టీడీపీ నేతలవి బురద రాజకీయాలు: జోగి రమేష్‌

Jogi Ramesh Fires On Chandrababu And TDP Leaders - Sakshi

సాక్షి, తాడేపల్లి: వరద వచ్చి ప్రశాంతంగా ముగిసింది కానీ టీడీపీ నాయకుల బురద రాజకీయాలు మాత్రం ఆగలేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఎద్దేవా చేశారు. సోమవారమిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వరద సహాయక చర్యలపై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తుంటే.. చంద్రబాబు భజనపరులు మాత్రం బురద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ కట్టడంలో ఉండటం తప్పని తెలిసి కూడా చంద్రబాబు అందులోనే ఉండటాన్ని ఏమంటారని ఆయన ప్రశ్నించారు. వరద, ముంపు ప్రాంతాలను పరిశీలించడానికి డ్రోన్‌ ఉపయోగిస్తే తప్పేంటన్నారు. చంద్రబాబును హత్య చేయడానికే డ్రోన్‌లు వాడుతున్నారని దేవినేని ఉమా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు.

బాబును ప్రజలు ఎప్పుడో హత్య చేసి.. 23 అడుగుల గొయ్యిలో పాతేశారని జోగి రమేష్‌ పేర్కొన్నారు. చంద్రబాబుకు ఏమన్నా అయితే ఆత్మహత్య చేసుకుంటానని అంటున్న బుద్ధిలేని బుద్దా వెంకన్నాను ముందు అరెస్ట్‌ చేయాలని ఆయన కోరారు. చంద్రబాబు రోడ్డు మీద వెళ్తుంటే పట్టించుకునే నాధుడే లేడని ఎద్దేవా చేశారు. బుద్దా వెంకన్న, దేవినేని ఉమాలు నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన సొంత ఖర్చులతో అమెరికా వెళ్లారని.. చంద్రబాబులా విందు, వినోదాలకు కాదని స్పష్టం చేశారు. జగన్‌ విదేశీ పెట్టుబడుల కోసం తాపత్రయ పడుతున్నారని తెలిపారు.

చంద్రబాబు మంచి కార్యకర్తలను తయారు చేసుకోకుండా కోవర్టులను తయారు చేసుకున్నారని జోగి రమేష్‌ ఆరోపించారు. ఆ కోవర్టుల్లో కొందరు బీజేపీలో చేరి చంద్రబాబు గొంతు వినిపిస్తున్నారని ఆయన మండి పడ్డారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు అడ్డంగా పెట్టాలని లోకజ్ఞానం లేని లోకేష్ ట్విట్లు చేస్తున్నాడని రమేష్‌ ఎగతాళి చేశారు. చంద్రబాబు కనీసం వారానికొకసారైనా లోకేష్‌కు రాజకీయ జ్ఞానం నేర్పాలని రమేష్‌ కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top