చంద్రబాబు మాకు మిత్రుడే

Chandrababu Naidu hits out at Rajnath Singh over his Lok Sabha - Sakshi

లోక్‌సభలో స్పష్టం చేసిన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

ఏపీకి ఎంత చేయాలో అంత చేస్తామని వెల్లడి

ఇక హోదా అంశం పక్కన పెట్టాలని హితవు

విపక్షాల్లోనే ఒకరిపై ఒకరికి విశ్వాసం లేదని వ్యాఖ్య

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీజేపీ బంధం బలమైనదని లోక్‌సభ సాక్షిగా మరోసారి నిరూపితమైంది. ‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకొచ్చినా ఈ రోజుకీ ఆయన మా మిత్రుడే. ఇకపై కూడా మా మిత్రుడిగానే కొనసాగుతారు. మా బంధం తెగిపోయేదికాదు’ అని శుక్రవారం లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ అన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీకి కేటాయించిన నిధులు, సాయంపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన వల్ల ఏర్పడిన సమస్యలేంటో మాకు తెలుసు. ఏపీ అభివృద్ధికి ఎంత సాయం అవసరమో అంతా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

విభజన చట్టాన్ని ఇప్పటికే చాలా వరకు అమలు చేశాం. నూతన రాజధాని నిర్మాణానికి రూ. 1,500 కోట్లు ఇచ్చాం. గుంటూరు, విజయవాడకు అదనంగా రూ. వెయ్యి కోట్లు ఇచ్చాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 6,764 కోట్లు విడుదల చేశాం. ప్రాజెక్టు వ్యయానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై చర్చ జరుగుతోంది. త్వరలోనే ఈ విషయంలో ఒక స్పష్టత వస్తుంది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.1,050 కోట్లు ఇచ్చాం. అవసరమైతే ఇంకా ఇస్తాం. రిసోర్స్‌ గ్యాప్‌ భర్తీకి రూ.3, 979 కోట్లు విడుదల చేశాం. 2015–20 కాలానికి ఆర్థిక లోటును రూ. 22,113 కోట్లతో భర్తీ చేయాలని 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది.

ఇందుకోసం 2015–18 మధ్య కాలంలో రూ. 15,959 కోట్లు విడుదల చేశాం. ఇవి కాకుండా ఏపీకి అదనంగా సెంట్రల్‌ యూనివర్శిటీ, గిరిజన విశ్వవిద్యాలయం, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం, అమరావతి చుట్టూ వంద కిలోమిటర్లు రింగురోడ్డు, ఎయిమ్స్, అగ్రికల్చర్‌ వర్సిటీకి రూ. 135 కోట్లు మంజూరు చేశాం. వైజాగ్‌–చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌కు అనుమతులిచ్చాం. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ద్వారా ఏపీకి 2015–20 కాలానికి కేంద్రం నుంచి రూ. 2,06,910 కోట్లు మంజూరు కానున్నాయి. 2016 సెప్టెంబర్‌లో ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రూ.8,140 కోట్ల విలువైన ఈఏపీ ప్రాజెక్టులకు అనుమతించాం. టీడీపీ ఇక ప్రత్యేక హోదా అంశాన్ని పక్కనపెట్టి ఇప్పటి వరకు మంజూరు చేసిన ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రాన్ని అభివద్ధి చేయడంపై దృష్టి సారించాలి’ అని సూచించారు.  

సిక్కుల ఊచకోతే అతిపెద్ద మూకదాడి..
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం జరిగిన సిక్కుల ఊచకోతే అతిపెద్ద మూకదాడి అని రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఇలాంటి ఘటనల నివారణకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని, కానీ రాష్ట్రాలే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల జరుగుతున్న వరస మూకహత్యలపై కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్న ప్రతిపక్షాలకు గట్టి సమాధానమిచ్చారు. 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లే అతిపెద్ద మూకహత్యా ఘటనలని, ఇందిరా గాంధీ హత్యానంతర పరిస్థితులను ప్రస్తావించారు.

ఈ వ్యవహారంలో తమ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందని, సిక్కు వర్గానికి తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించిన ప్రతిపక్షాల్లోనే ఒకరిపై ఒకరికి విశ్వాసం లేదని హేళన చేశారు.‘ఎవరిపై మీరు అవిశ్వాసం ప్రకటించారు? ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న నమ్మకంతో ఆయన ఇచ్చిన పిలుపు మేరకు లక్షలాది కుటుంబాలు స్వచ్ఛందంగా గ్యాస్‌ సబ్సిడీని వదులుకున్నాయి. కానీ ప్రతిపక్షాల్లోనే ఒకరిని మరొకరు విశ్వసించే పరిస్థితి లేదు. తమ నాయకుడు, విధానాల గురించి వాళ్లకే స్పష్టత లేదు’ అని అన్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top