రాజీనామాలు తుస్సేనా?

peethala sujatha vs maganti babu

ఆమోదం కోసం పట్టుపట్టని నేతలు

ఎమ్మెల్యేపై పంతం నెగ్గించుకోవడమే టార్గెట్‌

ప్రజల్లో చులకన అయిన ఎంపీ వర్గం

సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి,  ఏలూరు : చింతలపూడి నియోజకవర్గం టీడీపీ ప్రజాప్రతినిధులు చేసిన రాజీనామాల కథ కంచికి చేరినట్టేనా? ఇప్పటి వరకూ ఆ రాజీనామాలు ఆమోదించే విషయంలో పట్టుపట్టకపోవడంతో బ్లాక్‌మెయిల్‌ చేసేందుకే రాజీనామాలు చేసినట్లు స్పష్టం అవుతోంది. చింతలపూడి నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ఎమ్మెల్యే పీతల సుజాత వర్గం, ఎంపీ మాగంటి బాబు తరపున సీనియర్‌ నేత ముత్తారెడ్డి ఆధ్వర్యంలోని వర్గం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. చింతలపూడి ఏఎంసీ చైర్మన్‌ పదవి తమ వర్గానికి దక్కించుకోవడం కోసం రోడ్డెక్కిన మాగంటి బాబు వర్గంలోని ఇద్దరు జెడ్పీటీసీలు, 17 మంది ఎంపీటీసీలు ఇటీవల తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వారు రాజీనామాలు చేసిన తర్వాత రెండుసార్లు అమరావతికి వెళ్లి ఇన్‌చార్జి మంత్రితో భేటీ అయ్యారు. అయితే ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు.

మరోవైపు పీతల సుజాత వర్గం శనివారం కొమ్ముచిక్కాలలో మంత్రి పితాని సత్యనారాయణను కలిసి చర్చించినట్లు సమాచారం. ఏఎంసీ చైర్మన్‌గా తమకు అనుకూలం అయిన వ్యక్తిని నియమించుకునేందుకు ఎంపీ బాబు వర్గం చేస్తున్న ప్రయత్నాల పట్ల సుజాత వర్గం తీవ్రంగా ఆక్షేపిస్తోంది. ప్రతిచోటా ఎమ్మెల్యే ప్రతిపాదించిన వారికే ఏఎంసీ చైర్మన్‌ ఇస్తుండగా, చింతలపూడిలో మాత్రం ఎంపీ పెత్తనం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిబంధనలను కాదని ముఖ్యమంత్రి కూడా ఎంపీ వర్గానికి పదవి కట్టబెట్టడానికి సుముఖత చూపడం లేదు.

మరోవైపు తమను పట్టించుకోవడం లేదని ఎంపీ వర్గం చెప్పినా అది వాస్తవం కాదనే వాదనను పీతల వర్గం ఇంఛార్జి మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. ఇప్పుడు రాజీనామా అస్త్రం ఉపయోగించిన వారిలో కొందరిపై అవినీతి ఆరోపణలు ఉన్న విషయం, వారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఉద్యానవన శాఖలో మొక్కలు వేయకుండానే కోట్లాది రూపాయలు డ్రా చేసిన విషయం, మరుగుదొడ్ల నిర్మాణ పనులు తమ వర్గానికి ఇప్పించుకుని, కట్టకుండా డబ్బులు డ్రా చేసిన వైనాలను ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ఇదే కాకుండా దళిత మహిళ కావడంతో మొదటి నుంచి అమెకు విలువ లేకుండా వ్యవహరిస్తున్నారని, ఒక సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు పదేపదే నియోజకవర్గం విషయంలో జోక్యం చేసుకుంటున్నారన్న వాదనను ముందుకు తీసుకువెళ్లడంతో అధిష్టానం కూడా డైలమాలో పడినట్లు సమాచారం. తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే నామినేటెడ్‌ పదవుల కోసం తమ పదవులకు రాజీనామా చేసినట్లు డ్రామాలు ఆడటాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతో రాజీనామా చేసిన వారు ఈ గొడవకు త్వరగా ఫుల్‌స్టాప్‌ పెట్టాలని తమ నేతలపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. తమ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారిందని వారు తమ అనుయాయుల వద్ద వాపోతున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top