
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నా చంద్రబాబును ఓటమి భయం వెంటాడుతోంది. ఎన్నికల్లో తనకు ఓటమి తథ్యమని ఆయన గుర్తించినట్లు తెలుస్తోంది. అందుకే చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచార సభల్లో వేదాంత ధోరణిలో మాట్లాడారు. తనకు పదవి పోయినా బాధ లేదని చెప్పుకొచ్చారు. తనకు కుటుంబం ఉందని, భార్య, పిల్లలు ఉన్నారని, పదవి పోతే వారితో కాలం గడుపుతానని అన్నారు. ఎంత దాచుకుందామని ప్రయత్నిస్తున్నా చంద్రబాబులో నిర్వేదం బయట పడుతోందని సాక్షాత్తూ టీడీపీ శ్రేణులే చెబుతున్నాయి. తనకు పదవి పోయినా బాధ లేదని చంద్రబాబు చెప్పడంతో టీడీపీ అభ్యర్థులతోపాటు నాయకులు, కార్యకర్తలు విస్మయానికి గురయ్యారు. తమ అధినేతకు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా పోతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఓడిపోతే ఇంటికే పరిమితమా?
పోలింగ్ సమయం సమీపిస్తున్న కొద్దీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, జగన్ సోదరి షర్మిల రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు కొనసాగిస్తున్నారు. వారి ఎన్నికల ప్రచార సభలకు జనం పోటెత్తుతున్నారు. ఎర్రటి ఎండలను సైతం లెక్కచేయకుండా తండోపతండాలుగా తరలివస్తున్నారు. మరోవైపు బాబు సభలకు డ్వాక్రా మహిళలు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను బలవంతంగా తరలిస్తున్నా వారి నుంచి కనీస స్పందన కరువవుతోంది. ఫరూక్ అబ్దుల్లా, కేజ్రీవాల్, మమతా బెనర్జీ తదితర పొరుగు రాష్ట్రాల నేతలను తీసుకొచ్చి తనకు అందరూ అండగా ఉండాలని పదే పదే కోరుతున్నారు. ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైతే చంద్రబాబు ఇంటికే పరిమితమవుతారా? పార్టీని చాపచుట్టేస్తారా? అనే వాఖ్యలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి.