
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం సమావేశం అయ్యారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయానికి వచ్చిన కేసీఆర్‌ను ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించి, దగ్గరుండి లోనికి తీసుకు వెళ్లారు. తాడేపల్లిలోని సీఎం అధికార నివాసానికి వచ్చిన కేసీఆర్‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇద్దరు సీఎంలు కలిసి భోజనం చేశారు. కేసీఆర్ వెంట టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, టీఆర్‌ఎస్ నేత శేరి సుభాష్ రెడ్డి తదితరులు కూడా ఉన్నారు. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాజీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి కూడా భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేసీఆర్ ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలంటూ జగన్‌ను ఆహ్వానించారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి రావాలని కేసీఆర్ ఆహ్వాన పత్రిక అందచేశారు. ఆ తర్వాత రెండు రాష్ట్రాలకు సంబంధించిన కీలక అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించినట్టు తెలుస్తోంది. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని అంశాలను పరిష్కరించేందుకు ఇద్దరు సీఎంలు చొరవ తీసుకుంటున్నారు. గతంలో రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఇచ్చిన ఇఫ్తార్ విందు సందర్భంగా కూడా హైదరాబాద్‌లో ఇద్దరు ముఖ్యమంత్రులు విభజన అంశాలపై చర్చించారు.
దుర్గమ్మకు కేసీఆర్ పూజలు
అంతకు ముందు విజయవాడ వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా ఇంద్రకీలాద్రికి వచ్చిన దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయంలో ఏపీ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ - కేసీఆర్‌కు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్, ఆహ్వాన పత్రికను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకస్వాములు సీఎంకు ఆశీర్వచనాలు ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేయగా, అమ్మవారి చిత్రపటాన్ని ఆలయ అధికారులు బహుకరించారు. దాదాపు అరగంట పాటు కేసీఆర్ ఆలయంలో గడిపారు.