస్తే పార్లమెంటులో ఎవరు పోరాడతారు? అసలు అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే మెజార్టీ ఎవరికి ఉందో తెలుసుకోవాలి. మెజార్టీ ఉన్నా అవిశ్వాసం పెడితే ఆరునెలలు ఆ విషయంపై అసలు మాట్లాడే అవకాశమే ఉండదు. అవిశ్వాసానికి కూడా పద్ధతులు, స్టేజిలు ఉంటాయి.’’ అని వ్యాఖ్యలు చేశారు. అయితే అవిశ్వాసం పెట్టాలి అన్న ఆలోచన ఎవరిది? ఆయన పార్టనర్‌ పవన్‌ కల్యాణ్‌ది కాదా? పవన్‌ కల్యాణ్‌ సూచించిన తర్వాతనే కదా దానికి కూడా సిద్ధమేనని జగన్‌ ప్రకటించింది.. అలాంటపుడు పవన్‌ కల్యాణ్‌ను ఏమీ అనకుండా జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు విమర్శల వర్షం కురిపించడమేమిటి? దానిని ఎలా అర్ధం చేసుకోవాలి? ఇది చంద్రబాబుకు పవన్‌కు మధ్య ఉన్న బంధాన్ని బైటపెట్టడంలేదా అని వైఎస్సార్‌సీపీ నాయకులంటున్నారు.

పార్టనర్‌ ప్రస్తావన ఏది పవన్‌?
చంద్రబాబు మద్యాహ్నం మాట్లాడగా.. పవన్‌ కల్యాణ్‌ సాయంత్రం విలేకరుల సమావేశం పెట్టారు. ‘‘నేను జగన్‌ మోహన్‌రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నా. ఆయనే అవిశ్వాస తీర్మానం పెట్టాలి. ఒక్కడు తీర్మానం పెట్టినా సరిపోతుంది. జగన్‌ అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత అవసరమైతే కర్ణాటక వెళ్తాను.. తమిళనాడు వెళ్తాను.. వామపక్షాలను, ఎస్‌పిని, ఆప్‌ను, కాంగ్రెస్‌ను అందరినీ ఒప్పిస్తాను. తీర్మానానికి మద్దతుగా ఎంపీలను కూడగడతా’ అని ఓ ప్రకటన చేశారు. కానీ మాటమాత్రంగానైనా తన పార్టనర్‌ చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని ఒప్పిస్తానని పవన్‌ ఎక్కడా చెప్పలేదు. 

అవిశ్వాసం నేపథ్యమేమిటి..?
అవిశ్వాస తీర్మానానికి సిద్ధమేనని ప్రతిపక్షనేత ఏ సందర్భంగా ప్రకటించారు? ప్రత్యేక హోదాను పక్కనపెట్టి ప్యాకేజీని పట్టుకు తిరుగుతూ నాలుగు బడ్జెట్ల సందర్భంగా నోరు విప్పకుండా ఇప్పుడు ఈ బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని చంద్రబాబు డ్రామాలు ఆడుతుంటే.. ఎంపీల చేత రాజీనామా చేయిద్దాం... ప్యాకేజీ కన్నా ఎంతో ఉన్నతమైనదైన, సంజీవని వంటి ప్రత్యేక హోదా సాధిద్దాం అని జగన్‌ పిలుపునిచ్చారు. ఆ పోరాటానికి మీరు కూడా కలసి రావాలని, అందరం కలసి పోరాడితే కేంద్రం దిగి వస్తుందని జగన్‌ ప్రకటించారు. రాష్ట్రంలో కలెక్టరేట్ల ముట్టడి వంటి ఆందోళనతో పాటు వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులందరూ కలసి ఢిల్లీలో ధర్నా చేస్తారని, పార్లమెంటు జరిగినన్ని రోజులూ పోరాటం చేద్దామని జగన్‌ చెబుతున్నారు.

