పసుపు–కుంకుమ పచ్చి మోసం

Palakondrayudu Shocks Chandhrababu - Sakshi

వేదికపై చంద్రబాబుకు సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు ఝులక్‌

ప్రసంగం మధ్యలోనే అడ్డుకున్న టీడీపీ నేతలు

రాయచోటి బహిరంగ సభలో ఘటన

అనంతరం ప్రసంగించిన సీఎం

రాయలసీమను రతనాల సీమగా మారుస్తున్నా

మీరు ఒక్క రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తే.. మేము మూడిస్తాం 

అలిపిరిలో బాంబు దాడి జరిగినా భయపడలేదు

సాక్షి కడప :  రాయచోటి ఎన్నికల ప్రచార సభలో ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే సుగువాసి పాలకొండ్రాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాక్షిగా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. పాలకొండ్రాయుడు మాట్లాడుతూ పసుపు–కుంకుమ పథకం మొత్తం ఫ్రాడ్‌ అని వ్యాఖ్యానించడంతో చంద్రబాబు కంగుతిన్నారు. సంబేపల్లె మండలానికి మంజూరైన పసుపు–కుంకుమ నిధులను అసలైన లబ్ధిదారులెవరికీ ఇవ్వకుండా, కొంతమంది కాజేశారని పాలకొండ్రాయుడు వ్యాఖ్యానించారు. దాంతో చంద్రబాబు ఆయనను వారించే ప్రయత్నం చేశారు. మాసాపేట హైస్కూల్‌లో పబ్లిక్‌ పరీక్షల ప్రశ్నా పత్రాలను రూ.20 కోట్లకు అమ్ముకున్నారని, సంబంధిత బాధ్యులను కలెక్టరు కూడా సస్పెండ్‌ చేశారని చెబుతూ పాలకొండ్రాయుడు ప్రసంగాన్ని కొనసాగిస్తుండగా, సభావేదికపై ఉన్న కొంతమంది నేతలు జోక్యం చేసుకుని మాట్లాడింది చాలు.. ముఖ్యమంత్రి మాట్లాడాలంటూ ఆయనను  పక్కకు తీసుకెళ్లారు. కాగా పాలకొండ్రాయుడు ఈ విషయాలను వెల్లడిస్తున్న సమయంలో సభ మొత్తం చప్పట్లు, ఈలలతో మార్మోగిపోవడంతో సీఎం కొంత అసహనానికి గురయ్యారు. అనంతరం పాలకొండ్రాయుడి వద్దనుంచి మైకు లాక్కున్న ముఖ్యమంత్రి  మాట్లాడుతూ పాలకొండ్రాయుడు చెప్పిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుని వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ఓ పార్టీ కార్యకర్త సైతం హంద్రీ–నీవా నీటిని రాయచోటికి ఇవ్వకుండా కుప్పానికి తరలించుకుపోయారంటూ ప్రశ్నించడంతో, అక్కడున్న అధికార పార్టీ నాయకులు సర్ది చెప్పారు. అయితే సీఎం ఆ మాటలను విననట్లు నటిస్తూ ముందుకెళ్లిపోయారు.

అభివృద్ధి, సంక్షేమంలో మనమే టాప్‌
దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే అభివృద్ధి, సంక్షేమంలో మనమే ముందున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా విజయవాడ నుంచి కడపకు ప్రత్యేక విమానంలో వచ్చిన సీఎం..అక్కడి నుంచి హెలీకాఫ్టర్‌ ద్వారా బద్వేలు, రాయచోటి చేరుకుని ప్రసంగించారు. బంగారు గుడ్డు పెట్టే బాతు లాంటి హైదరాబాదును అప్పగిస్తే దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, హైదరాబాదును అభివృద్ధి చేసింది తానేనని మరోమారు చెప్పుకొచ్చారు. ఏపీ అభివృద్ధిని చూసి కేసీఆర్‌ ఓర్వలేక పోతున్నారని విమర్శించారు. అందుకే కేసీఆర్‌ ఇతరులతో కలిసి కుట్రలు చేస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా ఏం చేయలేరని పేర్కొన్నారు. తెలంగాణ నేతలు మాజోలికి వస్తే తగిన గుణపాఠం చెబుతామన్నారు.  ‘నా జీవితంలో హింస లేదు. ముఠాలను అణిచి వేసింది నేనే. నాపై అలిపిరిలో దాడి చేసినపుడు బాంబులకే భయపడలేదు. ఎవరికీ భయపడనని’ బాబు తెలిపారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి కేంద్రం సహకరించలేదన్నారు.

రాయలసీమను రతనాల సీమగా మారుస్తా!
ఇప్పటిæకే గోదావరి–కృష్ణా నదులను అనుసంధానం చేసి పట్టిసీమ ద్వారా నీటిని రాయలసీమకు తరలిస్తున్నామని, త్వరలో గోదావరి నీటిని పెన్నానదికి తీసుకొచ్చి కరువును జయించి రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని పేర్కొన్నారు. ఇప్పటికే హంద్రీ–నీవా ద్వారా నీటిని చిత్తూరుకు అందించామని వివరించారు. రైతులకు సంబంధించి 4, 5 విడతల  రుణమాఫీ సొమ్ము ఏప్రిల్‌ మొదటి వారంలో ఖాతాల్లో వేయనున్నట్లు సీఎం ప్రకటించారు. భగవంతుడు మంచిగా చూస్తే ఒక పెద్దన్నగా కానుకలు ఇస్తూనే ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top