ఇది అందరి ప్రభుత్వం

CM YS Jagan Mohan Reddy Says It is everyones government  - Sakshi

ఎన్నికలు అయ్యేవరకే వర్గాలు, పార్టీలు.. తర్వాత అందరూ మనవాళ్లే

కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో సీఎం జగన్‌

గ్రామస్థాయి నుంచి అసెంబ్లీ వరకు వ్యవస్థను మార్చడానికే ఇక్కడికి వచ్చా

వ్యవస్థను మార్చుతానని ప్రజలను అడిగా, అందుకే అవకాశం ఇచ్చారు

కింది నుంచి పైదాకా అవినీతిని కూకటివేళ్లతో పెకలిస్తాం

ముఖ్యమంత్రి, మంత్రులు, ఉద్యోగులు.. ప్రజా సేవకులే

3,648 కిలోమీటర్ల నా పాదయాత్రలో ప్రజల కష్టాలు, కన్నీళ్లు చూశా

ఈ కష్టాలను తొలగించే దిశగా సాగిన నా మూడు వారాల పాలన 

అన్ని సామాజిక వర్గాలు ఆత్మగౌరవంతో జీవిస్తేనే నాకు సంతృప్తి

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 60 శాతానికి పైగా పదవులిచ్చాం

అవినీతి లేకుండా ప్రభుత్వ పథకాల డోర్‌ డెలివరీ

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీని గొప్పగా అమలు చేస్తాం

నవరత్నాల అమలు మా ప్రభుత్వ అజెండా. మేనిఫెస్టో ప్రతిరోజూ కనిపించేలా ఉండాలని ఆదేశాలిచ్చా. మా మేనిఫెస్టోలో మూడింట రెండొంతుల వాగ్దానాల అమలుకు రంగం సిద్ధం చేశాం. ఇదే మాట నిలబెట్టుకుంటూ పరిపాలన ప్రారంభించామని చెబుతున్నా. మాకు ఓటు వేయని ప్రజలు కూడా నిండు మనసుతో దీవించాలని వినమ్రంగా కోరుతున్నాను.
– సీఎం వైఎస్‌ జగన్‌

నీతివంతమైన పాలన అందిస్తేనే రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయి. అభివృద్ధి జరుగుతుంది. అవినీతిని అంతం చేస్తేనే అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తుంది. అప్పుడు దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే రోల్‌ మోడల్‌గా నిలుస్తాం. 

మనకు 972 కిలోమీటర్ల సముద్రతీరం ఉంది. రోడ్లు ఉన్నాయి. ఈ దృష్ట్యా పనుల్లో పారదర్శకత తీసుకు వచ్చి అవినీతికి అడ్డుకట్ట వేస్తే అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రపంచం అంతా ఇదే చెబుతోంది. అందుకే ప్రపంచంలో తక్కువ అవినీతి ఉన్న డెన్మార్క్, న్యూజిలాండ్, ఫిన్‌లాండ్, స్వీడన్, సింగపూర్‌ తదితర దేశాల తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది. 

నాకు రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉందంటూ ఏవోవో మాట్లాడిన వారి మాటలు చూశాం. వారి మంత్రివర్గంలో సామాజిక వర్గాలకు జరిగిన అన్యాయాలూ చూశాం. 2020లో, 2050లో ఇంకా 2070లో
ఏం జరుగుతుందో నేను వారిలా చెప్పడం లేదు. సామాజిక వర్గాల వారీగా న్యాయం చేసి చూపించా.

సాక్షి, అమరావతి: ‘వ్యక్తులు, వర్గాలు, పార్టీలు ఇవన్నీ ఎన్నికల వరకే. ప్రభుత్వం ఏర్పాటయ్యాక అందరూ మనవాళ్లే. ప్రతి వర్గం వారికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు దక్కాలి. ఈ దిశగానే ఈ ప్రభుత్వం పని చేస్తుంద’ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కుల, మత, వర్గ భేదం లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని, ఇది ఏ రాజకీయ పార్టీకో, ఏ వర్గానికో మాత్రమే పనిచేసే ప్రభుత్వం కాదని చెప్పారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా మంగళవారం ఆయన శాసనసభలో మాట్లాడారు. ప్రజలు, దేవుడు మెచ్చి కనీవినీ ఎరుగని రీతిలో మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారన్నారు. 3,648 కిలోమీటర్ల తన పాదయాత్రలో ప్రజల కష్టాలు కళ్లారా చూశానని, వారి బాధలు విన్నానని, వారి సమస్యలు తీర్చేందుకే నాడు హామీలిచ్చానని చెప్పారు. జగన్‌ తన ప్రసంగంలో ఇంకా ఏం చెప్పారంటే..