ఇక అప్పటికీ కేంద్రం లొంగకపోతే రాజీనామాలు చేసి వారి మొహాన కొట్టి వద్దామని జగన్‌ చెప్పారు. దీనిమీద స్పందించిన పవన్‌ కల్యాణ్‌ రాజీనామాల వల్ల ఒరిగేదేముంది? అవిశ్వాస తీర్మానం పెడితేనే పని జరుగుతుంది అని అన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టడానికి మీకు భయమెందుకు అని కూడా ఆయన ప్రశ్నించారు. అవిశ్వాసంతోనే కేంద్రం దిగివస్తుందని ఆయన సలహా ఇచ్చారు. దాంతో జగన్‌ తాము అవిశ్వాస తీర్మానానికి సిద్ధమేనని ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం ఎవరు ఎలాంటి సలహా ఇచ్చినా స్వీకరిస్తామని, ఎవరు ముందుకొచ్చినా కలుపుకుని పోరాటం చేస్తామని జగన్‌ అన్నారు. రాష్ట్రంలోని 25 మంది ఎంపీలు ఒక్కతాటిపైకి వస్తే కేంద్రం దిగి వస్తుందన్న ఉద్దేశంతోనే పవన్‌ సూచనకు సై అన్నారు. ‘నేను సిద్ధమే.. మీ పార్టనర్‌ చంద్రబాబును కూడా సిద్ధం చేయండి. వాళ్లు తీర్మానం ప్రవేశపెట్టి మమ్మల్ని మద్దతీయమన్నా.. మేం తీర్మానం ప్రవేశపెట్టి వారు మద్దతిచ్చినా పరవాలేదు’ అని జగన్‌ స్పష్టం చేశారు. ‘చంద్రబాబు మీ పార్టనర్‌ కనుక మీరే ఆయన్ను ఒప్పించండి. ప్యాకేజీతో మోసం చేయవద్దు.. ప్రత్యేక హోదా మన హక్కు’ అని పవన్‌ కల్యాణ్‌కు జగన్‌ సూచించారు. ఇదీ అవిశ్వాస తీర్మానం నేపథ్యం.

రంగు బయటపెట్టుకున్న పార్టనర్స్‌
ఇక తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిన సమయం తోసుకుని వచ్చేయడంతో అటు చంద్రబాబు ఇటు పవన్‌ కల్యాణ్‌ ఇద్దరూ స్పందించారు. భాగస్వామి చంద్రబాబును రక్షించడం కోసమే పవన్‌ తాపత్రయపడినట్లు ఆయన మాటలను బట్టి అర్ధమౌతోంది. చంద్రబాబు ప్రస్తావన ఏమాత్రం లేకుండా పవన్‌ చాలా జాగ్రత్తగా మాట్లాడారు. ‘మీరు చెప్పారు కాబట్టి విభజన చట్టంలోని హామీల అమలు కోసం (...అంటే ప్యాకేజీ కోసం?) అవిశ్వాస తీర్మానం మీరే పెట్టండి’ అని జగన్‌కు సలహా ఇచ్చారు. ‘ప్యాకేజీతో మోసం చేయకండి.. ప్రత్యేక హోదా మన హక్కు’ అని జగన్‌ మోహన్‌రెడ్డి మొదటి నుంచి స్పష్టంగా చెబుతున్నారు. ఎంపీల రాజీనామాలు గానీ, అవిశ్వాస తీర్మానం గానీ ప్రత్యేక హోదా కోసమేనని ఆయన నిర్ద్వంద్వంగా చెబుతున్నారు.

