చేతులెత్తేశారు..! | Chandrababu naidu Fire on YSR Kadapa TDP Leaders | Sakshi
Sakshi News home page

చేతులెత్తేశారు..!

Apr 20 2019 12:32 PM | Updated on Apr 20 2019 12:32 PM

Chandrababu naidu Fire on YSR Kadapa TDP Leaders - Sakshi

‘టికెట్‌ కోసం పోరాడి సంపాదించుకుని తర్వాత చేతులెత్తేస్తారా... బుద్ధుండాలి కదా... ఎలెక్షన్‌ చేసుకోవడం తెలియనప్పుడు సీటు కావాలని కోరడమెందుకు... పదవులు తీసుకుంటే సరిపోదు...న్యాయం చేయాల్సిన పనిలేదా...– టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

సాక్షి ప్రతినిధి కడప: ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా టీడీపీ నేతలపై మండిపడ్డారు. ఎన్నికల విషయంలో సమన్వయం చేసుకోవడంలో విఫలమయ్యారని చీవాట్లు పెట్టారు. క్యాంపెయినింగ్, పోల్‌ మేనేజ్‌మెంటులో విఫలమయ్యారని ఫైర్‌ అయ్యారు. శుక్రవారం ఉదయం ఆర్‌అండ్‌బీ గెస్టుహౌస్‌లో జిల్లాలో టీడీపీ అభ్యర్థులతో సీఎం సమీక్ష నిర్వహించారు. కడప అసెంబ్లీ అభ్యర్థి అమీర్‌బాబుపై విరుచుకుపడ్డట్లు సమాచారం. టికెట్‌ కావాలని పట్టుబట్టి సాధించినప్పుడుఅదే స్థాయిలో పోరాటం చేయాలి కదా... టికెట్‌ తీసుకొని చేతులెత్తేస్తారా... ముందు బీరాలు పలికి,  టికెట్‌ వచ్చాక కనీస పోరాటం చేయకపోవడం ఏమిటని నిలదీసినట్లు తెలు స్తోంది. పదవులు తీసుకుంటే సరి పోదు. వాటికి న్యాయం చేయాలన్నారు. నాయకుల మధ్య సమన్వ యం చేసుకోవడంలో విఫలమయ్యారని జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డిపై ఆయన మండిపడ్డారు. టీమ్‌ వర్క్‌ అసలు లేదన్నారు.  ఎప్పుడు మారతారంటూ రుసరుసలాడినట్లు సమాచారం. మరికొందరికి చురకలు అం టించినట్లు తెలుస్తోంది. గౌరవం కాపాడుకోవడంలో విఫ లమయ్యారని ఘాటుగా వ్యాఖ్యానించినట్లు సమాచారం.

రాజకీయ జీవితాన్ని నాశనం చేశారు..:ఎంపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి
తన రాజకీయ జీవితాన్ని నాశనం చేశారంటూ కడప ఎంపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. మిమ్మల్ని నమ్మి ఎన్నికల్లో నిలవడం నేను చేసిన అతి పెద్ద తప్పుంటూ మండిపడ్డారు. సమీక్షలో టీడీపీ అభ్యర్థుల ఎదుట ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ ‘ నన్ను తడిగుడ్డతో గొంతు కోశారని ’ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు పెడతామంటే కదా మీకు టికెట్‌ ఇచ్చింది. టికెట్‌ తెచ్చుకున్నాకా, చేతులెత్తేస్తారా...పార్టీని నాశనం చేశారు. నా కెరీర్‌ను నాశనం చేశారంటూ పత్రికల్లో రాయలేని భాషలో వ్యాఖ్యానించారు. అమీర్‌బాబు కాదు...గరీబ్‌బాబు అని చెప్పుకొని పార్టీ టికెట్‌ తెచ్చుకోవాల్సింది. టికెట్‌ తెచ్చుకున్నావ్,  డబ్బులు పెట్టలేకపోయావ్‌. నీలాగా ఖర్చు చేయగల్గిన మైనార్టీ నాయకుడు పార్టీలో లేరా... నువ్వే కావాలా...అంటూ తనదైన భాషలో విరుచుకుపడ్డారు. లింగారెడ్డి తన పేరులో ‘లి’ స్థానంలో ‘దొ’ పెట్టుకొని ఉంటే బాగుండు అని విమర్శించారు. 

పోటీచేసేందుకు అనేక రకాలుగా పోరాటం చేసి టికెట్‌ సాధించి ఎన్నికల ఖర్చు దగ్గర చేతులెత్తేశారని మండిపడ్డారు. రూ.40 లక్షలు చేతికి ఇచ్చి ఓటర్లకు పంచాల్సిందిగా చెప్పారని, ఏజెంట్లను పెట్టుకునేందుకు ఖర్చులకు కావాలని రూ.48లక్షలు తీసుకున్నారని ‘లింగారెడ్డి...దొంగారెడ్డి’ అయ్యాడని తన శైలిలో వ్యాఖ్యానించారు. డబ్బులు లేనప్పుడు పోటీచేయడం ఎందుకని విరుచుకుపడినట్లు తెలుస్తోంది. సీఎం సమీక్షకు బద్వేల్‌ అభ్యర్థి రాజశేఖర్, రాజంపేట ఎంపీ అభ్యర్థి సత్యప్రభ గైర్హాజరయ్యారు.

నాలుగు సీట్లు గెలుస్తాం...రెండు చోట్ల టఫ్‌ ఫైట్‌...
జిల్లాలో నాలుగు సీట్లు గెలుస్తున్నామని, రెండు చోట్ల టఫ్‌ ఫైట్‌ ఇచ్చామని, ఆ రెండు చోట్ల కూడా గెలుపు అవకాశాలు ఉన్నాయని జిల్లా నేతలు సీఎం చంద్రబాబుకు వివరించారు. జమ్మలమడుగు విజయం సునాయసమని, కమలాపురం, మైదుకూరు, రాయచోటి  గెలుస్తున్నామని, మన అభ్యర్థులు బాగా కష్టపడ్డారని టీడీపీ నేతలు వివరించారు. బద్వేల్, రాజంపేటలో గట్టిపోటీ ఇచ్చామని ..గెలిచే అవకాశాలు ఉన్నాయని వివరించినట్లు సమాచారం.. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని, 110 నుంచి 140 సీట్లు వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు పేర్కొన్నట్లు సమాచారం. అనంతరం కడప నుంచి సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానంలో కర్నూల్‌ టీడీపీ నేతల సమీక్షకు తరలివెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement