‘మోసానికి రాజు చంద్రబాబు.. సేనాధిపతి యనమల’ | Minister Anil Kumar Fires On Yanamala Ramakrishnudu | Sakshi
Sakshi News home page

ఏం సాధించారని సన్మానాలు..?

Jan 25 2020 6:07 PM | Updated on Jan 25 2020 6:25 PM

Minister Anil Kumar Fires On Yanamala Ramakrishnudu - Sakshi

సాక్షి, తాడేపల్లి: మోసానికి రాజు చంద్రబాబు అయితే.. సేనాధిపతి యనమల రామకృష్ణుడని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్ మండిపడ్డారు. శనివారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి యనమల అంటూ నిప్పులు చెరిగారు. మోసాలు, కుట్రలు చేసిన ఆయన ఇప్పుడు నీతి వాక్యాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇంకా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారనే భ్రమలో యనమల ఉన్నారని దుయ్యబట్టారు. మంత్రులు తాగి వచ్చారని యనమల వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. దావోస్‌ వెళ్ళి చంద్రబాబు,యనమల ఏమి సాధించుకొచ్చారని మంత్రి అనిల్‌ ప్రశ్నించారు. ప్రజల సొమ్ముతో విహార యాత్రలు చేశారని.. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలను చూసి చంద్రబాబు, యనమల ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. అతితక్కువ కాలంలోనే ‘బెస్ట్‌ పెర్‌ఫార్మింగ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోనే నాలుగవ స్థానంలో నిలిచారన్నారు. అవినీతిలో చంద్రబాబు దేశంలో మొదటి స్థానంలో నిలిచారన్నారు. 

‘మండలిలో ఏదో సాధించినట్లు తండ్రి కొడుకులు సన్మానాలు చేయించుకుంటున్నారు. మండలి రద్దు చేస్తే శాసనసభ ఎందుకని యనమల అంటున్నారు. గతంలో ప్రజా మద్దతు లేని మండలి అవసరం లేదని ఎన్టీఆర్ అన్నారు. 2004లో  కౌన్సిల్ వల్ల ప్రజాధనం వృధా అని చంద్రబాబు విమర్శలు చేశారని’  అనిల్‌ గుర్తుచేశారు. రాష్ట్రాభివృద్ధికి టీడీపీ సహకరించక పోయినా పర్వాలేదని.. కానీ అడ్డుకుంటే సహించబోమని హెచ్చరించారు. ఎమ్మెల్సీలను కొనుగోలు చేశారంటూ యనమల ఆరోపణలను మంత్రి అనిల్‌ తిప్పికొట్టారు. గతంలో వైస్రాయ్‌ హోటల్ లో జరిగిందేమిటో యనమల సమాధానం చెప్పాలన్నారు 

Advertisement
 
Advertisement
Advertisement