
సాక్షి, అమరావతి: వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను ఆదుకునేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులు, అధికారులు అహర్నిశలు శ్రమిస్తుంటే .. చంద్రబాబు ఇల్లు మునుగుతోందంటూ టీడీపీ నేతలు వారం రోజులపాటు సంతాప దినాలు జరుపుకుంటున్నారని ఎమ్మెల్యే జోగి రమేష్ ఎద్దేవా చేశారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వరదలతో ప్రజలు అల్లాడుతుంటే వారికి సహాయం చేయాలని ఏ రాజకీయ పార్టీకైనా, వ్యక్తికైనా అనిపిస్తుందన్నారు. చంద్రబాబు, ఆయన వందిమాగధులైన దేవినేని ఉమ, బుద్దా వెంకన్న, బొండా ఉమ లాంటివారు మాత్రం బురద రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇక్కడ ఒక ఇంటిని కూడా నిర్మించుకోలేదన్నారు. ఎవరో నిర్మించిన అక్రమ కట్టడంలో ఉండటం ఏంటని నిలదీశారు. బుద్ధిలేని వెంకన్న ఆత్మహత్య చేసుకుంటానంటున్నారని.. ఇలాంటి మాటలు మాట్లాడటానికి సిగ్గు, శరం ఉండాలని పేర్కొన్నారు. చంద్రబాబు ఇంటిపై డ్రోన్ ఎగరటం పెద్ద సమస్యలా గగ్గోలు పెడుతున్నారని, డ్రోన్లతో వరద పరిస్థితులను అంచనా వేయటం తప్పెలా అవుతుందని నిలదీశారు. చంద్రబాబును హత్య చేయడానికి కుట్ర జరుగుతోందని టీడీపీ నేతలు అంటున్నారని.. ఐదుకోట్ల ఆంధ్రులు ఆయనను ఇప్పటికే రాజకీయంగా సమాధి చేశారని అన్నారు. చంద్రబాబును హత్య చేయాల్సిన అవసరం, అగత్యం ఎవరికీ లేదని, ఆయన బందరు రోడ్డులో నడుచుకుంటూ వెళ్లినా పట్టించుకునేవారే ఉండరని అన్నారు.
ఓర్వలేకే జగన్ పర్యటనపై విమర్శలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్తే ఓర్వలేని వారంతా మాట్లాడుతున్నారని, టీడీపీ వారి లాగా పర్యటనలకు రూ.కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదని రమేష్ పేర్కొన్నారు. ఇందుకు సీఎం వైఎస్ జగన్ తన సొంత డబ్బు వెచ్చిస్తున్నారని స్పష్టం చేశారు. పెట్టుబడుల కోసం అక్కడి వారితో మాట్లాడి పరిశ్రమలు వచ్చేలా చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు చౌకబారు మాటలు మాట్లాడుతూ.. విందులు, విలాసాలు చేస్తున్నారనటం సరికాదన్నారు. కొందరు బీజేపీలో చేరి చంద్రబాబుకు అనుకూలంగా అద్దె గొంతులు వినిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ అధిష్టానం ఇలాంటి కోవర్టులను గురించి తెలుసుకుని ప్రవర్తించాలన్నారు. కనీస జ్ఞానం లేకుండా లోకేశ్ పడవను అడ్డుపెట్టి వరదను చంద్రబాబు ఇంట్లోకి పంపారని ట్వీట్ చేయటం అతడి అపరిపక్వతకు నిదర్శనమన్నారు.