తెలంగాణ బతుకమ్మ కవిత

Kalvakuntla Kavitha Profile of a Dynamic Leader from Telangana - Sakshi

సాక్షి వెబ్ ప్రత్యేకం : మహిళా రాజకీయ నేతల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుని, తండ్రి కేసీఆర్‌ తగ్గ తనయ, అన్న కేటీఆర్‌కు దీటుగా ఎదుగుతోన్న నాయకురాలు నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత. ఆమె మాటల తూటాలను ప్రత్యర్థి పైకి వదిలితే.. ఎంతటి వారైనా కంగు తినాల్సిందే. రాజకీయ ప్రసంగాల్లో తన వాగ్ధాటితో జన సమూహాన్ని ఆకర్షించే కవిత.. లోక్‌సభలో మన రాష్ట్ర హక్కులకై నిరంతరం పోరాడుతున్నారు. అనితర సాధ్యమైన వాక్పటిమతో.. జాతీయస్థాయిలో మన రాష్ట్ర గొంతును వినిపిస్తున్నారు.  రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి విజయదుందుభి మోగించేందుకు సిద్దమయ్యారు.

నర్సు అవ్వాలన్నది తన చిన్నప్పటి కల అని.. ఆస్పత్రులకు వెళ్లినప్పుడు నర్సులు తెల్ల గౌను వేసుకొని రోగులకు వైద్యసేవలు అందించడాన్ని చూసి పెద్దయ్యాక నర్సు వృత్తిలోనే చేరాలని అనుకున్నాను ఓ సందర్భంలో కవిత చెప్పుకొచ్చారు. అయితే పరిస్థితుల కారణంగా తాను ఇంజనీరింగ్‌ చదివి, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించానని చెప్పారు. వ్యాపారవేత్తగా రాణించాలనుకున్నా అదీ సాధ్యపడలేదని, విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం తన భవిష్యత్తునే మార్చేసిందన్నారు. కుటుంబంతో పాటు తానూ ఉద్యమంలో పాలుపంచుకుని రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

తెలంగాణ జాగృతిని స్థాపించి.. ప్రపంచస్థాయిలో తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పారు. సమాజంలోని అన్నీ వర్గాల వారికి చేరువ అయ్యేలా దీనిని కవిత తీర్చిదిద్దారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలతో మమేకమవుతూ తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాల గొప్పదనాన్ని చాటిచెబుతూ వారిని ఉద్యమంలో పాల్గొనేలా చేయడంలో తెలంగాణ జాగృతి విజయవంతమైంది. తెలంగాణ జాగృతి ఇటీవలే పదేళ్ళ సంబరాన్ని పూర్తి చేసుకుంది. కేవలం తెలంగాణలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలను ఏకం చేసేందుకు తెలంగాణ జాగృతిని ప్రణాళికలతో ముందుకు తీసుకెళ్ళడంలో కవిత సక్సెస్‌ అయ్యారు.

పలు దేశాల్లో నేడు తెలంగాణ జాగృతి విస్తృతమైంది. విద్య, వైద్యం, ఉపాది రంగాల్లో బాగా వెనకబడి ఉన్న మనవాళ్ళను జాగృత పరచాలని కవిత నిర్ణయించు కున్నారు. అందుకు అనుగుణంగా తెలంగాణ జాగృతి ద్వారా కొన్ని ప్రాజెక్టులను ఆమె చేపట్టారు. మహిళలకు, యువకులకు స్వయంఉపాధి, విద్యలో ప్రతిభ కనబరిచిన పేదవాళ్ళకు స్కాలర్‌షిప్‌లు, చదువు పూర్తి చేసుకున్న నిరుద్యోగులకు నైపుణ్యాభి వృద్ధిలో శిక్షణ ఇచ్చి వారికి తగిన ఉపాధి లభించేలా చేయడం వంటివి చేస్తున్నారు. సేవ్‌ ఫార్మర్ పేరిట వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడులు రాక ఆత్మహత్యలకు పాల్పడిన  రైతు కుటుంబాలను ఆదుకునేందుకు వీలుగా 2500 రూపాయలను పెన్షన్‌గా వారికి అందిస్తున్నారు.

ప్రతి యేడాది తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ ఉత్సవాలు దేశవిదేశాల్లో ప్రాచుర్యం పొందాయి. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ.. మహిళా ఉద్యమాలకు నాయకత్వం వహించారు. యేటా ట్యాక్‌బండ్‌పై నిర్వహించే బతుకమ్మ పండుగలో కవిత పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. ఉద్యమ సమయంలోనూ పలుమార్లు ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఆడుతూ స్వరాష్ట్ర కాంక్షను చాటిచెప్పారు. తండ్రి కేసీఆర్‌ నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకుని రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నారు.

సినిమా రంగం విషయానికొస్తే.. చిరంజీవి తన అభిమాన హీరో అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. చిన్నతనంలో తన అన్నే ఎప్పుడైనా సినిమాలకు తీసుకెళ్లేవాడని ఓ ఇంటర్వ్యూలో చెబుతూ అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. 1978 మార్చి13న జన్మించిన కవిత.. ఇంజనీరింగ్‌ విద్యనభ్యసించి.. అటుపై మాస్టర్స్‌ డిగ్రీని అమెరికాలో పూర్తి చేశారు. దేవన్‌పల్లి అనిల్‌కుమార్‌ను వివాహామాడిన కవితకు ఇద్దరు కుమారులు(ఆదిత్య,ఆర్య) ఉన్నారు.
 - బండ కళ్యాణ్‌
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top