సోనియాతో మరోసారి పవార్‌ భేటీ?

Maharashtra Govt Formation: Sharad Pawar Likely to Meet Sonia Gandhi - Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ప్రతిష్టంభనపై చర్చించేందుకు తాత్కాలిక కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మరోసారి న్యూఢిల్లీలో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ భేటీ కానున్నారు. భేటీకి ముందు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరితో చర్చించేందుకు శరద్‌ పవార్‌ మంగళవారం ముంబైకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయాల్లో తాజాగా నెలకొన్న ప్రతిష్టంభనపై తదుపరి ఎలాంటి వ్యూహరచన చేయాలనే దానిపై చర్చినున్నారు. ఆ తరువాత తుది నిర్ణయం తీసుకుని సోనియాతో భేటీ అయ్యేందుకు పవార్‌ ఢిల్లీకి బయలుదేరనున్నారు.  

ఇప్పటికే పలువురు సమావేశం..
రాష్ట్రంలో అక్టోబరు 21వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా 24వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. కాని ఫలితాలు వెలువడి 18 రోజులు గడిచినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. అంతేగాకుండా శాసన సభ గడువు శనివారం సాయంత్రంతో ముగియడంతో దేవేంద్ర ఫడ్నవీస్‌ అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ సమయంలో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ తీసుకునే నిర్ణయం అత్యంత కీలకంగా మారనుంది. 105 మంది ఎమ్మెల్యేలను గెలుపించుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన  బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్‌ సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శరద్‌ పవార్‌ త్వరలో సోనియా గాంధీతో భేటీ, తమ పార్టీ ఎమ్మెల్యేలందరిని మంగళవారం సమావేశానికి ఆహ్వానించడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు తమ తమ పార్టీ ఎమ్మెల్యేలపై డేగ కన్ను వేశాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తమవైపు లాక్కునే ప్రయత్నం చేసే ప్రమాదముంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా కాంగ్రెస్‌ తమ పార్టీ ఎమ్మెల్యేలను జైపూర్‌కు తరలించింది. శివసేన ముంబైలోని ఓ ఐదు నక్షత్రాల హోటల్‌లో భద్రంగా దాచింది.

ఇదిలా ఉండగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంపై సోనియా నుంచి సలహాలు, సూచనలు స్వీకరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్పీఐ చీఫ్‌ రాందాస్‌ ఆఠావలే, శివసేన ప్రతినిధి, ఎంపీ సంజయ్‌ రావుత్‌ ఇలా వివిధ పార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు శదర్‌ పవార్‌తో భేటీ అయ్యారు. మరికొందరు భేటీ కోసం ఎదురుచూస్తున్నారు. రాజకీయ దిగ్గజం, ఒక సీనియర్‌ నేతగా ఆయన్నుంచి సలహాలు తీసుకుంటున్నారు. దీంతో పవార్‌ నివాసం ప్రముఖుల రాకపోకలతో సందడిగా కనిపిస్తోంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top