
సాక్షి, ముంబై : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ముంబైలో పర్యటిస్తున్న సందర్భంగా తనను బుధవారం పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్ ఆరోపించారు. ‘ఉదయం నుంచి పెద్దసంఖ్యలో పోలీసులు నా ఇంటి చుట్టు ఉన్నారు. నా బంగళా లోపలకు కూడా వచ్చారు. మేం ఈ రోజు ఎలాంటి ఆందోళనలకు పిలుపునివ్వలేదు. అయినా పోలీసులు నా ఇంటిని చుట్టుముట్టారు’ అని నిరుపమ్ మీడియాకు తెలిపారు.
తన ఇంటి చుట్టూ ఎందుకు ఉన్నారని పోలీసులను అడిగితే.. తనపై నిఘా పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు చెప్పారని అన్నారు. ‘మేం అమిత్ షాను ఘెరావ్ చేయడం.. లేదా ఆయన ముందు ఆందోళన చేస్తామని బీజేపీ భావించినట్టు ఉంది. అందుకు నన్ను ఉదయం నుంచి ఇంట్లోనే బంధించారు’ అని ఆయన అన్నారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్నారని, అమిత్ షాకు భద్రత పేరిట తమ పార్టీ శ్రేణులను భయాందోళనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.