సంక్షోభంలో కర్ణాటక సర్కారు

Congress And JDS Politics Are In Difficult Situation - Sakshi

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్‌–జనతాదళ్‌ సెక్యులర్‌(జేడీఎస్‌) ప్రభుత్వం సంక్షోభంలో పడిందా? సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే వరకే సీఎం కుమారస్వామి నేతృత్వంలో ప్రభుత్వం కొనసాగుతుందా? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే చెబుతున్నారు. ఇందుకు సీఎం కుమారస్వామి, కాంగ్రెస్‌ నేత సిద్దరామయ్యల మధ్య నెలకొన్న రాజకీయ వైరమే కారణమని తెలుస్తోంది. వీరిద్దరి వైరం కారణంగా ప్రభుత్వం కూలిపోతుందన్న ఆందోళనల నేపథ్యంలో కాంగ్రెస్‌లోని అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, వ్యూహకర్త కేసీ వేణుగోపాల్‌ రంగంలోకి దిగినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడే వరకూ ఓపిక పట్టాలని ఆయన కాంగ్రెస్‌ శ్రేణులకు సూచించినట్లు వెల్లడించాయి.

కొరవడిన సహకారం..
ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 20 చోట్ల, జేడీఎస్‌ మిగిలిన 8 స్థానాల్లో పోటీచేశాయి. అయితే ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, జేడీఎస్‌ పార్టీల మధ్య సహకారం, ఓట్ల బదిలీ అనుకున్నంతగా జరగలేదు. మాజీ సీఎం సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ నేతలు, కుమారస్వామి నేతృత్వంలోని ఒకరిని మరొకరు విశ్వాసంలోకి తీసుకోలేదు. దీంతో చాలా చోట్ల క్షేత్రస్థాయిలో ఓట్ల బదిలీ అన్నది సాఫీగా జరగలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఘటనతో తమ భవిష్యత్‌ కార్యాచరణపై ఓ నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్‌ నేతలంతా సిద్దరామయ్య ఇంటికి క్యూ కట్టారు.

కేడర్‌పై పట్టుకు సిద్దూ వ్యూహాలు..
ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్‌ పార్టీకి 79 స్థానాలు ఉండగా, జేడీఎస్‌కు 36 ఎమ్మెల్యేల బలముంది. బీజేపీ 104 స్థానాలతో ఏకైక పెద్ద పార్టీగా అవతరించింది. సీఎం కుమారస్వామితో వైరం నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలో తన పట్టు నిలుపుకునేందుకు సిద్దరామయ్య వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుని, ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి అనుకున్నంతగా విజయవంతం కాలేదనీ, ఇందుకు మీరంటే మీరే కారణమని ఇరుపార్టీల నేతలు విమర్శించుకుంటున్న నేపథ్యంలో ఈ పరిస్థితిని సిద్దరామయ్య తనకు అనుకూలంగా మలచుకునే అవకాశముందని వ్యాఖ్యానిస్తున్నారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలోని 17 సీట్లను గెలుచుకుందనీ, ఈసారి కూడా అవే ఫలితాలు పునరావృతమైతే కర్ణాటక సంకీర్ణానికి మూడినట్లేనని స్పష్టం చేశారు. ఒకవేళ కర్ణాటకలో కాంగ్రెస్‌ మెజారిటీ స్థానాలు దక్కించుకుంటే కుమారస్వామి ప్రభుత్వం కొనసాగే అవకాశముందని భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు విషయమై కుమారస్వామితో ఈ వారాంతంలో సమావేశమవుతారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top