ప్రధాని మోదీది రాక్షసానందం: జైపాల్‌రెడ్డి

Jaipal reddy commented over modi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని మధ్యతరగతి ప్రజలపై ప్రధాని నరేంద్రమోదీ యుద్ధం చేస్తున్నారని, ఆయనలో రాక్షసానందం పొందే అలవాటు ఉండి శాడిస్టులా ప్రవర్తిస్తున్నారని కేంద్ర మాజీమంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. ఇంకో ఏడాదిలో ఆయనకు ప్రజల చేతిలో మూడటం ఖాయ మన్నారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను పెట్రోలియం మంత్రిగా ఉన్నప్పటి కంటే 4 రెట్లు అంతర్జాతీ య మార్కెట్‌లో చమురు బ్యారెల్‌ ధరలు తగ్గాయని, కానీ పెట్రో ఉత్పత్తుల ధరలు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు.

మోదీ ప్రధాని అయ్యాక ఇప్పటికి 9 సార్లు ఎక్సైజ్‌ పన్ను లు పెంచారని, తాను మంత్రిగా ఉన్నప్పుడు పన్ను రేటు రూ.1.30 లక్షల కోట్లుంటే, ఇప్పుడు అది రూ.2.70 లక్షల కోట్లకు చేరిందని వివరించారు. తమ పార్టీ ఎమ్మెల్యేల బహిష్కరణ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే రాష్ట్రంలో రాజ్యాంగం ఉందా.. అనే అనుమానం కలుగుతోందన్నారు. హైకోర్టు తీర్పును అమలు చేయకుండా, సుప్రీంకోర్టుకు వెళ్లకుండా కేసీఆర్‌ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

‘బీజేపీ హయాంలో పెట్రోల్‌ ధరలు భగ్గు’
సాక్షి, హైదరాబాద్‌: దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలపై దాడులు, పెట్రోల్‌ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయ ని ఏఐసీసీ సేవాదళ్‌ చీఫ్‌ లాల్‌జీ దేశాయ్‌ అన్నా రు. సోమవారం గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ సేవాదళ్‌ ఆఫీస్‌ బేరర్లు, కార్యవర్గ సభ్యుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని మోదీ నెరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీకి అనుబంధంగా సేవాదళ్‌ విభాగాన్ని బలోపేతం చేయాలని ఆయన సూచించారు. కొత్త తరం నేతలను కలుపుకుని సేవాదళ్‌ను పటిష్టం చేస్తామని, త్వరలోనే డ్రెస్‌ కోడ్‌ కూడా మారుస్తామని చెప్పారు. కార్యక్రమంలో టీపీసీసీ సేవాదళ్‌ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ కనుకుల జనార్దన్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top