బీసీలకు పెద్దపీట

Gorantla Madhav As BC Parliament Coordinator in YSRCP - Sakshi

 వైఎస్సార్‌సీపీ ‘పురం’ పార్లమెంట్‌ సమన్వయకర్తగా జి.మాధవ్‌

ఇప్పటికే అనంతపురం పార్లమెంట్‌ సమన్వయకర్తగా బోయ తలారి రంగయ్య

అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ముగ్గురు బీసీలకు ప్రాధాన్యం

బీసీల పార్టీగా చెప్పుకునే టీడీపీ క్రమంగా ఆ వర్గానికి దూరమవుతోంది. ఇదే సమయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు కీలక పదవులు కట్టబెడుతూ         ఆ వర్గంలో చెరగని ముద్ర వేసుకుంటోంది. జిల్లాలోని రెండు పార్లమెంట్‌ స్థానాలకు సమన్వయకర్తలుగా బోయ, కురుబ సామాజిక వర్గాలకు చెందిన పీడీ తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్‌కు స్థానం కల్పించింది. ఇకపోతే రాయదుర్గం, పెనుకొండ, కళ్యాణదుర్గం నియోజకవర్గాల సమన్వయకర్తలుగా కూడా బీసీ వర్గాలకు చెందిన     కాపు రామచంద్ర, శంకరనారాయణ, ఉషాశ్రీలకు ప్రాతినిధ్యం కల్పించడం విశేషం.

సాక్షి ప్రతినిధి, అనంతపురం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ హిందూపురం పార్లమెంట్‌ సమన్వయకర్తగా గోరంట్ల మాధవ్‌ను నియమిస్తూ ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పోలీసు అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఉన్న సీఐ గోరంట్ల మాధవ్‌ ఇటీవల తన ఉద్యోగానికి వీఆర్‌ఎస్‌ ఇచ్చి జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన మాధవ్‌ వెనుకబడిన వర్గాలతో పాటు అన్ని సామాజిక వర్గాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పోలీసు శాఖలో కూడా నిజాయతీ అధికారిగా, విధి నిర్వహణలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. పార్టీలో చేరిన కొద్దిరోజుల్లోనే ఆయనన్ను అత్యంత కీలకమైన, ప్రాధాన్యత కలిగిన పార్లమెంట్‌ సమన్వయకర్తగా నియమించడం విశేషం.

బీసీలకు ప్రాధాన్యం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లాలో బీసీలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పదవుల కేటాయింపులో పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే అనంతపురం పార్లమెంట్‌ సమన్వయకర్తగా బోయ రంగయ్య  కొనసాగుతున్నారు. హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడిగా, పెనుకొండ సమన్వయకర్తగా కురుబ శంకర్‌నారాయణ, కళ్యాణదుర్గం, రాయదుర్గం సమన్వయకర్తలుగా కురుబ ఉషాశ్రీచరణ్, కాపు రామచంద్ర(వీరశైవ లింగాయత్‌)లు కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ‘పురం’ పార్లమెంట్‌ సమన్వయకర్తగా కురుబ సామాజిక వర్గానికి చెందిన గోరంట్ల మాధవ్‌ను నియమించడంతో బీసీలకు పార్టీలో మరింత సముచిత స్థానం, గౌరవం లభించినట్లయింది. ఇప్పటికే పార్టీ పదవుల్లోనూ అత్యంత కీలకమైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా కూడా కురుబ సామాజిక వర్గానికి చెందిన కిష్టప్ప, రాగే పరుశురాంలు కొనసాగుతున్నారు.

బీసీలకు జగన్‌ ఇచ్చిన గౌరవం ఇది: గోరంట్ల మాధవ్‌
హిందూపురం పార్లమెంట్‌ సమన్వయకర్తగా నన్ను నియమించిన మా పార్టీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే నాకు సహకరించిన జిల్లా ఇన్‌చార్జ్‌ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పార్లమెంట్‌ అధ్యక్షులు శంకర్‌నారాయణ, అనంత వెంకట్రామిరెడ్డి, సమన్వయకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు. ఉద్యోగ జీవితం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు నన్ను ప్రోత్సహించి, వెన్నంటే నిలిచిన కురుబ సోదరులతో పాటు బీసీలకు కృతజ్ఞతలు. మా అధినేత ఇచ్చిన బాధ్యతను నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా. అనంతపురం జిల్లాలో మా పార్టీ జెండాను రెపరెపలాడించడమే పార్టీ నేతల ముందున్న ప్రథమ కర్తవ్యం. దీని కోసం సైనికుడిలా పోరాడతా.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top