‘పవన్ కళ్యాణ్‌కు యాక్టింగే రాదు’

pawan cannot act exactly - Sakshi

హైదరాబాద్‌ : సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు యాక్టింగే సరిగా రాదని, రాజకీయ నాయకుడిగా పనికిరారని బీజేపీ శాసనసభా పక్షనేత కిషన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..ఆయన(పవన్‌ కల్యాణ్‌) హావభావాలు చూస్తే నవ్వొస్తుందన్నారు. అన్న చిరంజీవిని అడ్డుపెట్టుకుని సినిమా యాక్టర్ అయ్యాడని చెప్పారు. ఇప్పుడు మీడియా మద్దతుతో రాజకీయ నాయకుడు అవుదామనుకుంటుంన్నాడని విమర్శించారు. పవన్ కన్నా ఆయన అన్నకొడుకు మంచి నటుడని వ్యాఖ్యానించారు. కత్తి మహేష్ లాంటి వాళ్లను మీడియానే పైకి లేపిందని చెప్పారు.

 నాగం జనార్దన్ రెడ్డికి పార్టీలో ఎంతో ప్రాముఖ్యత ఇచ్చామని, పార్టీ సంప్రదాయం కాకున్నా ఆయనకు,ఆయన కుమారుడికి గత ఎన్నికల్లో టికెట్లు ఇచ్చామని వివరించారు. బీజేపీతో తెంచుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికే నష్టమని హెచ్చరించారు. కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బీజేపీలో ఇమడలేడని వ్యాఖ్యానించారు. తమ పార్టీలో క్రమశిక్షణ ఎక్కువని, వ్యక్తిగత దూషణలకు పార్టీలో తావులేదని చెప్పారు. సీఎం కేసీఆర్ కేంద్రంతో డూప్ ఫైటింగ్ చేస్తున్నాడని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో బలమైన శక్తిగా ఎదిగేందుకు ప్రణాళిక సిద్ధం చేసామని వెల్లడించారు. 

రేపు జరిగే కోర్ కమిటీ సమావేశంలో అమిత్ షా టూర్ పై చర్చిస్తామని, ఇక మీదట అమిత్ షా తరచూ తెలంగాణలో పర్యటిస్తారని తెలిపారు. కర్ణాటక ఎన్నికలకు వచ్చిన ప్రతిసారి రాష్ట్రంలో అమిత్ షా పర్యటన ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో హంగ్ వచ్చే అవకాశం ఉందన్నారు. మార్చి నుంచి ఉదృతంగా ప్రజల్లోకి వెళ్తామని, అవసరమైతే పాదయాత్ర కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నామని, పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top