పాదయాత్రలో చెప్పిందే చేస్తున్నాం
‘కుళ్లిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలి. నాడు పాదయాత్రలో కూడా పదే పదే ఇదే విషయం చెప్పాను. అవినీతిని నిర్మూలిస్తేనే ఆదాయం పెరుగుతుంది. అవినీతికి అడ్డుకట్ట వేయగలిగితే దేశంలోనే కాదు, ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తాం. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు కోసం పని చేస్తున్నాం. ఈ మూడు వారాల పాలన కూడా ఇదే మాదిరిగానే ఉంది. గ్రామ స్థాయి నుంచి అసెంబ్లీ వరకు చెడిపోయిన వ్యవస్థను మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ఏ గ్రామాన్ని తీసుకున్నా ఇసుక, మట్టి, రేషన్‌కార్డు, ఇల్లు.. కుల, బర్త్, డెత్‌ సర్టిఫికెట్లు, బీమా, కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే సొమ్ము.. చివరకు మరుగుదొడ్డి కోసం కూడా లంచాలు తీసుకుని ఐదేళ్లూ వ్యవస్థను సర్వ నాశనం చేశారు. ఇలాంటి వ్యవస్థను పై నుంచి కింది దాకా పూర్తిగా మార్చాలన్న నిర్ణయంతోనే ఇక్కడికి వచ్చాం. ఈ పని చేస్తున్నందుకు మేము గర్వపడుతున్నాం. రాష్ట్రంలో 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో.. ఒక్క అవకాశం ఇవ్వండి.. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మారుస్తానని ప్రజలను అడిగాను. ప్రజలు, దేవుడు ఆశీర్వదించారు.  ప్రజలు మాకు 50 శాతం ఓట్లు వేసి 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీలు సీట్లు ఇచ్చారు. నీతివంతమైన పాలన అందించాలన్నదే నా లక్ష్యం. జ్యుడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. దేశమంతా మనవైపు చూసేలా పారదర్శకమైన పాలన అందిస్తాం. టెండర్ల పరిశీలనకు ఒక జడ్జిని ఇవ్వమని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ను కోరాం. టెండర్లు నేరుగా జడ్జికే ఇస్తాం. వారం రోజుల పాటు పబ్లిక్‌కు అందుబాటులో పెట్టండి. మాకు వ్యతిరేకులైన వారు ఇచ్చే సలహాలు సైతం తీసుకోండని చెప్పాం. ఆ జడ్జి గారి వద్ద ఉన్న టెక్నికల్‌ టీం ఖర్చులు కూడా మా ప్రభుత్వమే భరిస్తుంది. జడ్జి గారు ఇచ్చిన సూచనలు, సలహాలు పాటిస్తాం. టెండర్లకు ముందే సలహాలు తీసుకుంటాం. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా అవినీతి, దుబారాలకు అడ్డుకట్ట వేస్తాం. 

