త్వరలో ఐటీ పాలసీ.. స్టార్టప్‌ కంపెనీలూ వస్తాయ్‌

Minister Mekapati Goutham Reddy Reply on IT Policy in Assembly - Sakshi

అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి మేకపాటి గౌతంరెడ్డి

సాక్షి, అమరావతి: గత చంద్రబాబు ప్రభుత్వం గందరగోళానికి గురిచేసేరీతిలో ఐటీ విధానాన్ని అవలంబించడంతోపాటు ఐటీ కంపెనీలకు సరైన ప్రోత్సాహం అందించలేదని, అందువల్లే గతంలో ఐటీ కంపెనీలు రాష్ట్రానికి రాలేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇన్నోవేషన్‌ హబ్‌ కోసం గత చంద్రబాబు సర్కార్‌ రూ. 100 కోట్లు కేటాయించి.. ఖర్చు పెట్టింది సున్నా అని ఆయన శుక్రవారం సభలో వెల్లడించారు. ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడంతోనే నాస్కామ్‌ ఏపీ రాకుండా వెళ్లిపోయిందన్నారు. 

ప్రపంచంలోనే ఉత్తమమైన ఇంక్యూబేటరీ కంపెనీలతో తాము మాట్లాడుతున్నామని, ఇందులో ఇజ్రాయెల్‌కు చెందిన ఉత్తమ ఇంక్యూబేటరి కంపెనీ కూడా ఉందని తెలిపారు. ఈ మూడు ఇంక్యూబేటరీ కంపెనీలతో ఒప్పందం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ కంపెనీలు వాళ్ల ఖర్చుతో రాష్ట్రంలో జాయింట్‌ వెంచర్లు ఏర్పాటు చేయనున్నాయని, ఈ ఇంక్యూటేరీస్‌ ద్వారా రాబోయే రోజుల్లో స్టార్టప్‌ కంపెనీలు రానున్నాయని తెలిపారు. స్టార్టప్‌ కంపెనీలు వస్తే.. వాటితోపాటు వెంచర్‌ క్యాపిటలిస్టులు సహజంగా వస్తారని వెల్లడించారు. 

భూమి ఇచ్చి మళ్లీ అద్దెకు తీసుకుంది!
తెలంగాణ ఐటీ పాలసీ సరళంగా ఉండటంతో అక్కడ ఐదు లక్షల ఉద్యోగాలు సృష్టించారని గౌతంరెడ్డి తెలిపారు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన ఐటీ పాలసీలు గందరగోళంగా సంక్లిష్టంగా ఉన్నాయని, ఈ పాలసీల వల్ల ఐటీశాఖలోనే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పారు. డీటీపీ పాలసీ కింద ప్రభుత్వం భూమిని కేటాయించగా.. దానిని పలు కంపెనీలు అభివృద్ధి ఇచ్చాయని, మళ్లీ ఆ భూమినే ప్రభుత్వం తిరిగి అద్దెకు తీసుకుందని వెల్లడించారు. ఈ డీటీపీ పాలసీల వల్ల చంద్రబాబు హయాంలో పెద్ద ఎత్తున ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని పేర్కొన్నారు. న్యూనెట్‌, సాఫ్ట్‌సాల్వ్‌, ప్లేకార్డు తదితర కంపెనీలకు భూములిచ్చి.. వాళ్లు అభివృద్ధి చేశాక మళ్లీ వారి నుంచి ప్రభుత్వం అద్దెకు తీసుకుని.. డబుల్‌ చెల్లింపులు జరిపిందన్నారు. ఏపీలో గత సర్కారు ఐటీ విధానం అయినవారికి ఒకవిధంగా బయటివారికి మరో విధంగా ఉండటంతో.. రాష్ట్రానికి ఐటీ కంపెనీలు రాలేదని వివరించారు. కేవలం పది పేజీల  తెలంగాణ ఐటీ పాలసీ సరళంగా ఉండటంతో అక్కడికి కంపెనీలు వెళుతున్నాయని, తెలంగాణ ఐటీ పాలసీ తరహాలో సరళమైన సమగ్రమైన ఐటీ పాలసీని తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావిస్తున్నారని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top