కేసీఆర్‌ సీఎం అయ్యాకే దానిపై ఆసక్తి : మంత్రి

Palla Rajeshwar Reddy Took Over as Chairman of the Farmers Coordination Committee - Sakshi

సాక్షి, హైదారాబాద్‌ : రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా నియమితులైన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు మహమూద్‌ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డిలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల నిర్ణయాల కారణంగా వ్యవసాయ రంగం దెబ్బతిన్నదని, కేసీఆర్‌ సీఎం అయ్యాకే వ్యవసాయంపై అసక్తి చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో 60 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని, అందుకనుగుణంగా బడ్జెట్‌లో సగానికిపైగా నిధులను ఆ రంగానికే కేటాయించారని తెలిపారు. రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలను ఇతర రాష్ట్రాల రైతులు అడిగే పరిస్థితి వచ్చిందని ప్రశంసించారు. కాళేశ్వరం ద్వారా నీళ్లు, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందిస్తున్నా లాభాలు రావాలంటే గిట్టుబాటు ధరలతో పాటు రైతులకు బేరమాడే శక్తి రావాలని అభిప్రాయపడ్డారు.

హుజూర్‌నగర్‌ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా కూడా విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నాయిని మాట్లాడుతూ.. తెలంగాణ రైతులు అదృష్టవంతులని పేర్కొన్నారు. రైతుకు న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్‌ రైతు లోకానికి ఆదర్శంగా నిలిచారన్నారు. అనంతరం పల్లా రాజేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ. ఇప్పటికే 45వేల చెరువులలో పూడిక తీశామని, కోటీ 25 లక్షల ఎకరాలకు నీరివ్వడం ఖాయమన్నారు. ప్రస్తుతం రైతులు మార్కెట్‌ పరంగా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. పంటకు గిట్టుబాటు ధర రావడం కోసం మార్కెటింగ్‌ వ్యవస్థను బలోపేతం చేస్తామని, ఏ పంట పండించాలి? ఎక్కడ అమ్ముకోవాలి? అనే అంశాలను రైతే నిర్ధారించే విధంగా రైతు సమన్వయ సమితి కృసి చేస్తుందని వివరించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top