పేద, మధ్యతరగతి ప్రజల కష్టాలు కళ్లారా చూశాను
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సాగిన 3,648 కిలోమీటర్ల నా పాదయాత్రలో ప్రతి పేద, ప్రతి రైతు, పేదింటి అక్కచెల్లెమ్మలు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు, విద్యార్థులు, మధ్య తరగతి కుటుంబాలు పడే కష్టాలను, కన్నీళ్లను చాలా దగ్గరగా చూశాను. వారి కష్టాలు నేను విన్నాను. వీరందరికీ కష్టాలు రానివ్వకుండా చూడాలన్నదే నా తపన. అందుకే ఇక్కడ నిలుచున్నా. ఇప్పుడు ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నా. పేద, మధ్య తరగతి కుటుంబాలు ఏం కోరుకుంటున్నారో నేను విన్నాను. మంచి చేస్తాను. నవరత్నాలతో పేదవారికి మంచి చేయాలని ఆరాట పడుతున్నాను. అన్ని సామాజిక వర్గాలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంగా జీవించగలిగితే నాకు ముఖ్యమంత్రిగా సంతృప్తికరంగా ఉంటుంది. సామాజిక న్యాయంతో దేశంలోనే నంబర్‌1గా నిలిచేలా పాలన సాగించడానికి శ్రీకారం చుట్టాము. మంత్రి మండలి ఏర్పాటులోనే 13 సామాజిక వర్గాలకు చోటు కల్పించాం. నామినేటేడ్‌ పనుల్లోనూ సామాజిక న్యాయం వర్ధిల్లేట్లుగా చేస్తాం. నా సొంత సామాజిక వర్గానికి మంత్రి పదవులు తగ్గించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రాజ్యాధికారంలోను, రాష్ట్రాధికారంలోనూ వాటా ఇచ్చి ఒక విప్లవానికి శ్రీకారం చుట్టానని గర్వంగా చెబుతున్నాను. నామినేటేడ్‌ పదవుల్లోనే కాదు.. నవరత్నాల ద్వారా ప్రతి వర్గానికి సామాజిక, ఆర్థిక న్యాయం చేస్తాం. 

మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసేది కాకూడదు
ఓటు రాజకీయాలు చేయం. మేనిఫెస్టో అంటే వందల పేజీల పుస్తకాలు పెట్టకుండా, కేవలం రెండే రెండు పేజీలతో మా మేనిఫెస్టో రూపొందించాం. అది ఎప్పుడూ కనిపించే విధంగా రూపొందించాం. నా చాంబర్‌లో కూడా మేనిఫెస్టో కనిపించేలా ఏర్పాటు చేశాం. మంత్రులు కూడా అలాగే ఏర్పాటు చేసుకున్నారు. అధికారులందరి ఛాంబర్‌లలో ఈ మేనిఫెస్టో ఉండాలని చెప్పాం. మేనిఫెస్టో అన్నది చెత్త బుట్టలో పడేసే కార్యక్రమం మాదిరిగా కాకుండా ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీత మాదిరిగా భావిస్తాం.

రైతు భరోసా కింద రూ.12,500
ప్రతి రైతుకు లబ్ధి కలిగేలా రైతు భరోసా పథకం ఏర్పాటు చేస్తున్నాం. చెప్పినదానికంటే ముందుగానే ఈ ఏడాది అక్టోబర్‌ 15 నుంచి ఏటా రూ.12,500 చొప్పున రైతులకు ఇస్తాం. బోర్లు వేసి చాలా మంది నీళ్లు పడక అప్పుల పాలయ్యారు. ఇకపై అలా కాకుండా నియోజకవర్గానికి ఒక బోర్‌వెల్‌ మెషీన్‌ లెక్కన మొత్తం 200 బోర్‌వెల్‌ మెషీన్లు కొనాలని ఆదేశించాం. ఏ రైతూ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకూడదని ఈ బడ్జెట్‌ నుంచే దానిని అమలు చేస్తాం. గత ప్రభుత్వం హయాంలో రైతులకు సున్నా వడ్డీ పథకం అభాసుపాలైంది. ఇకపై అలా కాకుండా వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని ప్రవేశపెడుతున్నాం. రైతులకు, అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం. 2016 మే నుంచి అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ బంద్‌ అయింది. చంద్రబాబు పాలన నుంచి మళ్లీ రాజన్న రాజ్యం దిశగా అడుగులు వేస్తాం. రైతులకు సంబంధించిన బీమా ప్రీమియం పూర్తిగా ప్రభుత్వమే కడుతుంది. కరువు, వరదలు వచ్చినప్పుడు రైతులను ఆదుకునేందుకు ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు చేస్తాం. ఇన్‌ఫుట్‌ సబ్సిడీలను చంద్రబాబు చెల్లించలేకపోయారు. బాబు చెల్లించని ఇన్‌ఫుట్‌ సబ్సిడీ రూ.2 వేల కోట్ల సొమ్మును విడుదల చేస్తూ సంతకాలు పెట్టాను. రైతులకు ప్రతి ఏటా ఇలాంటి పరిస్థితి రాకుండా రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు చేస్తాం. కేంద్రం నుంచి కూడా రూ.2 వేల కోట్లు వస్తుంది. ఇదే బడ్జెట్‌లో దీనిని పెడతాం. రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చి ఆదుకునేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. అన్నిరకాలుగా రైతుల కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. 

