జేపీ నడ్డా విమర్శలను తిప్పికొట్టిన కేటీఆర్‌

KTR Critics BJP National Leader JP Nadda - Sakshi

బీజేపీ జాతీయ నాయకుడిపై కేటీఆర్‌ సెటైర్లు

కూకట్‌పల్లిలో టీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశం

సాక్షి, హైదరాబాద్‌ : బీజేపీ జాతీయ నాయకుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా విమర్శలను టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తిప్పికొట్టారు. దేశాన్ని 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌కు, బీజేపీకి తాము సాధిస్తున్న అభివృద్ది నచ్చదని ఎద్దేవా చేశారు. బీజేపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా పచ్చి అబద్ధాలకు అడ్డా అని చురకలంటిచారు. రాష్ట్రంలో 119 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ 103 స్థానాల్లో డిపాజిట్ గల్లంతైందని గుర్తు చేశారు. కర్ణాటక తరహా రాజకీయాలు తెలంగాణలో సాగవని కేటీఆర్‌ చెప్పారు. కూకట్‌పల్లిలో జరిగిన టీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మల్లారెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు శంబీపూర్‌ రాజు, నవీన్‌, ఇతర నాయకులు పాల్గొన్నారు.
(చదవండి : అధికారంలోకి వస్తాం.. రూపురేఖలు మారుస్తాం: జేపీ నడ్డా)

బీజేపీ పాలిత  రాష్ట్రాల్లో 24 గంటల విద్యుత్ సరఫరా ఎక్కడ ఉందో నిరూపించాలని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. సాగు నీటి రంగంలో కోటి ఎకరాలకు నీరందించాలనే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టామని పేర్కొన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే నడ్డా విమర్శలు హాస్యాస్పదమని అన్నారు. అది నిజమే అయితే ఢిల్లీలో తేల్చండని హితవు పలికారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాకపోతే గడ్డం తీయనని శపథం చేసిన వ్యక్తి కనిపించడం లేదని పరోక్షంగా టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌పై విమర్శలు చేశారు.

దానికంటే వెయ్యిరెట్లు మేలు..
‘ఆయుష్మాన్ పథకం కంటే ఆరోగ్య శ్రీ వెయ్యి రెట్లు మేలైంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడా రూ. 2000 పింఛన్ పథకం లేదు. పింఛన్‌ పథకంలో కేంద్రం ఇచ్చేది రూ.200 మాత్రమే. మతాల మద్య చిచ్చు పెట్టడమే బీజేపీ లక్ష్యం. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక కర్ఫ్యూలు ఒక్కటి కూడా జరగలేదు. మా పథకాలనే కాపీ కొట్టి ప్రవేశపెడుతున్నారు. మాధవరం కృష్ణారావు లాంటి ఎమ్మెల్యే వుండటం కూకట్ పల్లి ప్రజల అదృష్టం. తెలంగాణ వ్యాప్తంగా  50 లక్షల సభ్యత్వాలు సాధించాం. నామినేటెడ్ పదవులు కార్యకర్తలకు తప్పకుండా ఇస్తాం. బంగారు తెలంగాణ సాధించే వరకు అవిశ్రాంత పోరాటం చేస్తాం’అని కేటీఆర్‌ అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారమే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. గ్రేటర్‌లో గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని దీమా వ్యక్తం చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top