మాయా కొద్నానీ నేరం చేయలేదా!????!

Naroda Patiya Case: Maya Kodnani Is Innocent? - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్‌లోని నరోదా పాటియాలో 2002లో జరిగిన మారణ హోమం కేసులో భజరంగ్‌ దళ్‌ నాయకుడు బాబు భజరంగీని దోషిగా నిర్ధారించిన గుజరాతీ హైకోర్టు నిన్న (శుక్రవారం) బీజేపీ మాజీ మంత్రి మాయా కొద్నాని నిర్ధోషిగా ప్రకటించింది. 97 మంది ముస్లింలు, మహిళలు, పిల్లలను బలిగొన్న నరోదా పాటియా మారణహోమానికి కీలక సూత్రదారి మాయా కొద్నాని అంటూ 2012లో ట్రయల్‌ కోర్టు నిర్ధారించి 20 ఏళ్లకు పైగా జైలు శిక్షకూడా విధించింది.  భారత్‌లో జరిగిన మత ఘర్షణల్లో ఓ మంత్రికి జైలు శిక్ష పడడం తొలిసారి అంటూ నాడు పత్రికలు, టీవీలు వ్యాఖ్యానించాయి.

బీజేపీ, దాని సంఘ్‌ పరివారుకు చెందిన వారు వరుసగా హైకోర్టుల్లో విజయం సాధిస్తూ వస్తున్న నేపథ్యంలోనే మాయా కొద్నానీకి కూడా విముక్తి లభించింది. అసీమానంద్, ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌లు ఇటీవలనే కేసుల నుంచి విముక్తి పొందిన విషయం తెల్సిందే. బరోడా వైద్య కళాశాలలో మెడిసిన్‌ చదువుతున్నప్పుడే ఆరెస్సెస్‌ మహిళా విభాగమైన రాష్ట్రీయ సేవికా సమితిలో మాయా కొద్నాని చేరారు. ఆ తర్వాత అహ్మదాబాద్‌లో గైనకాలజిస్ట్‌గా ప్రాక్టీస్‌ను ప్రారంభించారు. 1995లో రాజకీయాల్లోకి వచ్చి మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.1998లో ఆమె బీజేపీ తరఫున నరోడా నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అహ్మదాబాద్‌ సిటీ బీజేపీ అధ్యక్షులుగా కూడా పనిచేశారు.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం నరోదా పాటియా, నరోదా గ్రామ్‌లలో మాయా కొద్నానీ ముస్లిలకు వ్యతిరేకంగా అల్లర్లను రెచ్చగొట్టారు. ఈ సంఘటనలపై దర్యాప్తు జరిపిన ‘హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌’ 2003లో వెల్లడించిన నివేదిక ప్రకారం మహిళలను, బాలికలను బహిరంగంగా గ్యాంగ్‌ రేప్‌లు చేశారు. అనంతరం వారిని దహనం చేశారు. మగవాళ్లను కత్తులతో నరికి చంపారు. నూరాని మసీదును గ్యాస్‌ సిలిండర్లతో పేల్చి వేశారు. ఈ రెండు సంఘటనలకు నాటి నరోడా బీజేపీ ఎమ్మెల్యే మాయా కొద్నానీ, గుజరాత్‌ విశ్వహిందూ పరిషద్‌ జనరల్‌ సెక్రటరీ జైదీప్‌ పటేల్‌లు రింగ్‌ లీడర్లని హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ నివేదిక పేర్కొంది. అయినప్పటికీ కొద్నానీపై న్యాయపరమైన చర్యలు తీసుకోలేదు. 2007లో ఆమె నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మంత్రిగా చేరారు.

ఆ తర్వాత పోలీసు అధికారి రాహుల్‌ శర్మ 2002లో అల్లర్ల సందర్భంగా మాయా కొద్నానీ తన అనుచర వర్గంతో మాట్లాడిన ఫోన్‌కాల్‌ డేటాను పూర్తిగా బయటపెట్టారు. అల్లర్లప్పుడు భావ్‌నగర్‌ ఎస్పీగా పనిచేసిన రాహుల్‌ శర్మ 400 మంది విద్యార్థులున్న మదర్సాను తగులబెట్టేందుకు కుట్ర జరిగిందని తెల్సి అక్కడికెళ్లి 400 మంది విద్యార్థులను రక్షించారు. దీంతో ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వం అహ్మదాబాద్‌లో డెస్క్‌జాబ్‌కు బదిలీ చేసింది. దాంతో ఆయన 2002 అల్లర్ల నాటి నిందితుల కాల్‌ డేటాను వెలుగుతీయడం ప్రారంభించారు. అలా మాయా కొద్నానీ కాల్‌ డేటాను పూర్తిగా బయటకుతీశారు.  సుప్రీం కోర్టు గుజరాత్‌ అల్లర్లపై ఏర్పాటు చేసిన సిట్‌ ఆ కాల్‌ డేటాను పరిగణలోకి తీసుకొని  2009లో ఆమెకు సమన్లు జారీ చేసింది. సమన్లకు ఆమె ఎంతకు స్పందించకపోవడంతో సుప్రీం కోర్టు ఆమెను పరారీలో ఉన్న నిందితురాలిగా ప్రకటించింది.

కొంతకాలం అజ్ఞాతవాసంలోకి వెళ్లిన మాయా కొద్నానీ తన పదవికి రాజీనామా చేసి కోర్టు ముందు లొంగిపోయారు. ఆమె కేసును విచారించిన ట్రయల్‌ కోర్టు కేసులో ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలతోపాటు కాల్‌ డేటాను అనుబంధ సాక్ష్యంగా తీసుకొని 2012, ఆగస్టు 29వ తేదీన ఆమెకు 28 ఏళ్ల శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. నాడు తీర్పు విన్న కొద్నానీ కోర్టులోనే ఏడుస్తూ కుప్పకూలి పోయారు. ఇదే కేసులో అప్పీల్‌ను విచారించిన గుజరాత్‌ హైకోర్టు శుక్రవారం మాయా కొద్నానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు నమ్మశక్యంగా లేవంటూ కేసును కొట్టి వేసింది. కాల్‌ డేటా గురించి అసలు పట్టించుకున్నట్లు లేదు.  బాబు భజరంగీని దోషిగా తేల్చిన ప్రత్యక్ష సాక్ష్యుల వాంగ్మూలాలు  కొద్నాని ఎందుకు దోషిగా తేల్చలేకపోయాయో!

మాయా కొద్నానీ ‘రాజకీయ క్రీడలకు’ బలయ్యారని 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఆయన ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రెండు నెలల్లో, అంటే జూలై నెలలో అనారోగ్య కారణాలతో మాయా కొద్నాని జైలు శిక్షను గుజరాత్‌ హైకోర్టు రద్దుచేసి ఆమెకు బెయిల్‌ మంజూరు చేసింది. ఇది రాజకీయ క్రీడ కాదంటారా?!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top