విద్యార్థులకు పుస్తకాలు కూడా ఇవ్వలేక పోయారు
ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి చూస్తే బాధ కలుగుతోంది. గత ప్రభుత్వం స్కూళ్లను పట్టించుకున్న పాపాన పోలేదు. జూన్‌ మొదటి వారంలోనో, రెండవ వారంలోనో పాఠశాలలు తెరిస్తే సెప్టెంబర్‌ దాటినా కూడా పుస్తకాలు అందించలేదు. మధ్యాహ్న భోజనం పథకంలో సరుకులు కొనుగోలు చేస్తే బిల్లులు కూడా ఇవ్వలేదు. 6 నెలల నుంచి 8 నెలల పాటు బిల్లులు పెండింగ్‌ ఉన్నాయి. విద్యార్థులకు యూనిఫాం గత సంవత్సరం నుంచి ఇవ్వని పరిస్థితి. టీచర్‌ పోస్టులు భర్తీ చేయలేదు. కనీసం మరుగుదొడ్లు కూడా నిర్మించని దుస్థితి. ఈ పాఠశాలల రూపు రేఖలు మార్చబోతున్నాం. రెండేళ్లలోపే స్కూళ్లను మార్చిచూపుతాం. అవసరమైన వన్నీ కూడా సమకూరుస్తాం. 

అవ్వా తాతలకు భరోసా
నాలుగు నెలల క్రితం వరకు అవ్వా తాతలకు పింఛన్‌ ఎంత ఇస్తున్నారు అని అడిగితే వెయ్యి రూపాయలు అని చెప్పేవారు. మరికొందరు ఏమీ రావడం లేదని చెప్పేవారు. నేను పాదయాత్రలో పింఛన్‌ రూ.2 వేలు ఇస్తామంటే ఈయన ఆ మాత్రం పెంచారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2,250కి పెంచుతూ సంతకం చేశాను. ప్రతి ఏటా రూ.250 పెంచుతూ రూ.3 వేల వరకు పింఛన్‌ను తీసుకెళ్తాం. 

తెలంగాణ కంటే వెయ్యి ఎక్కువ 
ఎన్నికలు వచ్చే వరకు అంగన్‌వాడీ టీచర్లకు జీతాలు పెంచాలన్న ఆలోచన చంద్రబాబుకు ఏ నాడూ రాలేదు. తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తామన్న హామీని నెరవేర్చుతూ మేము వారి వేతనాలు పెంచాం. డ్వాక్రా యానిమేటర్ల వేతనం రూ.10 వేలకు పెంచాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట మేరకు ఆశా వర్కర్లకు రూ.10 వేలు వేతనం పెంచాం. పారిశుధ్య కార్మికులకు ఎంత ఇచ్చినా కూడా తక్కువే. వాళ్లు చేసే పని ఎవ్వరూ చేయలేరు. నిజంగా వారి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకోవాలి. అలాంటి వారిని గత సర్కారు ఉద్యోగం నుంచి తొలగించే దుర్మార్గానికి ఒడిగట్టింది. అవుట్‌ సోర్సింగ్‌ కాంట్రాక్టర్లకు దోచిపెట్టింది. పారిశుధ్య కార్మికులకు మేలు చేసే దిశగా వారి వేతనాలు రూ.18 వేలకు పెంచాం. ఆర్టీసీని విలీనం చేస్తామని కార్మికులకు మాట ఇచ్చాం. ప్రభుత్వంలో విలీనం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వీలైనంత మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తాం. ఇందుకు మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని చెప్పడానికి గర్వపడుతున్నాను. వారి అర్హతలు, సర్వీసు ఆధారంగా రెగ్యులరైజ్‌ చేస్తాం. ఔట్‌ సోర్సింగ్‌లో పనిచేసే వారికి ఇచ్చే జీతాలు చాలా తక్కువ. ఎలక్ట్రిసిటీ మీటర్ల బిల్లింగ్‌ కోసం ఔట్‌సోర్సింగ్‌ వారిని నియమించి ఇన్నాళ్లూ ప్రభుత్వం ఏజెన్సీలకు దోచిపెట్టింది. ఇకపై అలా ఉండదు. ప్రభుత్వం ఇచ్చేది నేరుగా ఆ ఉద్యోగులకు చేరేలా ఆదేశాలు జారీ చేశాం. బిల్లింగ్‌ కోసం ఒక్కో విద్యుత్‌ మీటర్‌కు రూ.4 ఇస్తే అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి ఇచ్చింది కేవలం ఒక్క రూపాయి.. నుంచి రూపాయిన్నర మాత్రమే.  

వైద్యం అందక ఎవరూ చనిపోయే పరిస్థితి ఉండకూడదు
రూ.5 లక్షలలోపు ఆదాయమున్న వారందరికీ ఆరోగ్యశ్రీ అమలు చేస్తాం. ఎవరైనా డబ్బుల్లేక వైద్యం అందలేదు అనే కారణంతో మృతి చెందకూడదు. ఈ లక్ష్యంతో పని చేస్తాం. దీనికోసం వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తాం. ప్రభుత్వం వచ్చిన 20 రోజుల్లోనే వైద్యం ఖర్చు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకూ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు రూ.400 కోట్లు బకాయిలు చెల్లించని పరిస్థితి. 108, 104 వాహనాల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. రోగులు, బాధితులు ఫోన్‌ చేస్తే 20 నిమిషాల్లో వాహనం రాలేని పరిస్థితి. అందుకే 350 కొత్త 108 అంబులెన్స్‌లు కొనుగోలు చేసేందుకు ఆదేశాలు జారీ చేశాం. మండలానికి ఒక వాహనం లెక్కన 650 కొత్త 104 అంబులెన్స్‌లు కొనుగోలుకు ఆదేశాలు ఇచ్చాం. ఆరోగ్యశ్రీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు వైద్య నిపుణులతో మెడికల్‌ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేశాం. నివేదిక ఇచ్చేందుకు రెండు నెలలు గడువు ఇచ్చాం. ఏంచేస్తే మంచిదో చెప్పమన్నాం. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎలా మార్చితే ప్రజలకు మంచి జరుగుతుందో చెప్పాలని సూచించాం. ఈ పథకాన్ని అమలు చేసే విషయంలో దేశం మొత్తం మనవైపు చూసేలా చేస్తామని చెప్పడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. 

ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్లపట్టాలు
దేశంలో, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా వచ్చే ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందజేసి రిజిస్ట్రేషన్‌ చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. పండుగలా ప్రతి గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇస్తాం. అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయిస్తాం. అగ్రిగోల్డు బాధితులకు రూ.1,150 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నాం. దీంతో ప్రభుత్వ లెక్కల ప్రకారం అక్షరాల 9 లక్షల మందికి మేలు జరుగుతుందని భావిస్తున్నాం. గత ప్రభుత్వం అగ్రిగోల్డ్‌ బాధితులను నిలువునా ముంచింది. 

గ్రామ సచివాలయాలతో సత్వర లబ్ధి
అక్టోబర్‌ 2న గాంధీ జయంతి. ఆ రోజు నుంచే గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నాం. గ్రామ సెక్రటేరియట్, గ్రామ వలంటీర్లను తీసుకొచ్చి వ్యవస్థలో మార్పు తెస్తాం. లబ్ధిదారుడికి మంచి జరిగేందుకు చర్యలు తీసుకున్నాం. గ్రామ సెక్రటేరియట్‌లో ప్రతి గ్రామంలో పది మందికి ఉద్యోగాలు ఇస్తామని గర్వంగా చెబుతున్నాను. అగస్టు 15 నుంచి ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వలంటీర్‌ను నియమిస్తాం. రూ.5 వేల గౌరవ వేతనంతో 4 లక్షల మందిని నియమిస్తున్నాం. అవినీతి, పక్షపాతం ఎక్కడా లేకుండా ప్రభుత్వ పథకాలు డోర్‌ డెలివరీ చేస్తాం. వలంటీర్లు అవినీతికి పాల్పడకుండా ఉండేందుకే రూ.5 వేలు వేతనం ఇస్తున్నాం.

అవినీతికి పాల్పడిన వారికి శిక్ష తప్పదు
ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి పెంచుతూ ఆదేశాలు జారీ చేశాం. వచ్చే నెల 1 నుంచి ఇది అమలవుతుంది. సీపీఎస్‌ రద్దు చేస్తామని మాట చెప్పాం. దానిని రద్దు చేసే దిశగా కమిటీ ఏర్పాటు చేశామని గర్వంగా చెబుతున్నాం. ఎంచి చూడగా మనుషులందున మంచి చెడులు రెండే కులములని మహాకవి చెప్పారు. అవినీతికి, అన్యాయానికి పాల్పడితే ఎంతటి వారైనా సహించేది ఉండదు. రాష్ట్ర విభజన ఎవరు చేశారో అందరికీ తెలుసు. గత ప్రభుత్వం ఏం చేసిందో కూడా తెలుసు. గత ఐదేళ్లుగా గాయాలు మానలేదు. గత పాలకులు రక్తం పిండారు. ఆర్థిక వ్యవస్థను సర్వనాశం చేశారు. అస్తులు పోయి అప్పులు మిగిలాయి. రంగాల వారీగా.. వ్యవసాయం, పరిశ్రమలు, సేవ, చదువులు, ఉద్యోగాలు, నీటి ప్రాజెకులు.. ఇలా ఆయా రంగాల పరిస్థితిని సభలోనే ప్రజల ముందుంచుతా. మా ప్రభుత్వంలో రాజకీయ కక్షసాధింపులు ఉండవు. కానీ అవినీతికి పాల్పడిన వారికి కచ్చితంగా శిక్ష తప్పదు. పేదలు పేదలుగా ఉండటానికి, చదువుకునే శక్తిలేని పిల్లలు ఉండటానికి వీలు లేదు. సమానత్వం అందకుండా ఉండటానికి వీలు లేదు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ప్రతిపక్షాలు, ఎల్లోమీడియాను కూడా సహకరించాలని కోరుతున్నాను. సహకరించకపోయినా నా అడుగులు ముందుకే అని స్పష్టం చేస్తున్నాను. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు’’ అంటూ ముఖ్యమంత్రి జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు. 

ప్రైవేటు విద్యా సంస్థల్లో 25 శాతం రిజర్వేషన్‌
గత ప్రభుత్వం ప్రైవేటు స్కూలు యాజమాన్యాలకు అమ్ముడు పోయింది. ప్రతి ప్రైవేట్‌ విద్యా సంస్థలో పేదలకు 25 శాతం సీట్లు ఇవ్వాల్సి ఉన్నా ఏ ఒక్క స్కూల్‌లోనూ ఇది అమలు కాలేదు. ఆ దిశగా ప్రయత్నమూ జరగలేదు. ఈ దృష్ట్యా విద్యా హక్కు చట్టాన్ని పునరుద్ధరిస్తాం. ప్రతి ప్రైవేట్‌ స్కూల్‌లో 25 శాతం సీట్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. స్కూళ్లు, కాలేజీల్లో పేదలకు భారం లేకుండా ఫీజులు తగ్గిస్తాం. దీనికోసం ‘ఫీ రెగ్యులేటరీ, క్వాలిటీ మానిటరింగ్‌ కమిషన్‌లను ఏర్పాటు చేస్తాం. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లోనే ఈ చట్టాలు తెస్తాం. 2011 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో 33 శాతం మంది చదువు రాని వారున్నారు. జాతీయ సగటు 26 శాతం మాత్రమే. దేశంలో మనమే వెనుకబడ్డాం. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ‘అమ్మ ఒడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నిరక్షరాస్యతను రూపుమాపుతాం. జనవరి 26న (గణతంత్ర దినోత్సవం రోజున) రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం మధ్య ఈ పథకాన్ని ప్రారంభిస్తాం. పిల్లలను బడికి పంపించిన ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు చెల్లిస్తాం. 

నీటి పారుదల ప్రాజెక్టులో అవినీతిని పెకలిస్తాం
నీటి పారుదల రంగంలో ఏ ప్రాజెక్టును తీసుకున్నా అవినీతే. ఆ అవినీతిని కూకటి వేళ్లతో పెకలించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రతి పనిమీదా అధ్యయనం జరుగుతుంది. అంచనాలు ఎలా పెంచారో ఇంజినీర్లు తేలుస్తారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఆ వర్క్‌ను మారుస్తాం. ఫ్రీ క్వాలిఫికేషన్‌ ద్వారా ఎక్కువ మంది టెండరింగ్‌లో పాల్గొనే విధంగా పారదర్శకంగా మార్పులు చేస్తాం. తద్వారా 15 నుంచి 20 శాతం రేట్లు తగ్గుతాయి. ఏ స్థాయిలో అవినీతి జరిగిందో ప్రజలందరికీ తెలుస్తుంది. ముఖ్యమంత్రులు, ఉద్యోగులు, మంత్రులు ఎవరైనా సరే.. అందరూ ప్రజా సేవకులే. ప్రతి ఒక్కరూ నీతిమంతంగా ఉండాలి. అవినీతిని మాత్రం సహించేది లేదు.

పేదలకు మంచి బియ్యం
ఏ బియ్యం అయితే మనం తినగలుగుతామో ఆ బియ్యాన్నే పేదలకు ఇవ్వాలని ఆదేశించాం. చౌక దుకాణాల నుంచి ఇచ్చే బియ్యం నాణ్యతను మారుస్తాం. మనందరం తినే బియ్యాన్నే పేదలకు ఇస్తాం. ఆ బియ్యాన్ని 5, 10, 15 కేజీల చొప్పున ప్యాక్‌ చేసి డోర్‌ డెలివరీ చేస్తాం. వేలిముద్రలు పడటం లేదని ఏ ఒక్కరికి కూడా ఇవ్వని పరిస్థితి రాకుండా చేస్తాం. వేలి ముద్రలు పడకపోతే వీడియో స్క్రీనింగ్‌ తీసుకోండని చెప్పాం. రాబోయే రోజుల్లో ప్రతి ప్రభుత్వ పథకం కూడా నేరుగా డోర్‌ డెలివరీ చేసే కార్యక్రమం చేపట్టాం. ఎక్కడా కూడా అవినీతి, అన్యాయం జరుగకుండా ఉండేందుకు ఆదేశాలు ఇస్తున్నాను. ఎక్కడైనా అన్యాయం జరిగిందని ఫోన్‌ చేస్తే ఆ గ్రామ వలంటీర్‌ను తొలగిస్తామని గర్వంగా చెబుతున్నాం. ఇందుకోసం నేరుగా సీఎం కార్యాలయంలో టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేస్తున్నాం. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు, పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందజేస్తాం. ఎన్నికల తర్వాత అందరూ మనవాళ్లే. 

రాష్ట్రంలోని దాదాపు 40 వేల పాఠశాలల ప్రస్తుత పరిస్థితిని ఫొటోలు తీయండని చెప్పాం. వాటి పరిస్థితి సరిదిద్ది మళ్లీ రెండేళ్ల తర్వాత కొత్త ఫొటోలు చూపిస్తాం. బాత్రూం మొదలు నీళ్లు, ఫర్నీచర్‌.. ఇంకా ఏమేం కావాల్లో అన్నీ ఇస్తాం. అన్ని స్కూళ్లనూ ఇంగ్లిష్‌ మీడియంగా మారుస్తాం. తెలుగు సబ్జెక్ట్‌ కచ్చితంగా అమలు చేస్తాం. ప్రభుత్వ స్కూళ్లు.. నారాయణ స్కూళ్లకు ఏమాత్రం తగ్గకుండా చేస్తాం. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత పెంచేందుకు బడ్జెట్‌ పెంచుతాం.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top