గంటాపై గుర్రు | criticism on ganta srinivas rao | Sakshi
Sakshi News home page

గంటాపై గుర్రు

Dec 30 2017 10:24 AM | Updated on Oct 1 2018 6:33 PM

criticism on ganta srinivas rao  - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉత్సవ్‌ మంత్రి గంటా ఉత్సవంగా మారి పోయింది. ఉత్సవాల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి తన ఇంటి కార్యక్రమంలా మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహరిస్తున్నారంటూ సహచర ఎమ్మెల్యేల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం సమీక్షలు కాదు కదా.. ఏర్పాట్లలో కూడా ఏ ఒక్కరినీ భాగస్వామ్యం చేయకపోవడంపై వారు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గంటా తీరుపై కొన్నాళ్లుగా గుర్రుగా ఉన్న ఎమ్మెల్యేలంతా.. విశాఖ ఉత్సవ్‌కు గైర్హాజ రుతో తమ నిరసనను తెలియజేశారు. వరసగా రెండో రోజు కూడా మంత్రి అయ్యన్నతో సహా ఎమ్మెల్యేలు ఉత్సవాలకు డుమ్మా కొట్టడం అధికార టీడీపీలో చర్చకు దారి తీసింది.

రచ్చకెక్కిన విభేదాలు
గంటా–అయ్యన్న మధ్య విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. అవకాశం దొరికినప్పుడల్లా గంటాపై ఒంటికాలిపై లేచే మంత్రి అయ్యన్న ఆయన ఒంటెద్దు పోకడలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గడిచిన మూడేళ్లుగా ఉత్సవాలకు దూరంగా ఉన్న అయ్యన్న.. ఈసారి కూడా ఉత్సవాల దరిదాపుల్లోకి రాలేదు. కనీసం సమీక్షల్లో కూడా ఎక్కడా ఆయన పాల్గొనలేదు. ప్రస్తుతం శ్రీకాళహస్తి నుంచి వస్తున్న మంత్రి అయ్యన్న శనివారం సొంత నియోజకవర్గమైన నర్సీపట్నంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. చివరి రోజు కూడా ఆయన వచ్చే అవకాశాలు కన్పించడం లేదు.

రెండు రోజూ ఎమ్మెల్యేలు డుమ్మా
మరో వైపు మంత్రి గంటా తీరుపై గుర్రుగా ఉన్న ఎమ్మెల్యేలు సైతం ఉత్సవాల దారిదాపులకు వెళ్లలేదు. తొలిరోజు ఏకంగా శాసన సభ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ వచ్చినా.. ఒక్క ఎమ్మెల్యే కూడా ఉత్సవాల్లో పాల్గొనలేదు. కనీసం ఆయనకు స్వాగతం పలికేందుకు కానీ, గెస్ట్‌హౌస్‌లో పలకరించేందుకు కూడా రాలేదు. స్పీకర్‌గా బ్రహ్మరథం పడతారని నగరానికి వచ్చిన కోడెలకు ఆశాభంగం ఎదురైంది. గంటా, అమర్‌నా«థ్‌లతో కలసి కార్నివాల్‌లో పాల్గొన్నారు. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నప్పటికీ.. ముక్తసరిగా నాలుగు ముక్కలు మాట్లాడి వెళ్లిపోయారు. రెండోరోజు మంత్రి అయ్యన్న మాటెలాగున్నా నగర ఎమ్మెల్యేలు, ఎంపీలైనా వస్తారని అంతా భావించారు. కానీ ఒక్క గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఉత్సవాల చుట్టుపక్కల కనిపించలేదు. రెండో రోజైన శుక్రవారం కొల్లు రవీంద్ర, రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్‌ విశాఖ ఉత్సవ్‌కు హాజరయ్యారు.

అసంతృప్తిలో వెలగపూడి
ఉత్సవాలు జరిగే ఆర్కేబీచ్‌ ప్రాంతం తూర్పు నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. చివరకు తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఉత్సవాలకు డుమ్మా కొట్టారు. గంటాపైన, అధికారుల తీరుపైన వెలగపూడి ఒంటికాలిపై లేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేనైన తనకు కనీసం ప్రొటోకాల్‌ కూడా పాటించలేదని, ఆహ్వాన పత్రికల్లో మిగిలిన ఎమ్మెల్యేలతో కలిపి పేర్లు వేయడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అర్బన్‌ జిల్లా అధ్యక్షుడైన దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌తో సహా జిల్లాలోని ఎమ్మెల్యేలంతా గంటా తీరుపై గుర్రుగా ఉన్నారు. జిల్లా అధికారులు గంటా అడుగులకు మడుగులొత్తుతూ తమను పట్టించుకోవడం లేదంటూ జెడ్పీ చైర్‌పర్సన్‌తో సహా ఎమ్మెల్యేలందరూ మండిపడుతున్నారు.

టూరిజం ఈడీ తీరుపై ఆగ్రహం
ప్రస్తుతం విశాఖ ఉత్సవ్‌కు టూరిజం ఈడీ శ్రీరాములునాయుడు తీరుపై ఎమ్మెల్యేలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గంటాను తప్ప ఇతర ప్రజాప్రతినిధులను ఆయన పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యేను వ్యక్తిగతంగా పిలవడం కానీ, కనీసం ఆహ్వాన పత్రాలు స్వయంగా ఇవ్వడం కానీ చేయలేదని ఎమ్మెల్యేలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఉత్సవాల పేరిట లెక్కా పత్రం లేకుండా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తుండడం ఎంతవరకు సమంజసమని మంత్రి అయ్యన్నే గతంలో విమర్శించిన విషయం తెలిసిందే. తాజాగా మిగిలిన ఎమ్మెల్యేలు సైతం ఇదే వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. మొత్తం మీద విశాఖ ఉత్సవాలు అధికార టీడీపీలో విబేధాలకు మరోసారి కేంద్రమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement