మోదీకి అందని థాక్రే ఆహ్వానం!

MNS Chief Raj Thackeray Did Not Invited Modi - Sakshi

ముంబై : మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రే తన కుమారుడి వివాహానికి ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించకపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అడ్వాణీతోపాటు పలువురు కేంద్ర మంత్రులకు వివాహ ఆహ్వానాలు అందగా.. ప్రధాని మోదీకి మాత్రం ఇంతవరకు ఆహ్వానం అందకపోవడం గమనార్హం. గత కొద్దిరోజులుగా మోదీపై బాహాటంగానే విమర్శలు చేస్తున్న థాక్రే.. ఉద్దేశపూర్వకంగానే మోదీని ఆహ్వానించడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  

రాజ్ థాక్రే కుమారుడు అమిత్‌, ప్రముఖ ఫిజీషియన్‌ డాక్టర్‌ సంజయ్‌ బోరుడె కుమార్తె మిథాలిల వివాహం జనవరి 27న లోవర్‌ పరేల్‌లోని సెయింట్‌ రెగిస్‌ హోటల్‌లో జరగనుంది. ఈ వివాహానికి ఆహ్వానించడానికి రాజ్‌ థాక్రే గతవారమే ఢిల్లీ వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. అనివార్య కారణాల వల్ల వెళ్లలేకపోయారు. దీంతో ఆయన తన సన్నిహతులైన హర్షల్‌ దేశ్‌పాండే, మనోజ్‌ హతేకు ఆహ్వాన బాధ్యతలు అప్పగించారు. 

వీరిద్దరూ ఢిల్లీలోని పలువురు రాజకీయ ప్రముఖులను కలిసి వివాహానికి ఆహ్వానించారు. వివాహ ఆహ్వానాలు పొందినవారిలో కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీతోపాటు కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, సుష్మాస్వరాజ్‌, నితిన్‌ గడ్కరీ, ప్రకాశ్‌ జవడేకర్‌, ధర్మేంద్ర ప్రదాన్‌, మేనకా గాంధీ, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ తదితరులు ఉన్నారు. ఎన్సీపీ నేత శరథ్‌ పవార్‌ను కూడా ఆహ్వానించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఆహ్వానం అందింది. అయితే మోదీకి మాత్రం ఇంతవరకు ఆహ్వానం అందలేదు. కొద్దిరోజుల క్రితం కుమారుడి వివాహానికి ప్రధానిని ఆహ్వానిస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు రాజ్‌థాకరే స్పందిస్తూ.. 'పెళ్లి అనే బంధాన్ని మోదీ నమ్ముతారా?' అంటూ బదులిచ్చారు. 

కొత్త కూటమి..?
మహారాష్ట్రలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), కాంగ్రెస్‌లు కూటమిగా ఏర్పడతాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈనేపథ్యంలో మోదీని రాజ్ థాక్రే కుమారుడి పెళ్లికి ఆహ్వానించకపోవడం ఈ తరహా ప్రచారానికి బలంచేకూరుస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలో మిత్రపక్షం శివసేన బీజేపీకి ఎదురుతిరుగుతున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీపై బాహాటంగానే శివసేన నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో శివసేన ఒంటరిగానే బరిలోకి దిగుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో మహారాష్ట్రలో మహాకూటమి ఏర్పడితే బీజేపీ కష్టాలు తప్పవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top