మీ భాగస్వామిని ఒప్పించండి అని అడిగినా.. పోరాటానికి కలసి రండి అని పిలుపు నిచ్చినా, 25 మంది ఎంపీలు రాజీనామాలు చేద్దామని ప్రతిపాదించినా ప్రత్యేకహోదా సాధన కోసమేనని జగన్‌ చెబుతున్నారు. అయితే ఆ విషయాన్ని పక్కనపెట్టి చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని రక్షించడమే ఎజెండాగా ఇవాళ పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారని వైఎస్సార్‌సీపీ నాయకులు విమర్శిస్తున్నారు. జగనే అవిశ్వాస తీర్మానం పెట్టాలి అని పవన్‌ అంటున్నారు. అవిశ్వాస తీర్మానం ఆలోచనే తలాతోక లేనిదని చంద్రబాబు అంటున్నారు.. అలాంటి చంద్రబాబును ఒప్పించకుండా.. చంద్రబాబు మాటలకు సమాధానమివ్వకుండా.. జగన్‌మోహన్‌రెడ్డిపై మాటలదాడి చేయాలని చూడడం ద్వారా పవన్‌కల్యాణ్‌ తన అసలు రంగును బయటపెట్టుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. 

నాలుగేళ్లు నోరుమెదపని పవన్‌..
నాలుగేళ్ల క్రితం చంద్రబాబుకు మద్దతు పలికి.. ఆయన ఇస్తున్న వాగ్దానాలన్నీ అమలు చేయించే పూచీ నాది అని బహిరంగ సభలలో ప్రకటించి, ఏ తప్పు జరిగినా ప్రశ్నిస్తా అని నమ్మ బలికిన పవన్‌ కల్యాణ్‌ నాలుగేళ్లుగా చంద్రబాబుకు రక్షణ కవచంలా పనిచేస్తున్నారని విమర్శకులంటున్నారు. చంద్రబాబుకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఏ చిన్న అసౌకర్యం కలిగినా మీడియా ముందుకువచ్చి, జనం ముందుకు వచ్చి ఆయన్ను రక్షించే విధంగా సమస్యను పక్కదోవ పట్టించడమే పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న పని అన్ని సంగతి అందరకూ తెల్సిన విషయమేనని వారు పేర్కొంటున్నారు. దీనికి ప్రతిఫలంగానే పవన్‌ కల్యాణ్‌ ‘అజ్ఞాతవాసి’ సినిమాకు తెలుగుసినిమా చరిత్రలోనే ఎన్నడూ కనీవిని ఎరుగని విధంగా చంద్రబాబు రాయితీలిచ్చారు. చంద్రబాబు నుంచి అలాంటి లబ్ధి పొందుతుండం వల్లనే ఆయన ఏం చేసినా ప్రశ్నించకుండా ఆయన్ను రక్షించే పనిని భుజాన వేసుకున్నారన్న విమర్శలూ ఉన్నాయి.

అన్నిరంగాలనూ అవినీతిమయం చేసేశారంటూ చంద్రబాబు ప్రభుత్వ అవినీతిని కాగ్‌ వంటి సంస్థలు ఏటా ఏకిపారేస్తున్నాయి. ఓటుకు కోట్లు కేసులో ఆడియో వీడియో టేపుల్లో చంద్రబాబు అడ్డంగా దొరికారు. ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ నియమాలను కాలరాస్తూ ఒక పార్టీ గుర్తుపై గెలిచిన 23మంది ఎమ్మెల్యేలకు ప్రలోభాలు ఎరవేసి కోట్లు కుమ్మరించి చంద్రబాబు కొనుగోలు చేశారు. అందులో నలుగురికి మంత్రి పదవులూ ఆయన కట్టబెట్టారు. ఇలాంటివి ప్రత్యక్షంగా కంటికి కనిపిస్తున్నా పవన్‌ కల్యాణ్‌ ఎన్నడూ నోరు మెదపలేదు. ఇవాళ మద్యాహ్నం చంద్రబాబు విలేకరులతో మాట్లాడితే సాయంత్రం కల్లా పవన్‌ కల్యాణ్‌ ప్రెస్‌మీట్‌ పెట్టారు. అవిశ్వాస తీర్మానం తలాతోకాలేని ఆలోచన అని వ్యాఖ్యానించిన చంద్రబాబును విమర్శించాల్సింది పోయి ప్రత్యేకహోదా కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని ముందుకొస్తున్న ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేయడం విస్తుగొలుపుతున్నదని రాజకీయ విశ్లేషకులంటున్నారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top