జార్ఖండ్‌ ప్రతిపక్ష సీఎం అభ్యర్థిగా సోరెన్‌

Hemant Soren Is Opposition Alliance Face In Jharkhand Election - Sakshi

రాంచీ: రానున్న జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా జేఎంఎం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హేమంత్‌ సోరెన్‌ ఎంపికయ్యారు. దీనిపై జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా దళ్‌(ఆర్జేడీ)లు ఓ అంగీకారానికి వచ్చాయి. రాష్ట్రంలోని మొత్తం 81 సీట్లకు గాను జేఎంఎం 43, కాంగ్రెస్‌ 31, ఆర్జేడీ 7 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఏఐసీసీ ఇన్‌చార్జి ఆర్పీఎన్‌ సింగ్, జేఎంఎం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సోరెన్‌ వెల్లడించారు. సీట్ల సర్దుబాటుపై ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌తో చర్చించిన తర్వాతే ఖరారు చేస్తామని సోరెన్‌ తెలిపారు. 81 సీట్లున్న జార్ఖండ్‌ అసెంబ్లీకి ఈనెల 30వ తేదీ నుంచి ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.  

ఆర్జేడీ మద్దతు తీసుకోవడాన్ని హేమంత్‌ సోరెన్‌ సమర్థించుకున్నారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను బీజేపీ మోసపూరితంగా అవినీతి కేసుల్లో ఇరికించిందని ఆయన ఆరోపించారు. లాలూ ప్రసాద్‌ను తీవ్రవాదిగా చూస్తోందని వ్యాఖ్యానించారు. తమ కూటమిలోని పార్టీలు ఎక్కడా స్నేహపూర్వక పోటీ చేయడానికి వీలు లేదని, అలా చేస్తే సంకీర్ణం నుంచి బయటికియ వెళ్లిపోవాల్సి ఉంటుందని ఆర్పీఎన్‌ సింగ్ స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top