విదేశాల్లోనూ వారసత్వ రాజకీయం | Dynasties Still Run The World, New Study Finds | Sakshi
Sakshi News home page

విదేశాల్లోనూ వారసత్వ రాజకీయం

Mar 30 2019 4:43 PM | Updated on Mar 30 2019 7:44 PM

Dynasties Still Run The World, New Study Finds - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వారసత్వ రాజకీయాల బెడద ఒక్క భారత దేశానికే పరిమితం కాలేదు. ప్రపంచంలోని పలు దేశాలు ఈ బెడద బారిన పడుతున్నాయి. అమెరికా, జపాన్‌ దేశాల నుంచి ఫిలిప్పైన్స్, ఇండోనేసియా వరకు వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఆఫ్రికా, ఆసియా, ఉత్తర అమెరికా, లాటిన్‌ అమెరికా దేశాల్లో 2000 సంవత్సరం నుంచి 2017 వరకు పదవిలో ఉన్న 1029 మంది దేశాధ్యక్షులు, ప్రధాన మంత్రుల కుటుంబాల నేపథ్యాన్ని ‘హిస్టారికల్‌ సోషల్‌ రీసర్చ్‌’ జనరల్‌ అధ్యయనం జరిపి 2018, డిసెంబర్‌లో ఓ నివేదికను వెల్లడించింది.

దాదాపు ప్రతి పది మంది ప్రపంచ దేశాధినేతల్లో ఒక్కరు వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన వారే. 1029 మంది అధ్యక్షులు, ప్రధాన మంత్రుల్లో 119 మంది (12 శాతం) రాజకీయ వారసత్వం నుంచి వచ్చిన వారే. వారిలో అమెరికా మాజీ అధ్యక్షులు జార్జి డబ్లూ బుష్, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడియూ, అర్జెంటీనా మాజీ అధ్యక్షులు క్రిస్టినా ఫెర్నాండేజ్‌ ప్రముఖులు. పేద, ధనిక దేశాలతో సంబంధం లేకుండా ఈ వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఒకప్పుడు రాచరిక, జమీందారి వ్యవస్థలోనే ఈ వారసత్వ రాజకీయం కనిపించేది. నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా ఈ వారసత్వ రాజకీయాలు కొనసాగడం అంటే ప్రజస్వామ్య వ్యవస్థ ఎంత బలహీన పడుతుందో అర్థం చేసుకోవచ్చు.

జార్జిబుష్, జస్టిన్‌ ట్రూడియూ ఇద్దరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకులే. వారి తండ్రులు కూడా ఇంతకుముందు ఆ పదవుల్లోనే కొనసాగారు. 2000–2017 మధ్య ఒక్క యూరప్‌ నుంచే వారసత్వ రాజకీయాల కారణంగా 13 శాతం మంది దేశాధ్యక్షులు, ప్రధాన మంత్రులు వచ్చారు. మొత్తం 54 మంది దేశాధినేతల్లో ఆరుగురికి మాజీ దేశాధినేతలతో రక్త సంబంధం ఉంది. లాటిన్‌ అమెరికా నుంచి వచ్చిన 88 దేశాధినేతల్లో 11 మంది రాజకీయ వారసత్వం ఉంది. సబ్‌ సహారా ఆఫ్రికాలోనే వారసత్వ రాజకీయం తక్కువగా ఉంది. అక్కడి 29 మంది దేశాధినేతల్లో కాంగో అధ్యక్షుడు జోసఫ్‌ కబీలా, కెన్యా ప్రధాని ఉహ్రూ కెన్యట్టాలకు మాత్రమే మాజీ అధ్యక్షులు, ప్రధాన మంత్రులతో రక్త సంబంధం ఉంది. 204 మంది ఆసియన్‌ నాయకుల కుబుంబ చరిత్రలను అధ్యయనం చేయగా, వారిలో 23 మందికి రాజకీయ వారసత్వ నేపథ్యం ఉంది.

మహిళల్లోనూ రాజకీయ వారసత్వం
వారసత్వ రాజకీయాల కారణంగా అధికారంలోకి వచ్చిన మహిళలు కూడా ఉన్నారు. మొత్తం 1029 మంది ప్రపంచ దేశాధినేతల్లో కేవలం 66 మంది మహిళలు ఉన్నారు. వారిలో వారసత్వ రాజకీయాలు కలిగిన వారిలో జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మార్కెల్, పాకిస్థాన్‌ మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో, బ్రెజిల్‌ మాజీ అధ్యక్షులు డిల్మా రౌసెఫ్‌లు సహా 19 మంది ఉన్నారు. ఈ లెక్కన వారసత్వ రాజకీయాల్లోకి పురుషులకన్నా మహిళలే ఎక్కువగా వచ్చినట్లు. అయితే వారసత్వంగా అధ్యక్ష లేదా ప్రధాని పదవులు అలంకరించిన మహిళలు, పురుషుల కారణంగానే అంటే, తండ్రి లేదా భర్త కారణంగా రాజకీయాల్లోకి వచ్చిన వారే. పాక్‌ మాజీ ప్రధాని బేనజీర్‌ భుట్టో తన తండ్రి జుల్ఫికర్‌ భుట్టో హత్య కారణంగా రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెల్సిందే. అలాగే ఇతరులు. అయిన ప్పటికీ రాజకీయ వారసత్వం లేకుండా అత్యున్నత అధికార పదవులు అలంకరించిన మహళలు 71 శాతం ఉండడం విశేషమే.

చదవండి: అన్ని పార్టీల్లోనూ రాజకీయ వారసత్వం!

రాజకీయ వారసత్వంతో ఎంత ముప్పు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement